
జుట్టు రాలడం అనేది దాదాపు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య. అయితే, దీని పరిష్కారం కోసమంటూ ఎన్నో షాంపూలు, క్రీమ్‌లు, ఆయిల్స్ మార్కెట్లో ఉన్నాయి. అవి సరిగా పనిచేస్తాయా? లేదా? అనేది పక్కన పెడితే జుట్టు రాలడాన్ని అడ్డుకునే ప్రొడక్ట్‌గా మార్కెట్లోకి ఫస్ట్ వచ్చిన క్రీమ్ మాత్రం ‘వండర్ఫుల్ హెయిర్ గ్రోవర్’ అని చెప్పొచ్చు. ఈ క్రీమ్ ఫార్ములాను కనిపెట్టి, ఫ్యాక్టరీ కట్టి, వేలమంది మహిళలకు ఉద్యోగమిచ్చింది. ఎంతోమంది మహిళలకు అండగా నిలిచింది మేడమ్ సి.జె.వాకర్. అమెరికాలోనే మొట్టమొదటి సెల్ఫ్‌మేడ్ మిలియనీర్‌గా పేరు పొందిన ఈ ఆఫ్రికన్ లేడీ జీవితమే ఈ వారం ఇన్స్పిరేషన్. మేడమ్ సి.జె.వాకర్ అసలు పేరు సారా బ్రీడ్లోవ్. అమెరికాలోని డెల్టా సిటీలో డిసెంబర్ 23, 1867న పుట్టింది. తల్లిదండ్రులు ఒవెన్ బ్రీడ్లోవ్, మినర్వా ఆండర్సన్. వీళ్లను ఆఫ్రికా నుంచి కొనుక్కొచ్చి, బానిసలుగా చేసుకున్నారు అమెరికన్లు. పత్తి పొలాల్లో పనిచేస్తూ, దగ్గర్లో ఉన్న కాటన్ ఫ్యాక్టరీలోని ఒక చిన్న రూమ్లాంటి కేబిన్‌లో ఉండేవాళ్లు ఒవెన్, మినర్వా. వీళ్లకు మొత్తం ఆరుగురు పిల్లలు. ఆ పిల్లల్లో ఐదోది సారా.
ఏడేండ్లకే పనిలోకి...
సారాకు ఆరేండ్ల వయసున్నప్పుడు తల్లి చనిపోయింది. తండ్రి మరో పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రెండేండ్లకే ఆయన కూడా చనిపోయాడు. దాంతో సవతి తల్లి తనదారి తాను చూసుకుంది. పిల్లలు చెల్లాచెదురయ్యారు. అప్పటికే సారా అక్క లూవెనియాకు పెండ్లి అయింది. దాంతో సారాను తనతోపాటు విక్స్బర్గ్ సిటీకి తీసుకెళ్లింది. ఏడేండ్ల వయసులోనే పత్తి పొలాల్లో పనికి వెళ్లేది సారా. ఆదివారం చర్చికి వెళ్తూ అక్కడి స్కూల్లో మూడు నెలలు మాత్రమే చదువుకుంది. ఆ తర్వాత కుదర్లేదు. సారా అంటే ఆమె బావకు ఇష్టం ఉండేదికాదు. ఇంటి నుంచి వెళ్లగొట్టాలని అనుకునేవాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టేవాడు. ఆ బాధలు తట్టుకోలేక 14 ఏండ్ల వయసులోనే మోసెస్ మెక్విలియమ్స్ను పెండ్లి చేసుకొని ఇంటి నుంచి బయటపడింది. అయితే, సారాను దురదృష్టం విడిచిపెట్టలేదు. ఏడాది కాకముందే భర్త చనిపోయాడు. అప్పటికి సారా గర్భవతి. కొన్ని రోజులకు కూతురు లెలియా పుట్టింది. తన అన్నలు సెయింట్‌లూయిస్ టౌన్లో ఉంటున్నారని తెలుసుకుని, పాపతో సహా అక్కడికి చేరింది. బార్బర్స్గా పనిచేస్తున్న అన్నల సాయంతో ఒక లాండ్రీ షాపులో బట్టలు ఉతకడానికి చేరింది. అక్కడ రోజుకు1.50 డాలర్లు ఇచ్చేవాళ్లు. ఆ డబ్బును కూతురి చదువు కోసం జాగ్రత్తగా దాచుకునేది. తోటి ఉద్యోగి జాన్ డేవిస్‌ను1894లో పెండ్లి చేసుకుంది. దాదాపు 18 ఏండ్లు లాండ్రీ షాపులో పనిచేసింది సారా.
దారి చూపిన ‘సమస్య’
లాండ్రీ షాపులో పనిచేస్తున్నప్పుడు అక్కడి వాతావారణం పడక సారాకు జట్టు బాగా రాలిపోయేది. దానివల్ల తల మీద గుండ్రంగా మచ్చలు ఏర్పడ్డాయి. అవి చూసేందుకు వికారంగా ఉండేవి. వాటిని చూసుకుని తెగ బాధపడేది సారా. అదే టైంలో ఆమె రెండో పెండ్లి కూడా పెటాకులైంది.1903లో జాన్ డేవిస్ విడాకులిచ్చాడు. దాంతో కూతుర్ని తీసుకొని డెన్వర్ సిటీకి చేరుకుంది సారా. అక్కడ యానీ మెలోన్ అనే ఆఫ్రోఅమెరికన్ మహిళ పెట్టిన ఫ్యాక్టరీలో చేరింది. అందులో రకరకాల హోమ్మేడ్ హెయిర్‌కేర్ ప్రొడక్ట్స్ తయారుచేసేవాళ్ళు. అయితే, అవేవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ ఫ్యాక్టరీలో చేరాక హెయిర్‌కేర్ ప్రొడక్ట్స్ తయారీపై పట్టు తెచ్చుకుంది సారా. తనకి కూడా జట్టు రాలే సమస్య ఉండడంతో తానే సొంతంగా ప్రయోగాలు చేసేది. అలా తయారైందే ‘వండర్ఫుల్ హెయిర్ గ్రోవర్’ క్రీమ్. ఈ క్రీమ్ సక్సె స్ అయింది. అయితే, దీని తయారీపై ‘యానీ మెలోన్’తో గొడవ రావడంతో ‘ఫార్ములా’ను తీసుకొని ఫ్యాక్టరీ నుంచి 1906లో బయటికొచ్చేసింది సారా. అప్పుడే న్యూస్ పేపర్ అడ్వర్టయిజ్మెంట్ సేల్స్‌మ్యాన్ చార్లెస్ జోసఫ్ వాకర్‌ను పెండ్లి చేసుకుంది. తన పేరును మేడమ్ సి.జె.వాకర్‌గా మార్చుకుంది. ఒక చిన్న బ్యూటీకేర్ షాప్ పెట్టి హెయిర్‌డ్రెస్సర్‌గా, బ్యూటీషియన్‌గా మారింది.
ఇంటింటికీ తిరిగి అమ్ముతూ...
తాను కనుక్కొన్న ఫార్ములాతో తయారుచేసిన హెయిర్‌కేర్ క్రీమ్‌కు ‘వండర్ఫుల్ హెయిర్గ్రోవర్’ అని పేరు పెట్టి అమ్మడం మొదలుపెట్టింది. మొదట్లో తానే స్వయంగా ఇంటింటికీ తిరుగుతూ క్రీమ్ అమ్మేది. భర్త సాయంతో అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా ఇచ్చేది. వండర్ఫుల్ హెయిర్గ్రోవర్కు మంచి పేరు రావడంతో సేల్స్ పెరిగాయి. ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఆఫ్రికన్ ప్రజలు ఈ క్రీమ్‌ను ఎక్కువగా కొనడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకు అన్ని చోట్లా క్రీమ్‌కు డిమాండ్ పెరిగిపోయింది. దాంతో 1907లో ‘మేడమ్ సి.జె.వాకర్ మాన్యుఫాక్చరింగ్కంపెనీ’ మొదలైంది. అలాగే సెయింట్‌లూయిస్, ఇండియానాపోలిస్, డెన్వర్‌లో ఫ్యాక్టరీలు, బ్యూటీక్లినిక్లు మొదలయ్యాయి. కరేబియన్ కంట్రీస్‌లోనూ ‘మేడమ్ సి.జె.వాకర్ కంపెనీ’ ప్రొడక్ట్స్ విపరీతంగా అమ్ముడయ్యేవి. కంపెనీకి అవసరమైన సేల్స్ఉమన్కి ట్రైనింగ్ ఇచ్చేందుకు కూతురి పేరు మీద ‘లెలియా కాలేజ్’ను కూడా మొదలుపెట్టింది సారా. ‘వండర్ఫుల్ హెయిర్గ్రోవర్ ’తోపాటు మిగిలిన కాస్మొటిక్స్ కూడా అమ్మడం స్టార్ట్ చేశారు. 1917నాటికి దాదాపు 20వేల మంది మహిళలు సారా కంపెనీలో పనిచేసేవాళ్లు. వీళ్లంతా అమెరికాలో
స్థిరపడిన ఆఫ్రికన్ మహిళలే...
ఆదాయం బాగా ఉండడంతో ‘సెల్ఫ్‌మేడ్ మిలియనీర్’గా ఎదిగింది సారా. 1916లో న్యూయార్క్‌లోని ఇర్వింగ్టన్లో ఒక పెద్ద మాన్షన్ ‘విల్లా లెవారో’ను కట్టించి, అందులోకి మారింది. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా 51 ఏండ్ల వయసులో మే 25, 1919లో సారా చనిపోయింది. అప్పటికి ఆమె ఆస్తుల విలువ పది లక్షల డాలర్లకు పైనే ఉంటుంది. సారా చనిపోయాక ఆమె కూతుళ్లు, మేనకోడళ్లు కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు. 1981 వరకు కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. ఆ తర్వాత మార్కెట్లో పోటీ తట్టుకోలేక మూతపడింది. 2016లో కంపెనీని ‘సండైల్ బ్రాండ్స్’ కొనుక్కుంది. ఆ తర్వాత ‘సండైల్ బ్రాండ్స్’ను యునీలివర్ తీసుకుంది. దాంతో అమెరికాలోని చాలా స్టోర్స్‌లో ‘మేడమ్ సి.జె.వాకర్ బ్యూటీ కల్చర్’ పేరుతో ప్రొడక్ట్స్ కనిపించడం మొదలైంది.
వాకర్ జీవితంపై నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్
అమెరికాలో బానిసలుగా ఆఫ్రికన్ ప్రజలు అనుభవించిన కష్టాలను కళ్లారా చూసింది వాకర్. అందుకే, వాళ్ల కోసం ఏం చేయడానికైనా వెనుకాడలేదు. నల్లజాతి ప్రజలపై జరుగుతున్న దాడులను అడ్డుకుంది. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది. తన సంపాదనలో చాలా భాగం ఆఫ్రికన్ ప్రజల కోసమే ఇచ్చింది. అంతేకాదు, ఆఫ్రికన్ పిల్లలు చదువుకునేలా స్కూళ్లు, కాలేజీలు కట్టించింది. స్కాలర్షిప్లు ఇచ్చింది. తన కంపెనీల్లో దాదాపు వందశాతం ఆఫ్రికా ప్రజలకే ఉద్యోగాలు ఇచ్చింది. తన కూతుర్ని బాగా చదివించి, ఆమె కూడా ఉద్యమాల్లో ఉండేలా చేసింది. మొదటి ప్రపంచయుద్ధంలో అమెరికా తరఫున పాల్గొని చనిపోయిన, గాయపడిన ఆఫ్రికన్ ప్రజలకు ఆర్థికంగా అండగా నిలిచింది. ముఖ్యంగా నీగ్రో మహిళలు చదువుకునేలా, ఆర్థికంగా బలపడేలా సాయమందించింది. ఎన్నో పోరాటాలకు తన ఇంటిని కేరాఫ్‌గా మార్చింది. అందుకే, అమెరికాలోని ఆఫ్రికన్ ప్రజలకు ఇప్పటికీ మేడమ్ సి.జె.వాకర్ అంటే ఎంతో అభిమానం. వందేండ్లు దాటినా ఇప్పటికీ నల్లజాతి ప్రజలకు ఆదర్శ మహిళగా మేడమ్ సి.జె.వాకర్ ప్రభ వెలుగుతూనే ఉంది. కాగా, ఇండియానాపోలిస్‌లోని మేడమ్ సి.జె.వాకర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ హెడ్‌క్వార్టర్ బిల్డింగ్‌ను1991లో ‘వాకర్ థియేటర్’ పేరుతో నేషనల్ హిస్టారిక్ ల్యాండ్ మార్క్‌గా మార్చింది అమెరికా గవర్నమెంట్. అలాగే వాకర్ జీవితంపై 2020లో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘సెల్ఫ్‌మేడ్’ పేరుతో వెబ్‌సిరీస్ కూడా రిలీజ్ అయింది.