రాష్ట్రంలో ‘వైరల్’ అటాక్.. ఆస్పత్రుల్లో పేషంట్ల క్యూ..

రాష్ట్రంలో ‘వైరల్’ అటాక్.. ఆస్పత్రుల్లో పేషంట్ల క్యూ..
  • పెరుగుతున్న వైరల్ ఫీవర్లు.. ఇలా చేస్తే అడ్డుకోవచ్చంటున్న వైద్యులు

రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పరిసరాలు అపరిశుభ్రంగా మారడతో వైరల్ ఫీవర్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియాలు విజృంభిస్తున్నాయి. దాంతో హైదరాబాద్‎లోని ప్రభుత్వ దవాఖానాలు పేషెంట్లతో నిండిపోతున్నాయి. ప్రతి ఆస్పత్రికి రోజుకు వెయ్యి నుంచి రెండు వేల మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పేషెంట్లు హైదరాబాద్‎లోని సర్కారీ ఆస్పత్రులకు వస్తున్నారు. అంతేకాకుండా.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పేషంట్లు రావడంతో సిటీలోని సర్కారీ హాస్పిటళ్లలో ఔట్ పేషెంట్ బ్లాకులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే రోగులు వందలాదిగా బారులుతీరుతున్నారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఫీవర్ ఆస్పత్రిలోని ఓపీ బ్లాకులు పేషెంట్లు, అటెండెంట్లతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోవడంలేదు.

ఒక్కో ఆస్పత్రికి రోజుకు 1000 నుంచి  2 వేలకుపైనే ఓపీ కేసులు వస్తున్నాయి. కరోనా కారణంగా గతేడాది సీజనల్ వ్యాధుల ప్రభావం తగ్గినా… ఈసారి మాత్రం 20 నుంచి 30 శాతం డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. సీజనల్ ఫీవర్లతో పాటు నాన్ స్పెసిఫిక్, డెంగ్యూ, రెస్పిరేటరీ కేసులు ఎక్కువగా ఓపీకి వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. సాధారణంగా జూన్, జులై నుంచి అక్టోబర్, నవంబర్ వరకు సీజనల్ వ్యాధులు ఉంటాయి. అయితే అన్ లాక్ తర్వాత ప్రజలు తగిన కరోనా జాగ్రత్తలు పాటించకపోవడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరం తీవ్రంగా ఉంటే ముందు కరోనా టెస్ట్ చేసి.. రిజల్ట్‎ను బట్టి ట్రీట్‎మెంట్ చేస్తున్నామని వైద్యులు అంటున్నారు.

సీజనల్ వ్యాధుల తీవ్రత పెరగడంతో సిటీలో పెద్దాసుపత్రులతో పాటు బస్తీ దవాఖాన్లలో కూడా రోగుల తాకిడి పెరిగింది. ఉస్మానియాలో 1800 నుంచి రెండు వేలు, గాంధీలో 1100, ఫీవర్ ఆస్పత్రిలో 800లు, నిమ్స్‎లో 1800లకుపైనే రోజువారీ ఓపీ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో సగానికి పైగా కేసులు.. వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా కేసులే ఉంటున్నాయి.

కాగా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సీజనల్ వ్యాధుల నుంచి బయటపడొచ్చని వైద్యనిపుణులు అంటున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు.. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వైరల్ ఫీవర్లు రాకుండా అడ్డుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి చుట్టూ ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు. దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడాలని అంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటివి రెండు రోజులకంటే ఎక్కువగా తగ్గకుండా ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.

For More News..

ఇంటర్ పరీక్షలకు సహకరించం.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు

కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం

వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డ్