న్యూఢిల్లీ: టాటా ట్రస్ట్స్ ట్రస్టీగా వేణు శ్రీనివాసన్‌ను ఏకగ్రీవంగా జీవితకాలానికి తిరిగి నియమించింది. సంస్థలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే నివేదికల మధ్య, ఇప్పుడు మెహ్లి మిస్త్రీ పునర్నియామకంపై దృష్టి మళ్లింది. శ్రీనివాసన్ (టీవీఎస్ గ్రూప్ చైర్మన్ ఎమెరిటస్) పదవీకాలం అక్టోబర్ 23తో ముగుస్తోంది.
ప్రస్తుత చైర్మన్ నోయెల్ టాటాకు ఒక వర్గం, మాజీ పెద్దలకు మరో వర్గం మద్దతు ఇస్తుండటంతో టాటా ట్రస్ట్స్‌లో చీలిక ఏర్పడిందని సమాచారం. మరో ట్రస్టీ మెహ్లి మిస్త్రీ పదవీకాలం ఈనెల 28తో ముగుస్తుంది. ఆయన కొనసాగింపు ఆటోమేటిక్‌గా జరుగుతుందా లేక జీవితకాల పదవీకాలానికి ట్రస్టీల నుంచి ఏకగ్రీవ ఆమోదం అవసరమా ? అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ట్రస్ట్స్‌లో ఏకగ్రీవ ఆమోదం అవసరమని, లేకపోతే నోయెల్ టాటా నియామకంతో సహా గత తీర్మానాలను కూడా తిరిగి పరిశీలించాల్సి ఉంటుందని ఒక వర్గం వాదిస్తోంది.
