5 నెలల చిన్నారిపై హత్యాచారం.. ఏ శిక్ష వేసినా తక్కువే అన్న జడ్జి

5 నెలల చిన్నారిపై హత్యాచారం.. ఏ శిక్ష వేసినా తక్కువే అన్న జడ్జి

లక్నో: ఐదు నెలల చిన్నారి.. లోకం తెలియని పసికందు.. వరుసకు చెల్లెలు అవుతుంది. ఆ పాపను తండ్రిలా లాలించేంత వయసున్న మేజర్ అయ్యుండి.. కిరాతకుడిలా ప్రవర్తించాడు. జంతువులు కూడా చేయని విధంగా పసిదానిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మదియాన్‌కు చెందిన ప్రేమ్‌ చంద్ర అలియాస్‌ పప్పూ దీక్షిత్ అనే వ్యక్తి గత ఏడాది ఫిబ్రవరి 17న ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించి పోక్సో కోర్టు విచారణ పూర్తి ఆ దుర్మార్గుడికి గురువారం శిక్ష ఖరారు చేసింది. చావు తప్ప ఏ శిక్ష వేసినా అది చిన్నదే అవుతుందని జడ్జి అర్వింద్ మిశ్రా తీర్పు ఇస్తూ వ్యాఖ్యానించారు. దోషిగా తేలిన ప్రేమ్‌ చంద్రకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసును ‘అత్యంత అరుదైన కేసు’గా పరిగణిస్తూ మరణ శిక్ష వేసినట్లు చెప్పారు. హైకోర్టు ఆమోదం లభించాక దోషికి శిక్ష అమలు చేయాలని జడ్జి ఆదేశించారు. అలాగే దోషికి రూ.70 వేల జరిమానా కూడా విధించారు. ఈ మొత్తాన్ని బాధితురాలి కుటుంబానికి అందించాలని జడ్జి చెప్పారు.

ఇలాంటోళ్లు బంధాలకు విలువ లేకుండా చేస్తున్నరు

ఈ కేసులో తీర్పు ఇస్తూ జడ్జి మిశ్రా.. సమాజాన్ని ఆలోచింపజేసేలా వ్యాఖ్యలు చేశారు. ఉరి విధిస్తున్నట్లు ప్రకటించిన సమయంలో దోషి తనకు శిక్ష తగ్గించాలని కోరడంతో జడ్జి ససేమిరా అంటూ ఈ నేరానికి ఎంతటి శిక్ష వేసినా తక్కువేనని అన్నారు. పసికందుపై ఈ కిరాతకుడు చేసిన పనిని.. జంతువులు కూడా  చేయవన్నారు. ‘‘మన దేశంలో పసిపిల్లలను దేవతల ప్రతిరూపాల్లా చూస్తాం. నవరాత్రుల సమయంలో చిన్నారులను దుర్గా మాతగా పూజిస్తారు. తొమ్మిది రోజులు ఉపవాసాలు ఉండి ఆ చిన్నారులకు ప్రత్యేకమైన ప్రసాదాలు వడ్డిస్తారు. అటువంటిది 5 నెలల పసికందుపై అత్యాచారం చేసి, చంపేసి మళ్లీ శిక్ష విషయంలో దయ చూపాలని అడగడమా?” అంటూ జడ్జి కామెంట్స్ చేశారు. పైగా ఆ చిన్నారిని దోషికి చెల్లెలు అవుతుందని, ఇలాంటోళ్లు సమాజంలో బంధాలకు విలువ లేకుండా చేస్తున్నారని అన్నారు.

For More News..

డబ్బుల కోసం సెల్ఫ్ కిడ్నాప్.. రంగంలోకి పోలీసులు

గ్రీన్ ఫండ్.. ఐఏఎస్‎ల నుంచి విద్యార్థుల వరకు చెల్లించాల్సిందే!

ఇష్టమున్నట్లు గీతలు గీసి ఏడు మండలాలను కలిపేసుకుంటారా?