రష్యా, ఉక్రెయిన్ వార్తో.. తెరపైకి చైనా తైవాన్ అంశం

రష్యా, ఉక్రెయిన్ వార్తో.. తెరపైకి  చైనా తైవాన్ అంశం

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో.. ఇప్పుడు చైనా తైవాన్ అంశం తెరపైకి వచ్చింది. రష్యా తన సైనిక బలంతో ఉక్రెయిన్ పై ఏకపక్ష దాడులకు పాల్పడుతోంది. దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ తమ దేశానికి సాయం చేయాలని పలుమార్లు వేడుకున్నా.. రష్యా మీద భయంతో ఏ ఒక్క దేశం ముందుకు రావడం లేదు. ఆదుకుంటాయనుకున్న అమెరికా, నాటో దేశాలు రష్యాపై పలు ఆర్ధిక ఆంక్షలు విధించి చేతులు దులుపుకున్నాయి. ఈ కారణాల వల్ల ఉక్రెయిన్ ఇప్పడు ఒంటరిగా రష్యా దాడులను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో .. చైనా కూడా తైవాన్ పై దాడులకు దిగనుందా అనే సందేహం ప్రపంచ దేశాల్లో కలుగుతోంది. అసలు చైనాకు తైవాన్ కు మధ్య ఉన్న తగాదా ఏంటి..?

ఇప్పుడున్న తైవాన్ ఒకప్పుడు చైనాలో అంతర్భాగంగా ఉండేది. కానీ 1949లో వచ్చిన అంతర్యుద్ధంతో చైనా, తైవాన్ విడిపోయాయి. అప్పటి నుంచి తైవాన్ ప్రత్యేక ప్రాంతంగా ఉంటోంది. కానీ చైనా ఈ చీలికను ఒప్పుకోవడంలేదు. తైవాన్ చైనాలో అంతర్భాగమంటూ మొండి వాదన చేస్తోంది. అందుకే  విలీనం కావాలంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు. అందుకే తైవాన్‌ను రెచ్చగొట్టే ధోరణిని చైనా కొనసాగిస్తోంది. అయితే చైనా దురాక్రమణకు దిగితే ఊరుకునే ప్రసక్తి లేదని తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ తైవాన్ సమస్యను మళ్లీ తెరపైకి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా-తైవాన్ మధ్య గతంలో ఏం జరిగింది? వీటి మధ్యకు అమెరికా ఎందుకు వచ్చింది ? ఇప్పుడు ఏం జరుగబోతుంది? ఒక్కసారి చూద్దాం..

చైనా-తైవాన్ మధ్య తగాదాకు కారణం ఏంటి..?

అంతర్జాతీయ రాజకీయాలలో తైవాన్ పేరు మొదటిసారి చైనా-జపాన్ యుద్ధం (1894) తర్వాత బయటకు వచ్చింది. ఈ యుద్ధంలో చైనా క్వింగ్ సామ్రాజ్యాన్ని ఓడించిన జపాన్.. తైవాన్‌ను ఆక్రమించుకుంది. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయింది. దీంతో యుద్ధ సమయంలో మిత్రరాజ్యాల పక్షం వహించిన చియాంగ్ కై-షెక్ నేతృత్వంలోని చైనీయులకు తైవాన్‌ను తిరిగి ఇచ్చారు.

1949లో చియాంగ్‌ చైనాలో అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయారు. అనంతరం చియాంగ్ వర్గం తైవాన్‌కు పారిపోయి, అక్కడ పరిపాలన కొనసాగించారు. అనంతరం మావో తైవాన్‌పై దాడి చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే 1950లో కొరియాతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోన తైవాన్ పై దాడిని విరమించుకున్నారు మావో. అయితే .. తూర్పు ఆసియాలో చైనాకు కళ్లెం వేసేందుకు  ఎదురుచూస్తున్న  అమెరికా.. తైవాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంది. తైవాన్ కు అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చింది. అక్కడి నుంచి తైవాన్ అమెరికా దోస్తీ, వీళ్లిద్దరికీ చైనాతో శత్రుత్వం మొదలైంది. 

తైవాన్ పై చైనాకు ఎందుకంత ఫోకస్..?

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 100వ వార్షికోత్సవం జరిగే 2049 నాటికి చైనాను అతిపెద్ద శక్తిగా నిలిపేందుకు ప్రణాళికలు రచించారు జిన్‌పింగ్. ఆసియాలో ఆర్థిక ప్రాబల్యంతో పాటు టిబెట్, హాంకాంగ్, తైవాన్ వంటి భూభాగాలను విలీనం చేసుకొని "గ్రేటర్ చైనా" పేరుతో నియంత్రణను తిరిగి పొందడానికి చైనా అధ్యక్షుడు పావులు కదుపుతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చాలా వేదికల్లో మాట్లాడుతూ.. తైవాన్ చైనా ప్రావిన్సని, త్వరలోనే చైనాలో విలీనం అవుతుందని అన్నారు. తైవాన్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకోకపోతే టిబెట్,జిన్జియాంగ్ లలో ఇబ్బందులు తప్పవని చైనా భావిస్తోంది. అందుకే చైనా పునరేకీకరణకు దిగింది.

అమెరికా వైఖరేంటి..?

దశాబ్దాలుగా తైవాన్‌కు అమెరికా ఆర్థిక, సైనిక పరమైన మద్దతును అందిస్తోంది. ఈ ప్రాంతానికి అధికారికంగా స్వాతంత్ర్యం ఇచ్చినట్లు ప్రకటిస్తే.. చైనా ప్రతిష్టకు భారీ నష్టం కలిగించవచ్చని అమెరికా భావిస్తోంది. అయితే.. తైవాన్‌పై చైనా దాడి చేస్తే.. రక్షణకు హామీ ఇస్తామని అమెరికా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆర్థికంగా, మిలిటరీ పరంగా  సాయం అందిస్తూనే ఉంది. అమెరికాకు 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా తైవాన్ నిలుస్తోంది. మరీ ఈ ప్రాంతం చైనా ఆదీనంలోకి వెళ్తే.. తమ ఆర్ధిక మూలాలకు దెబ్బ పడుతుందని అమెరికా భయం. ఎందుకంటే టెక్నాలజీ, సెమీకండక్టర్ ఉత్పత్తి రంగాల్లో తైవాన్ ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా ఉంది.

అంతే కాకుండా చైనా నియంత్రణలోకి తైవాన్ వెళ్తే.. చైనా.. తూర్పు చైనా సముద్రంలో సైనికంగా ఆధిపత్య శక్తిగా మారుతుంది. దీంతో యూఎస్ ద్వీపమైన గువామ్‌పై చైనా దాడి చేసే ఛాన్సుందని అమెరికా ఆందోళన. అందుకే తైవాన్‌ పునరేకీకరణను అమెరికా సమర్థించట్లేదు. ఉక్రెయిన్ తో కంటే కూడా అమెరికాకు తైవాన్ తో ఎక్కువ బంధం, అవసరం ఉంది. అందువల్ల ఒకవేళ చైనా తైవాన్ పై దురాక్రమణకు దిగితే అమెరికా తైవాన్ కు అండగా నిలిచే పరిస్థితి ఉంది.

మరి చైనా దాడి చేస్తుందా...? 

అయితే ఇప్పటికిప్పుడు చైనా తైవాన్ పై దాడికి దిగే పరిస్థితులైతే లేవని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఒకవేళ చైనా తైవాన్‌పై దాడి చేస్తే.. దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయని చైనాకు తెలుసు. అంతర్జాతీయంగా చైనా ఒంటరయ్యే పరిస్థితి ఉంది. ఇంకోవైపు తైవాన్ పై సానుభూతి పెరిగే అవకాశం ఉంది. అసలే కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచ దేశాలన్నీ చైనాపై గుర్రుగా ఉన్నాయి. దీనికి తోడు అమెరికాతో పాటు ఇండియా కూడా తైవాన్ కు సాయం చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆర్ధిక పరమైన ఆంక్షలను కూడా చైనా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రపంచ నాయకుడిగా తనను తాను నిలబెట్టుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది.

తైవాన్‌లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి..?

తైవాన్ తమ దేశంలో విలీనం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్న చైనా... తైవాన్ లో వేర్పాటువాద ఉద్యమానికి తెర తీసింది. దాదాపు మూడొంతుల్లో ఒకటో వంతు తైవాన్ ప్రజలు చైనాలో కలవడానికి ఇష్టపడుతున్నారు. స్వేచ్ఛను కోరుకునే తైవాన్ ప్రజలు చైనా లాంటి కమ్యూనిస్టు పాలనను కోరుకోవట్లేదు. పునరేకీకరణ తర్వాత తైవాన్‌కు స్వయంప్రతిపత్తిని ఇస్తామన్న చైనా వాగ్దానాన్ని వారు నమ్మడంలేదు. తైవాన్ కూడా చైనా విషయంలో కయ్యానికి కాలు దువ్వే పరిస్థితి లేదు. ఎందుకంటే చైనా తైవాన్ కంటే సైనికపరంగా ఎంతో ముందజలో ఉంది. వీటన్నింటి నేపథ్యంలో చైనా, తైవాన్ అంశం.. రష్యా, ఉక్రెయిన్ లా మారే పరిస్థితి ఇప్పుడైతే లేకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

వార్‌పై రష్యాకు వ్యతిరేక తీర్మానం.. ఓటేయని భారత్

అమెరికా ఆఫర్.. నో చెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు