పంజాబ్​, యూపీలో ఇయ్యాల పోలింగ్​

పంజాబ్​, యూపీలో ఇయ్యాల పోలింగ్​
  • పంజాబ్​లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్​
  • యూపీలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు..

న్యూఢిల్లీ/లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం పంజాబ్​లోని అన్ని స్థానాలకు, ఉత్తరప్రదేశ్​లోని 59 స్థానాలకు పోలింగ్​ జరుగనుంది. ఇప్పటికే యూపీలో రెండు దశల్లో పోలింగ్​ జరిగింది. ఆదివారం జరిగేది థర్డ్​ ఫేజ్​. ప్రస్తుతం పంజాబ్​లో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీ మళ్లీ పవర్​లోకి రావాలని సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఆమ్​ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీ దళ్, బీజేపీ తదితర పార్టీలు కూడా సత్తా చాటాలని భావిస్తున్నాయి. 
 

పంజాబ్​లో 117 సీట్లు.. బరిలో 1,304 మంది
పంజాబ్​ అసెంబ్లీకి ఆదివారం ఒకే ఫేజ్​లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ మొత్తం 117 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా.. 1,304 మంది క్యాండిడేట్లు పోటీ పడుతున్నారు.  2.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్,  ఆప్, ఎస్​ఏడీ–బీఎస్పీ కూటమి, బీజేపీ–పీఎల్​సీ–ఎస్​ఏడీ(సంయుక్త్) కూటమి, సంయుక్త్​ సమాజ్​ మోర్చా మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పలు రైతు సంఘాల నేతలు కూడా బరిలో ఉన్నారు. శిరోమణి అకాలీ దళ్​(ఎస్​ఏడీ) ఈ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నది. కాంగ్రెస్​ అభ్యర్థి, సీఎం చరణ్​జిత్​సింగ్​ చన్నీ, ఆప్​ సీఎం క్యాండిడేట్​ భగవంత్​ మాన్​, పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్​ సిద్దు, మాజీ సీఎంలు అమరీందర్​​, ప్రకాశ్​ సింగ్​ బాదల్​, శిరోమణి అకాలీదళ్​ ప్రెసిడెంట్​ సుఖ్​బీర్​సింగ్​ బాదల్, పంజాబ్​ బీజేపీ చీఫ్​ అశ్వనీ శర్మ​ వంటి కీలక నేతలు బరిలో ఉన్నారు. పంజాబ్​లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ జరుగనుంది. వరుసగా 10 ఏండ్ల పాటు పంజాబ్​ను పాలించిన ఎస్​ఏడీ–బీజేపీ కూటమిని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓడించి అధికారంలోకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్​ 77 సీట్లలో విజయం సాధించగా.. ఎస్​ఏడీ–బీజేపీ కూటమి 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆప్​ 20 చోట్ల గెలిచింది. 
 

యూపీలో థర్డ్​ ఫేజ్​
ఉత్తరప్రదేశ్​లో ఆదివారం థర్డ్​ఫేజ్​ఎన్నికలు జరుగనున్నాయి. ఈ దశలో 16  జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్​ జరుగనుంది. 627 మంది క్యాండిడేట్స్​ పోటీ పడుతుండగా.. 2.15 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్​ ఉంటుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. సమాజ్​వాదీ పార్టీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​ పోటీ చేస్తున్న కర్హాల్​ నియోజకవర్గంలో కూడా పోలింగ్​ ఇయ్యాల్నే. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్​ బఘేల్​ పోటీ చేస్తున్నారు. కర్హాల్​ పోలింగ్​కు పారామిలిటరీ బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్​ను బీజేపీ కోరింది. 2017 ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో బీజేపీ 49 చోట్ల విజయం సాధించగా.. సమాజ్​వాదీ పార్టీ 9 చోట్ల గెలిచింది. మరో స్థానంలో కాంగ్రెస్​ గెలుచుకుంది.

For More News..

ప్రభాస్తో నటించడం నాకు దక్కిన గౌరవం

పార్టీ నన్ను వదిలించుకుంటేనే మంచిది: జగ్గారెడ్డి