చైనా ప్రొడక్ట్​లపై 15% అదనపు సుంకం

చైనా ప్రొడక్ట్​లపై 15% అదనపు సుంకం

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. చైనా ప్రొడక్స్ట్ పై అమెరికా 15 శాతం అదనపు సుంకం విధించింది. అమెరికా తోపాటు ప్రపంచ ఆర్థిక వృద్ధి స్లోడౌన్ అవుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కొత్త ట్రేడ్ డీల్ పై చైనా సంతకం చేసేలా ఒత్తిడి పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి దిగుమతయ్యే ఆహార పదార్థాలు, క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాలు, స్పోర్స్ట్ వేర్, ఫర్నిచర్ ఇతర వస్తువులకు కొత్త సుంకం వర్తిస్తుందని యూఎస్ ట్రేడ్ రిప్రజంటేటివ్స్ ఆఫీస్ తెలిపింది. కొత్త సుంకం విధించే నిర్ణయాన్నివాయిదా వేసే ప్రసక్తే లేదని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ శుక్రవారమే ప్రకటించారు. అమెరికా ఉత్పత్తులపై సుంకం విధిస్తామని చైనా కూడా హెచ్చరించింది. కొత్త సుంకం అమలును వాయిదా వేయాలని అమెరికాకు చెందిన వందలాది కంపెనీలు ట్రంప్ సర్కారును కోరాయి. రెండోసారి అమెరికా అధ్యక్షుడి ఎన్నికల కోసం ఇదివరకే క్యాంపెయిన్ ప్రారంభించిన ట్రంప్ దూకుడు పెంచారు. “చైనాతో చర్చలు జరుపుతాం. మీటింగ్ షెడ్యూల్ ఖరారు చేశాం.సెప్టెంబర్ లోనూ మీటింగ్ కొనసాగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం” అని ట్రంప్ ట్వీట్ చేశారు.అమెరికా కంపెనీలు చైనాతో వ్యాపారం నిలిపివేయాలని గతంలో ట్రంప్ చేసిన ట్వీట్ అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తర్వాత దాన్ని ఆయన సవరించుకున్నారు. 2018 మార్చిలో అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్టం భన నెలకొంది.