ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీసు, ట్రాఫిక్, షాపింగ్, మొబైల్ ఫోన్‌లలో మునిగిపోయి ఉంటాం. ఎక్కడికైనా వెళ్లాలంటే గూగుల్ మ్యాప్స్ చూసి, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని త్వరగా బయల్దేరతాం. కానీ ఈ వేగంలో మనం ఏదో కోల్పోతున్నాం. మన నగరాన్ని నిజంగా చూడడం, ప్రజలతో మాట్లాడడం, కొత్త స్నేహాలు చేసుకోవడం.. ఇవన్నీ మరచిపోతున్నాం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనమంతా టార్గెట్ రీచ్ అవ్వాలనే టెన్షన్లో చుట్టూ ఉండే నేచర్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఇక్కడే లాయిటరింగ్ ఒక మంచి కళగా మారుతుంది. ఫ్రెంచ్ భాషలో దీన్ని “ఫ్లానెరీ” అంటారు. అంటే ఏ లక్ష్యం లేకుండా కేవలం నేత్రానందం కోసం నగర వీధుల్లో తిరగడం అని అర్థం. కానీ ఇది కళ్లకే కాదు మనసుకూ ఆనందాన్నిస్తుంది. అలాగని లక్ష్యం లేకుండా తిరగడం సమయం వృథా చేయడం కాదు.. అది సమాజంతో మమేకమవ్వడానికి ఒక గొప్ప మార్గం.
లాయిటరింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. మనం రోజూ వెళ్లే దారిలోనే ఎన్నో కొత్త విషయాలు ఉంటాయి. ఒక పాత గోడ మీద ఉన్న బొమ్మ, వీధిలో ఉండే చిన్న టీ కొట్టు లేదా ఒక పురాతన కట్టడం, పెద్ద చెట్టు.. వీటిని గమనించినప్పుడు మన సిటీతో మనకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. అంతేకాకుండా పని లేకపోయినా సరదాగా రోడ్లపై తిరుగుతున్నప్పుడు అపరిచితులతో మాట కలిపే అవకాశం ఉంటుంది. పార్కులో కూర్చున్న పెద్దవారితో లేదా వీధి చివర చిరువ్యాపారులతో మాట్లాడటం వల్ల మనుషుల మధ్య దూరం తగ్గుతుంది. ఈ పలకరింపులే రేపు మంచి స్నేహాలుగా మారొచ్చు. వీధులన్నీ మనుషులతో కళకళలాడుతున్నప్పుడు ఆ ప్రాంతం సేఫ్గా ఉంటుంది. మనం మన పరిసరాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటే, అక్కడ ఎవరు ఉంటున్నారు? ఏం జరుగుతోంది? అనే అవగాహన పెరుగుతుంది. ఇది ఒక రకమైన ‘కమ్యూనిటీ వాచ్’లా పనిచేసి నేరాలను తగ్గించడంలో తోడ్పడుతుంది. కాస్త సమయం దొరికితే ఫోన్, టీవీ వంటి స్క్రీన్లు చూడడం మానేసి, ప్రకృతిని లేదా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నలుగురిలో ఉన్నామనే భావన ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. సిటీ అంటే కేవలం సిమెంట్ బిల్డింగ్స్ కాదు. అది మనుషుల కలయిక. కాబట్టి, ఏ కాస్త టైం దొరికినా మీ వీధుల్లో సరదాగా నడవండి. ఆ నడక మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న సమాజంతో మళ్లీ కనెక్ట్ చేస్తుంది.
మనదేశంలో ముఖ్యంగా మహిళలు పబ్లిక్ స్థలాల్లో సావధానంగా తిరగడం ఒక ఉద్యమంగా మారింది. “వై లాయిటర్?” అనే క్యాంపెయిన్ మహిళలు భయం లేకుండా నగరాన్ని ఆనందంగా ఆస్వాదించాలని చెప్తుంది. హైదరాబాద్‌లో కూడా పింక్ పార్కులు, మహిళలు, పిల్లలకు మాత్రమే అనుకూలమైన స్థలాలు వస్తున్నాయి. ఇవి సేఫ్గా తిరగడానికి సాయపడతాయి. హైదరాబాద్‌లో చార్మినార్ చుట్టుపక్కల, హుస్సేన్ సాగర్ దగ్గర, నెక్లెస్ రోడ్ లేదా బంజారా హిల్స్ పార్కుల్లో, లోకల్ మార్కెట్లలో సరదాగా తిరగొచ్చు. అలా తిరిగేటప్పుడు మొబైల్ ఫోన్ పక్కన పెట్టండి. ఎవరైనా కలిస్తే చిరునవ్వుతో పలకరించండి. ఇలా చేస్తూ ఉంటే మీ సిటీ మీకు నిజమైన ఇల్లులా అనిపిస్తుంది.
దీనివల్ల కలిగే లాభాలేంటంటే.. కొత్త వ్యక్తులు, కొత్త ఆలోచనలు ఈజీగా కలుస్తాయి. ప్రజల మధ్య నమ్మకం పెరుగుతుంది. వీధుల్లో ఎక్కువమంది ఉంటే భద్రత కూడా మెరుగవుతుంది. వివిధ వయసులవాళ్లు, వృత్తుల వాళ్లు కలిసి మాట్లాడుకుంటే సమాజం మరింత బలంగా, ఐక్యంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గి, సంతోషం పెరుగుతుంది.
