Turkey Earthquake:భూకంప శిథిలాల కింద బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

Turkey Earthquake:భూకంప శిథిలాల కింద బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

టర్కీ, సిరియాల్లో వచ్చిన భూకంపం బీభత్సం సృష్టించింది. ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాలు.. శిథిలాల కింద మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. కొన్ని శిథిలాల కింద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్న జనాన్ని చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది. 

టర్కీలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడుతున్న క్రమంలో సహాయక సిబ్బందికి శిశువు ఏడుపు వినిపించింది. శిథిలాలను తొలగించి శిశువు దగ్గరకు వెళ్లిన సహాయక సిబ్బంది అక్కడి పరిస్థితిని చూసి కన్నీళ్లు ఆగలేదు. ఓ బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న ఓ నిండు గర్భిణీ అక్కడే ప్రసవించింది. బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి కన్నుమూసింది.  దీంతో గుక్కపట్టి ఏడుస్తున్నశిశువును రక్షించిన రెస్క్యూ టీం వెంటనే హాస్పిటల్ కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది.

మ‌రో ఘ‌ట‌న‌లో కన్న బిడ్డలు క‌ళ్లెదుటే చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బిడ్డల మృతదేహాలను ఎత్తుకుని బోరున విల‌పిస్తున్న దృశ్యాలు ప్రతీ ఒక్కరిని క‌లిచివేస్తున్నాయి. 

టర్కీలో వరుస భూప్రకంపనలతో భయానక వాతావరణం నెలకొంది. భూకంపం ధాటికి భారీ భవంతులు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ విపత్తు కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. వందలాది ఇళ్లు  ధ్వంసం అయ్యాయి.భూకంపం ధాటికి టర్కీ, సిరియాలో ఇప్పటి వరకు 5 వేల మందికి పైగా ప్రాణాలు విడిచారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు  టర్కీలో ఇప్పటి వరకు 145 సార్లు భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనలు మరికొన్ని రోజులు లేదా వారాల పాటు కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.