నీటి కోటాల కొట్లాట!

నీటి కోటాల కొట్లాట!

తెలుగుజాతి ఆత్మ గౌరవం అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం జలవనరులను ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాలకు సమాన ప్రాతిపదికన పంచలేదు. ఎన్టీఆర్‌‌‌‌కు ముందున్న ప్రభుత్వాలు నీటి విషయంలో ఏ పంథాను అనుసరించాయో ఎన్టీఆర్ పాలనా కాలంలోనూ అదే కొనసాగింది. రాష్ర్టంలో దాదాపు 69 శాతం కృష్ణానదీ పరివాహక ప్రాంతం, 78.5 శాతం గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నా నదీజలాల్లో ఈ ప్రాంతానికి 18.2% మాత్రమే దక్కేవి.

ఆర్​ఎస్​ బచావత్​ ట్రిబ్యునల్​ కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు 811 టీఎంసీలు, గోదావరి నదీ జలాల్లో 1480 టీఎంసీలు కేటాయించింది. ఆ నీటిని ట్రిబ్యునల్​ ఆదేశాలు, పరివాహక ప్రాంతం, సాగుభూమి, వర్షపాతం, జాతీయ, అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం అన్ని ప్రాంతాలకు సమానంగా పంచాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానిది. కానీ 1980 నుండి 1990 వరకు పాలించిన ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీటి కేటాయింపులపై శ్రద్ధ పెట్టలేదు. అలా జరిగి ఉంటే మన ప్రాంతానికి దాదాపు 90 శాతం వాటా దక్కి ఉండేది.

కేటాయింపుల్లో నిర్లక్ష్యం

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మద్రాసు తాగునీటి సరఫరాకు  కృష్ణా జలాలను తరలించేందుకు తెలుగుగంగ ప్రాజెక్టును ప్రారంభించింది. అయితే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు కృష్ణానీరు అందించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. తెలంగాణ ప్రాంతానికి కృష్ణా జలాలను అందించే పాలమూరు జిల్లాలోని బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను మాత్రం పక్కన పెట్టింది.

1990 చివరినాటికి టీడీపీ, కాంగ్రెస్​ ప్రభుత్వాలు ఈ ప్రాంతానికి చెందాల్సిన నీటిలో కేవలం 32% మాత్రమే కేటాయింపు చేశాయి. వాస్తవ నీటి వినియోగం పరంగా చూస్తే అది 11 శాతమే. దీనికి కారణం కృష్ణానది దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి రావాల్సిన వాటా కంటే రెట్టింపు నీరు ఇవ్వడమే. ఫలితంగా ఈ బ్యారేజీ కింద మొదటి పంటకు 12 లక్షల ఎకరాలకు రెండో పంటకు దాదాపు 7 లక్షల ఎకరాలకు నీరు అందేది. అలాగే ‘పులిచింతల’ ప్రాజెక్టు ద్వారా గుంటూరు ప్రాంతానికి మరింత నీటిని అందించేందుకు అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

శ్రీశైలం జలాశయంలో నిల్వ సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి తెలుగుగంగకు నీరందించారు. కేవలం జలవిద్యుత్​ కోసమే ప్రారంభించిన శ్రీశైలం ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా రాయలసీమకు నీరందించారు. కేంద్ర అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టులో మరో రెండు తూములు ఏర్పాటు చేసి తెలుగుగంగ, రాయలసీమకు నీరు తరలించారు.

బచావత్​ ట్రిబ్యునల్ జూరాల ప్రాజెక్టుకు 17.5 టీఎంసీల నీరు కేటాయించగా ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వం ప్రాజెక్టు నిలువ సామర్థ్యాన్ని 11 టీఎంసీలకు తగ్గించింది. ఈ ప్రాంతంలో అనుమతి ఉన్న ప్రాజెక్టులకు నీటి సామర్థ్యాన్ని కుదించడమే కాక ఆంధ్ర, రాయలసీమలో అనుమతిలేని ప్రాజెక్టులకు యథేచ్ఛగా నీరు తరలించారు. అన్ని ప్రాంతాల హితం కోరి పనిచేయాల్సిన ప్రభుత్వం నీటి విషయంలో విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది.

గోదావరి జలాల్లోనూ..

గోదావరి నదీ జలాల్లో బచావత్​ ట్రిబ్యునల్​ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు 1480 టీఎంసీలు కేటాయించింది. అయితే దానిలో సగభాగం నీరు కూడా తెలంగాణ ప్రాంతం వినియోగించుకోలేదు. గోదావరి కింది భాగాన ధవళేశ్వరం వద్ద నిర్మించిన ఆర్థర్​ కాటన్​ బ్యారేజీ వల్ల మొదటి  పంట 12 లక్షల ఎకరాలు, రెండో పంట 6 లక్షల ఎకరాలు సాగవుతూ ఉండగా తెలంగాణలో గోదావరి నీటి ద్వారా సాగవుతున్న మొత్తం నేల 5 లక్షల ఎకరాలు మాత్రమే. ఈ ప్రాంతానికి గోదావరి నీటిని ఇచ్చే ఇచ్చంపల్లి, శ్రీరాంసాగర్​లకు ప్రాధాన్యతను ఇవ్వకుండా, ఆంధ్రప్రాంతంలోని పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. 2000 సంవత్సరం నాటికి కోస్తాంధ్రలో కాలువల ద్వారా 12,24,559 హెక్టార్లకు నీరు అందుతుండగా, రాయలసీమలో 1,24,567 హెక్టార్లు, తెలంగాణలో కేవలం 3,00,261 హెక్టార్లకు మాత్రమే నీరు అందేది దీనిని బట్టి నదీజలాల కేటాయింపులో ఎంత అన్యాయం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

నదీజలాలను కాలువల ద్వారా అన్ని ప్రాంతాలకు అందించడం కష్టతరమే. కానీ ఏ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఎక్కువగా ఉన్న చెరువులు, కుంటలను నింపే ప్రయత్నం చేయలేదు. మన రాష్ర్టంలో చెరువుల కింద 11 లక్షల హెక్టార్లలో సాగు జరిగేది. 1980 నుంచి క్రమేణా తగ్గిపోతూ 1997 నాటికి చెరువుల ద్వారా తెలంగాణలో సాగవుతున్న భూమి కేవలం 3 లక్షల ఎకరాలే. తెలంగాణకు న్యాయ బద్ధ కేటాయింపులు ఉన్నప్పటికీ కోస్తా ప్రాంతానికే పెద్దపీట వేశాయి అప్పటి ప్రభుత్వాలు.

చెరువులను నిర్వహించకపోవడం వల్ల చిన్న సన్నకారు రైతులకు చాలా నష్టం కలిగింది. వారు క్రమేణా వర్షాధార వ్యవసాయం మీద ఆధారపడవలసి వచ్చింది. అలాగే తెలంగాణ, రాయలసీమలో బోరుబావుల వినియోగం పెగరడంతో భూగర్భజలాలు క్షీణించి అతి త్వరలోనే వ్యవసాయం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టివేయబడింది.

రాష్ర్టంలో 1980–82లో భూగర్భ జలాల మీద ఆధారపడి 3,32,245 హెక్టార్లు సాగవుతుండగా అది 1992 నాటికి 6,35,307 హెక్టార్లకు పెరిగింది. కేటాయింపులు ఉన్నా నదీజలాలను వాడుకోలేకపోవడంతో పెరిగిన ఈ వ్యవసాయం రైతుకు ఖర్చుతో కూడి భారంగా మారిపోయింది. సాగునీటి విషయంలో ఎదుర్కొంటున్న వివక్షను తెలంగాణ ప్రాంతం 1990 నాటికి అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది.