
పెట్ లవర్స్.. పెంపుడు కుక్కల్ని ఇంటిలో మనిషిలానే చూసుకుంటారు. అది ఒక ప్రెండ్ కాదు సొంత బిడ్డ అన్నట్టు చూసుకునే వాళ్లూ ఉన్నారు. నిజానికి ఆ కుక్కను అది.. ఇది అంటే కూడా ఒప్పుకోరు. దాని ముద్దు పేరుతో పిలవాల్సిందే. సరిగ్గా అలాంటి ఓ పెట్ లవర్ తన పెంపుడు కుక్క తప్పిపోవడంతో దాని కోసం కంటి మీద కునుకు లేకుండా వెతుకులాడుతోంది. సుమారు 7.5 లక్షల (10 వేల డాలర్లు) రివార్డు కూడా ప్రకటించింది.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఎమిలీ టాల్రెమో అనే మహిళ ఆస్ట్రేలియన్ షెఫర్డ్ డాగ్‌ను పెంచుకుంటోంది. దాని పేరు జాక్సన్.. వయసు ఐదేళ్లు. గత శనివారం ఓ గ్రోసరీ స్టోర్ దగ్గర జాక్సన్ తప్పిపోవడంతో గాబరా పడుతోంది ఎమిలీ. జాక్సన్ అంతే తనకు ఎనలేని ప్రేమ అని, ఎవరో దొంగిలించి ఉంటారని కూడా తనకు అనుమానంగా ఉందని చెప్పిందామె. అయితే జాక్సన్ ఆచూకీ కోసం ఓ ప్లేన్‌ను అద్దెకు తీసుకుని మరీ వెతుకుతోంది ఎమిలీ. అలాగే ఎవరైనా ఆచూకీ తెలిస్తే, తనకు తెచ్చివ్వాలని కోరుతోంది. అలా తీసుకొచ్చినవారికి 7.5 లక్షల రివార్డు ఇస్తానని ప్రకటించింది. ఇందుకు అవసరమయ్యే డబ్బు కోసం ఫండ్ రైజింగ్ చేస్తోంది ఎమిలీ.