
- సన్ పరివార్ చైర్మన్ మెతుకు రవీందర్ అంత్యక్రియలను అడ్డుకున్న బాధితులు
- గజ్వేల్ మండలం అక్కారంలో ఆందోళన
- రూ.350 కోట్లు సేకరించి బోర్డు తిప్పేసిన రవీందర్
గజ్వేల్, వెలుగు: సన్ పరివార్ పేరిట జనం నుంచి రూ.350 కోట్లు సేక రించి బోర్డు తిప్పేసిన మెతుకు రవీందర్ చనిపోగా, అంత్యక్రియలను బాధితులు అడ్డుకున్నారు. తమ డిపాజిట్లపై హామీ ఇచ్చాకే అంతిమ సంస్కారాలకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. దీంతో రవీందర్ స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారంలో ఆదివారం ఉద్రిక్తత నెలకొన్నది. అక్కారం గ్రామానికి చెందిన రవీందర్ సర్కారు టీచర్‌గా పనిచేస్తూ ఐదేండ్ల కింద సన్ పరివార్ గ్రూప్ పేరిట ఓ కంపెనీ స్థాపించాడు.
అధికవడ్డీ ఆశజూపి రూ.350 కోట్ల దాకా డిపాజిట్లు సేకరించాAడు. లక్ష డిపాజిట్చేస్తే నెలకు రూ.6 వేల ఇంట్రెస్టు కలిసి 25 నెలల్లో రూ.2.50 లక్షలు ఇస్తానని నమ్మించడంతో ప్రజలు నమ్మి పెట్టుబడి పెట్టారు. ఏండ్లు గడుస్తున్నా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఈక్రమంలోనే కోర్టు రవీందర్‌కు చెందిన కొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. కానీ బాధితులకు మాత్రం సొమ్ము తిరిగి రాలేదు.
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు..
హైదరాబాద్‌లో ఉంటున్న రవీందర్ గుండెపోటుతో శనివారం చనిపోయాడు. అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు ఆయన డెడ్‌బాడీని అక్కారం తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాధితులు రాష్ట్రం నలుమూలల నుంచి గ్రామానికి చేరుకుని అంత్యక్రియలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. చివరికి కుటుంబసభ్యులు హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. దీంతో చీకటిపడ్డాక రవీందర్అంత్యక్రియలు పూర్తిచేశారు.
కొడుకు పైసలివ్వాలంటూ తండ్రి అంత్యక్రియల అడ్డగింత
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘటన
మెట్ పల్లి, వెలుగు : అనారోగ్యంతో ఓ వ్యక్తి చనిపోగా, అతడి కొడుకు చేసిన అప్పులు తీర్చలేదని అంత్యక్రియలను అడ్డుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని చైతన్యనగర్ కు చెందిన పుల్లురి శ్రీకాంత్ కొన్నేండ్ల ముందు ఫైనాన్స్, చిట్టీల వ్యాపారం చేశాడు. ఐదేండ్ల కింద 20 మందికి రూ.1.70కోట్లు ఇవ్వకుండా కుటుంబంతో సహా పారిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.రెండేండ్ల కింద శ్రీకాంత్తల్లి అనారోగ్యంతో చనిపోయింది. అప్పుడు అంత్యక్రియలకు వచ్చిన శ్రీకాంత్‌ను పట్టుకొని నిలదీశారు. డబ్బులు ఇచ్చేంతవరకు అంత్యక్రియలను జరగనిచ్చేది లేదని పట్టుబట్టా రు. రెండు నెలల్లో డబ్బులన్నీ ఇస్తానని హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు. కానీ, శ్రీకాంత్ మళ్లీ తప్పించుకుని తిరుగుతున్నాడు. శనివారం రాత్రి శ్రీకాంత్ తండ్రి నారాయణ అనారోగ్యంతో చనిపోయారు. దీంతో శ్రీకాంత్ ఆదివారం మెట్ పల్లికి వచ్చాడు. సమాచారం అందుకున్న బాధితులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి నిలదీశారు. డబ్బులు ఇచ్చేంత వరకు అంతక్రియలు కానిచ్చేది లేదని ఆందోళనకు దిగారు. డబ్బులు ఇవ్వనిదే శవాన్ని కదలనివ్వమని బైఠాయించారు. దీంతో శ్రీకాంత్ హైదరాబాద్‌లో ఉన్న ఆస్తి అమ్మి బాకీ చెల్లిస్తామని చెప్పినా వినలేదు. కాలనీ వాసులు, కుటుంబసభ్యులు వారిని సముదాయించి డబ్బుల విషయంలో హామీ ఇచ్చారు. పెద్దమనుషుల సమక్షంలో శ్రీకాంత్బాండ్ పేపర్ రాసివ్వడంతో అంతక్రియలు కానిచ్చారు.