V6 News

Vaazha 2 Telugu Review: నవ్విస్తూనే ఎమోషనల్ చేసే కథ.. యూత్ డ్రీమ్స్ & రియాలిటీ మధ్య పోరాటం

Vaazha 2 Telugu Review: నవ్విస్తూనే ఎమోషనల్ చేసే కథ.. యూత్ డ్రీమ్స్ & రియాలిటీ మధ్య పోరాటం

మలయాళ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘వాజా’ (Vaazha) సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రదర్స్’. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే సినిమా ‘వాలా 2’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ, శుక్రవారం (ఏప్రిల్ 24, 2026)న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదలైంది.

మరి ఈ మలయాళ సూపర్ హిట్ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? కామెడీ, ఎమోషన్స్‌ వర్కౌట్ అయ్యాయా? తెలుగులో ఎలాంటి హిట్ అందుకోబోతుంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

‘వాలా 2’ కథ:

హాషిర్‌, అలన్‌, అజిన్‌, వినాయక్ అనే నలుగురు మధ్యతరగతి కుర్రాళ్ళ చుట్టూ కథ తిరుగుతుంది. చదువుకంటే అల్లరి, గొడవలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆ సరదాలు క్రమంగా చెడు అలవాట్లకు లోనై డ్రగ్స్‌ వరకు వెళ్తారు. ఒక సందర్భంలో డ్రగ్స్‌ మత్తులో టీచర్‌పై చేయి కూడా చేసుకుంటారు. ఈ కారణంగా, ఆ నలుగురిని కాలేజీ నుంచి బయటకు పంపిస్తారు.

ఇక పరీక్షలు రాయడానికి కూడా అనుమతి ఇవ్వమని యాజమాన్యం చెప్పడంతో, వారి తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోతాయి. ఈ క్రమంలోనే, ఆ టౌన్ ఎస్సై రిక్వెస్ట్ చేయడంతో వీరికి మళ్లీ పరీక్షలు రాసే అవకాశం లభిస్తుంది. చదువు పూర్తవుతుంది. అయినప్పటికీ, సమాజం మాత్రం వీరిని ‘లూజర్స్‌’గానే చూస్తుంది.

అలా పాఠశాల దశలో ‘వేస్ట్ బ్యాచ్‌’గా ముద్రపడిన ఈ నలుగురు కుర్రాళ్ళు చివరకు ఏం తెలుసుకున్నారు. జీవితంలో నిలదొక్కుకోవడానికి దుబాయ్‌, యూకే వంటి దేశాలకు వెళ్లి ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? చివరికి తమ జీవితాలను ఎలా మార్చుకున్నారు? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే :

ఇటీవలి కాలంలో మలయాళ సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం వారి కథలలో కనిపించే సహజత్వం మరియు నిజ జీవితానికి దగ్గరగా ఉండే కాన్సెప్ట్స్‌. అంతేకాదు.. మలయాళ దర్శకులు అతి హంగులు, అతిశయోక్తులకు దూరంగా ఉండి, సాధారణ మనుషుల జీవితాలను ప్రతిబింబించే కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. అలా విభిన్న జోనర్లల్లో  సినిమాలు తీసి ఆలోచింపజేస్తున్నారు.

అంతేకాదు.. అక్కడి సినిమాలన్నీ కేవలం వినోదం కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా చూపించడంలో మలయాళీ మేకర్స్ ప్రత్యేకత చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. అలా ప్రేక్షకులు తమ జీవితాలతో సింక్ చేసుకునేలా ఉండే ఈ కథలే వారి సక్సెస్ కి ప్రధాన కారణంగా నిలిచాయి. 

అందుకే మలయాళ సినిమా: ప్రాంతీయ పరిమితులను దాటి, ప్రతి ఒక్కరికీ ‘మన సినిమా’ అనే అనుభూతిని కలిగిస్తోంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ రావడంతో, ఈ సినిమాలు మరింత విస్తృత ప్రేక్షకులకు చేరుకుని, ఆదరణ పొందుతున్నాయి.

►ALSO READ | రికార్డు స్థాయిలో 'దృశ్యం 3' బిజినెస్.. మోహన్‌లాల్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!

ఇప్పోడొచ్చిన వాలా 2 కూడా ఇదే ధోరణిలో ఆలోచింపజేస్తుంది. యువత కనే కలలకు, రియాలిటీలో ఉండే కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. నవ్విస్తూనే.. ఏడిపిస్తుంది. ఇంట్లో తోబుట్టువుల అనుబంధం, కాలేజీలో స్నేహం, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లిన యువతరం ఎలాంటి కష్టాలు పడతారో మనసుకు హత్తుకునేలా చూపించింది.

ఫస్టాఫ్.. కాలేజీలో స్నేహాలు, ప్రేమ‌లు, స‌ర‌దాలు, గొడ‌వల నేప‌థ్యంతో ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్ లో చదువు పూర్తయ్యాక ఉపాధి కోసం భారత్, దుబాయ్, యూకే వంటి ప్రాంతాలకు వెళ్లి స్థిరపడటానికి పడే కష్టాలను ఈ కథలో సహజంగా చూపించారు దర్శకుడు. 

ఒక్కమాటలో చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ ఎంత నవ్విస్తుందో, సెకండ్ హాఫ్ అంతగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ హృదయాన్ని తాకుతుంది. ‘వాలా 2’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రం. కొత్త దర్శకుడు సావిన్ ఎస్.ఏ, రచయిత విపిన్ దాస్ తమ ప్రయత్నంలో వందశాతం సక్సెస్ అయ్యారు.