బల పరీక్షలో మేమే గెలుస్తాం

బల పరీక్షలో మేమే గెలుస్తాం

బల పరీక్ష నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గవర్నర్ గురువారం బల పరీక్షకు సిద్ధం కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రస్తుతం గువహటిలో ఉన్న శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు కామాఖ్య దేవిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏక్ నాథ్ షిండే గురువారం ఉదయం రెబల్ ఎమ్మెల్యేలంతా ముంబయికి చేరుకుంటారని చెప్పారు. బల నిరూపణ విషయంలో తనకు ఎలాంటి ఆందోళన లేదని అన్నారు. 50 మంది ఎమ్మెల్యేలు తనవెంట ఉన్నారని, బల పరీక్షలో మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధిస్తామని షిండే ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలమే ముఖ్యమన్న ఆయన.. అది తమకు ఉందని అన్నారు. 


ఇదిలా ఉంటే రెబల్ క్యాంపు ఎమ్మెల్యేలను గువహటి నుంచి గోవాకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఏక్ నాథ్ షిండే ఎమ్మెల్యేలను గోవాకు తరలించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్యేలు బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద బస్సులను సిద్ధంగా ఉంచడంతో పాటు గోవా వెళ్లేందుకు స్పైస్ జెట్ ఛార్టర్డ్ ఫ్లైట్ను రెడీగా ఉంచినట్లు తెలుస్తోంది.