ఇండియా కన్నా మేమే ముందున్నాం

ఇండియా కన్నా మేమే ముందున్నాం
  • కరోనా టెస్ట్ ల్లో వరల్డ్ రికార్డు
  • చైనాకు దర్యాప్తు టీమ్ ను పంపిస్తాం
  • అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్ : కరోనా టెస్ట్ ల్లో ఇండియా కన్నా మేమే ముందున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కరోనా టెస్ట్ లను అన్ని దేశాల కన్నా ఎక్కువ మేమే చేశామని ఇది వరల్డ్ రికార్డ్ అని ఆయన చెప్పారు. ఆదివారం వైట్ హౌజ్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇప్పటికి వరకు అమెరికా 4.18 మిలియన్ మందికి కరోనా టెస్ట్ చేసినట్లు లెక్కలు వివరించారు. ‘‘ఫ్రాన్స్‌, బ్రిటన్, సౌత్ కొరియా, జపాన్‌, సింగపూర్‌, ఇండియా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, స్వీడన్‌, కెనడా లాంటి పది దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక మందికి కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాం. ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉండకపోతే ఇప్పటికే లక్షలాది మంది చనిపోయేవారు ” అని ట్రంప్ అన్నారు. కరోనా పై పోరులో మేము వ్యవహారిస్తున్న తీరు మంచి ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వానికి సహకరిస్తున్న పౌరులకు ధన్యవాదాలు అని ట్రంప్ అన్నారు. కరోనా కేసుల్లో అమెరికాయే టాప్ లో ఉంది. ఇక్కడ దాదాపు 7, 65, 000 లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క న్యూయార్క్ లోనే 35 శాతానికి పైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల నుంచి ఇక్కడ కేసుల సంఖ్య 50 శాతం తగ్గింది. దీని పై ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా కేసుల గ్రాఫ్ తగ్గుతుందని ఇది శుభపరిణామమని చెప్పారు. లక్షమంది కరోనా చనిపోతారని అంచనా వేసినప్పటికీ 60 వేల మార్కు వద్ద ఆగిపోతుందన్న నమ్మకం ఉందన్నారు. కరోనా పై పోరులో కష్టపడుతున్న అధికార యంత్రాంగాన్ని ట్రంప్ ప్రశంసించారు. ఇటలీ, స్పెయిల్ సరైన ముందు జాగ్రత్తలు తీసుకోనందునే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు.
చైనాలో దర్యాప్తు చేస్తాం
కరోనా వైరస్ పుట్టుకను తెలుసుకునేందుకు చైనాకు అమెరికా నుంచి ఇన్వెస్టిగేషన్ టీమ్ ను పంపిస్తామని ట్రంప్ చెప్పారు. కరోనా వ్యాప్తి కావాలనే చేసి ఉంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన మరుసటి రోజే యూఎస్ టీమ్ ను చైనా కు పంపిస్తామని చెప్పారు. కరోనా విషయంలో చైనా వ్యవహారించిన తీరుపై ట్రంప్ ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. “చైనాలో ఏం జరుగుతుందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం…కరోనాకు ముందు వరకు చైనా తో ఉన్న సంబంధాల పట్ల నేను సంతోషంగానే ఉన్నాను. కానీ కరోనా మొదలయ్యాక ఆ సంతోషం లేదు ” అని ట్రంప్ అన్నారు. ఇప్పటికే కరోనా వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయ్యిందా అన్న దానిపై అమెరికా విచారణ స్టార్ట్ చేసింది.
వీలైనంత తర్వగా లాక్ డౌన్ ఎత్తివేయండి
అమెరికాలో వీలైనంత త్వరగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలంటూ రాష్ట్రాల గవర్నర్లు ట్రంప్ ను కోరారు. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తక్కువ ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో జనం లాక్ డౌన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు మరింత పెరగకముందే లాక్ డౌన్ ను ఎత్తివేయాలంటూ రాష్ట్రాల గవర్నర్లు ట్రంప్ ను కోరారు. లేదంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పారు. మేరీలాండ్, వర్జినియా, వాషింగ్టన్ లలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బోస్టన్, చికాగో పలు ప్రాంతాలను హాట్ స్పాట్లుగా మార్చారు. ఓహియో, టెక్సాస్, ఫ్లోరిడా లాంటి స్టేట్ లలో తక్కువ కేసులు ఉండటంతో ఆయా స్టేట్స్ గవర్నర్లు లాక్ డౌన్ అవసరం లేదని చెబుతున్నారు.