ఇరాన్ ఎఫెక్ట్…ఇండియా ఎకానమీ షేక్​

ఇరాన్ ఎఫెక్ట్…ఇండియా ఎకానమీ షేక్​
  • పెట్రోల్,డీజిల్ ధరలు పైపైకి
  • ఆరున్నరేండ్ల గరిష్టానికి గోల్డ్ రేట్స్
  • నగల బంగారం 10 గ్రా. రూ. 40,678
  • వీకైన రూపాయి.. కుప్పకూలిన స్టాక్ మార్కె ట్స్

అమెరికా, ఇరాన్​ దేశాల మధ్య యుద్ధం వస్తుందో రాదో తెలియదు కానీ ప్రపంచం మొత్తమ్మీద ఈ ఎఫెక్ట్​ మామూలుగా పనిచేయలేదు. స్టాక్​ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. పెట్రో ధరలు భగ్గుమన్నాయి. బంగారం ఆరున్నరేండ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగింది. ప్రపంచంలో మిగతా కరెన్సీలతో పాటు మన రూపాయి కూడా బాగా దెబ్బతిన్నది.

న్యూఢిల్లీబంగారం, పెట్రో ధరలు పెరగడం, రూపాయి బలహీన పడడంతో సహజంగానే  ఇండియన్‌‌ బెంచ్‌‌మార్క్‌‌ ఇండెక్స్‌‌లు సెన్సెక్స్‌‌ 788 పాయింట్లు, నిఫ్టీ 243 పాయింట్లు నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు అన్నీ నెగిటివ్‌‌లో ట్రేడయ్యాయి. జపాన్‌‌ నికాయ్‌‌ 2 శాతం మేర పడిపోయింది. యూరోపియన్‌‌ మార్కెట్లు శుక్రవారం ప్రతికూలతను కొనసాగించాయి. క్రూడ్‌‌ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్న ఇండియా వంటి దేశాలపై ఇది అధికంగా ప్రభావం చూపుతోంది.  క్రూడ్‌‌ ఆయిల్‌‌ అంతర్జాతీయ మార్కెట్లో 10 డాలర్లు పెరిగితే, ఇండియా క్రూడ్‌‌ దిగుమతులపై చేసే ఖర్చు మరో రూ. 10,800 కోట్లు పెరుగుతుంది. మరోవైపు ఇన్వెస్టర్లు బంగారం వంటి సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు గత జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. మరోవైపు ఇండియన్‌‌ కరెన్సీ రూపాయి, డాలర్‌‌‌‌ మారకంలో బలహీనపడి 72 మార్కును దాటింది. దీంతో ఇండియా దిగుమతి చేసుకునే ప్రతి వస్తువుకు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ అంశాల వలన దేశ ద్రవ్యలోటు అదుపు తప్పే అవకాశం ఉంది.

భారీగా పడ్డ  ఇండియన్‌‌ మార్కెట్లు..

అంతర్జాతీయ మార్కెట్లతో పోల్చుకుంటే ఇండియా మార్కెట్లు అధికంగా నష్టపోయాయి. గత రెండు సెషన్‌‌లలోనే  రూ. మూడు లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. బెంచ్‌‌మార్క్‌‌ ఇండెక్స్‌‌ సెన్సెక్స్‌‌ 788 పాయింట్లు నష్టపోయి 40,676.63 వద్ద ముగిసింది. నిఫ్టీ 234 పాయింట్లు పడిపోయి 11,993 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఒకనొక దశలో  సెన్సెక్స్‌‌ 828 పాయింట్లు పతనమయి, 40,636 పాయింట్ల స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 245 పాయింట్లు నష్టపోయి 11,981 స్థాయికి పతనమయ్యింది. ఎన్‌‌ఎస్‌‌ఈలో  ఐటీ ఇండెక్స్‌‌ మినహా మిగిలిన అన్ని ఇండెక్స్‌‌లు నష్టాల్లో ముగిశాయి.  డాలర్‌‌‌‌ మారకంలో రూపాయి క్షీణించడంతో  బ్యాంకింగ్‌‌ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ బ్యాంక్‌‌ ఇండెక్స్‌‌ 2.6 శాతం నష్టపోయింది. ఫెడరల్‌‌ బ్యాంక్‌‌, ఎస్‌‌బీఐ, బ్యాంక్‌‌ ఆఫ్‌‌ బరోడా, పీఎన్‌‌బీ, ఆర్‌‌‌‌బీఎల్‌‌ షేర్లు ఎక్కువగా పడిపోయాయి. నిఫ్టీ పీఎస్‌‌యూ బ్యాంక్‌‌ ఇండెక్స్‌‌ 2 శాతం మేర పడిపోగా, నిఫ్టీ మెటల్‌‌, ఫార్మా, ఆటో, రియల్టీ ఇండెక్స్‌‌లు ఒక  శాతం పడిపోయాయి. డిసెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌కు సంబంధించి కంపెనీ అప్‌‌డేట్ ఇవ్వడంతో  టైటాన్‌‌ షేరు పాజిటివ్‌‌గా ముగిసింది. మిగిలిన షేర్లలో టీసీఎస్‌‌, డా. రెడ్డీస్‌‌, విప్రో షేర్లు లాభపడ్డాయి. ఎస్‌‌బీఐ, బజాజ్‌‌ ఫైనాన్స్‌‌, వేదంతా, జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ షేర్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌‌లో కేవలం టైటాన్‌‌, పవర్‌‌‌‌గ్రిడ్‌‌  షేర్లు  మాత్రమే పాజిటివ్‌‌గా ముగిశాయి. ఇండస్‌‌ఇండ్‌‌ బ్యాంక్, బజాజ్‌‌ ఫైనాన్స్‌‌, ఎస్‌‌బీఐ షేర్లు 4–5 శాతం మేర నష్టపోయాయి. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, టాటా స్టీల్‌‌, రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌, మారుతి సుజుకీ షేర్లు 2–3 శాతం పతనమయ్యాయి.  ఈ నెలలో  వాణిజ్య ఒప్పందంపై అమెరికా, చైనా సంతకాలు చేయనున్నాయి. బడ్జెట్‌‌ అంచనాలతో గత వారం ఇండియన్ మార్కెట్లు గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. చిన్న కరెక్షన్ ​మార్కెట్లకు లాంగ్‌‌ టర్మ్‌‌లో మంచిదేనని విశ్లేషకులు అన్నారు.

నెగిటివ్‌‌లో అంతర్జాతీయ మార్కెట్లు..

అంతర్జాతీయ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. జపాన్‌‌ మార్కెట్‌‌ 2 శాతం పడిపోగా, హాంగ్‌‌కాంగ్ 0.7 శాతం,  ఆస్ట్రెలియా 0.4 శాతం నష్టపోయాయి. సింగపూర్‌‌‌‌ మార్కెట్‌‌ 0.5 శాతం,  దక్షిణ కొరియా మార్కెట్‌‌ ఒక శాతం పడిపోయాయి. షాంఘై ఇండెక్స్‌‌ నెగిటివ్‌‌లో ప్రారంభమై నష్టాలను పూడ్చుకోగలిగింది. యూరోపియన్‌‌ స్టాక్‌‌ మార్కెట్లు సోమవారం సెషన్‌‌లో నష్టాలను కొనసాగించాయి.

రూపాయి ‘వీక్​’

డాలర్​తో మారకం విషయంలో అసలే బలహీనంగా ఉన్న రూపాయి సోమవారం మరింత వీక్​ అయిపోయింది.క్రూడ్‌‌ ఆయిల్‌‌ ధరలు భారీగా పెరగడంతో ఇండియన్‌‌ కరెన్సీ రూపాయి, డాలర్‌‌‌‌ మారకంలో సోమవారం సెషన్‌‌లో 13 పైసలు నష్టపోయింది. శుక్రవారం సెషన్‌‌లో 71.80 వద్ద ముగిసిన రూపాయి, సోమవారం సెషన్‌‌లో 72.03 వద్ద నెగిటివ్‌‌లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 72.11 వద్ద కనిష్టాన్ని తాకి, 71.93 వద్ద ముగిసింది. దీంతో వరుసగా మూడు సెషన్‌‌లలో రూపాయి డాలర్‌‌‌‌ మారకంలో 71 పైసలు నష్టపోయింది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఇండియన్‌‌ కరెన్సీపై ఒత్తిడి పెంచుతాయని,  ప్రధాన కరెన్సీలతో పాటు రూపాయి కూడా ప్రతికూలంగా ట్రేడవుతుందని ఫారెక్స్‌‌ ట్రేడర్లు అన్నారు. పదేళ్ల ప్రభుత్వ బాండ్‌‌ ఈల్డ్‌‌ 6.57 శాతం వద్ద ఉంది.  ఫైనాన్షియల్‌‌ బెంచ్‌‌మార్క్‌‌ ఇండియా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌(ఎఫ్‌‌బీఐఎల్‌‌) ప్రకారం రూపాయి–డాలర్ రిఫరెన్స్‌‌ రేటు 71.69 వద్ద ఉంది. అదేవిధంగా రూపాయి–యూరో 80.05 వద్ద, రూపాయి–బ్రిటీష్‌‌ పౌండ్‌‌ 93.98 వద్ద, రూపాయి–100 జపనీష్‌‌ యెన్‌‌ 66.32 వద్ద ఉన్నాయి.

మరింత పైకి బంగారం

బంగారం ధరలు పెరిగితే ప్రపంచంలో ఏ దేశమూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ, బంగారానికి ఎంతో విలువిచ్చే మన దేశానికి మాత్రం అది శాపమే. ముంబై బులియన్​ మార్కెట్​లో సోమవారం 22 క్యారెట్ల (నగల) బంగారం 10 గ్రాములకు రూ. 40,678 ఉంది. ఇక బిస్కెట్​ బంగారం కూడా అందనంత స్థాయికి పెరిగింది. వ్యాపార వర్గాల్లో మాత్రమే తెలిసిన ఇండియన్​ స్పాట్​ మార్కెట్లో,  ఎంసీఎక్స్​లో కూడా గోల్డ్​ రేట్స్​ బాగా పెరిగాయి.

బంగారం ధరలు సోమవారం సెషన్‌‌లో ఆల్‌‌ టైం గరిష్టానికి చేరుకున్నాయి.  10 గ్రాముల బంగారం ఇండియన్‌‌ స్పాట్‌‌ మార్కెట్‌‌లో రూ. 42,000 మార్కును తాకింది. ఎంసీఎక్స్‌‌లో  10 గ్రా.   ప్యూచర్ బంగారం రూ.720  పెరిగి రూ.  41,730  స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ రాజకీయ అంశాల వలన ఇన్వెస్టర్లు బంగారంపై  ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ట్రేడర్లన్నారు.   డాలర్‌‌‌‌ మారకంలో రూపాయి విలువ పడిపోవడంతో ఇండియన్‌‌ మార్కెట్లో బంగారం ధరలకు రెక్కలొచ్చాయని ఎస్‌‌ఎంసీ గ్లోబల్‌‌ సెక్యూరిటీస్‌‌ తెలిపింది. బంగారం రూ. 42, 300 స్థాయి వైపు కదులుతుందని అంచనావేసింది. గత సెషన్‌‌లో  10 గ్రా. బంగారం రూ. 41,010 వద్ద ముగిసింది.  మొత్తంగా ఈ రెండు సెషన్‌‌లోనే  బంగారం ధర(10 గ్రా.) లు ఏకంగా రూ. 1,80‌‌‌‌0 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 2.88 శాతం లాభపడి 1,588.13 డాలర్లకు చేరుకొంది.