మహిళల టీ20 వరల్డ్ కప్‌: పాక్‌పై భారత్ గెలుపు

మహిళల టీ20 వరల్డ్ కప్‌: పాక్‌పై భారత్ గెలుపు

మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా అదరగొట్టింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్ లో ఇవాళ భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. పాక్‌ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. భారత్ బ్యాటింగ్‌లో జెమీమీ రోడ్రిగ్స్‌ (53) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. షెఫాలీ వర్మ (33), రీచా ఘోష్‌ (31) పరుగులు చేశారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (16), యాస్తికా భాటియా(17) నిరుత్సహపరిచారు. ఇక పాక్‌ బౌలర్లలో నష్రా సంధు 2 వికెట్లు, సదియా ఇక్బాల్‌ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కెప్టెన్ బిస్మా మారూఫ్ బాధ్యతాయుతంగా ఆడి 55 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె స్కోరులో 7 బౌండరీలు ఉన్నాయి. చివర్లో ఆయేషా నసీమ్ ధాటిగా ఆడడంతో పాక్ కు 150  స్కోరు వచ్చింది. ఆయేషా 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేసింది.  కాగా, టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్ 2, దీప్తి శర్మ 1, పూజా వస్త్రాకర్ 1 వికెట్ తీశారు.