
ప్రతి పదిలో 9 సంస్థలు ఇదే వెల్లడి
2020 ఇంటెలిజెంట్ వర్క్‌ప్లేస్ రిపోర్ట్
న్యూఢిల్లీ: కరోనా సమయంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సవాలుగా నిలిచిందని సంస్థలు చెప్పాయి. ప్రతి 10 సంస్థల్లో తొమ్మిది ఇదే విషయాన్ని వెల్లడించినట్టు తాజా సర్వేలో తెలిసింది. కనెక్టివిటీ, వర్క్‌స్పేస్ సమస్యలు వంటి కారణాలతో పాటు ఐసోలేషన్ ఫీలింగ్‌తో ఉద్యోగులు ఒత్తిడికి గురైనట్టు సర్వేలో తేలింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే సగానికి పైగా ఉద్యోగులు ఎక్కువ గంటల పాటు తాము పని చేస్తున్నామని చూపించడం కోసం ఒత్తిడికి లోనైనట్టు సంస్థలు చెప్పాయి. గ్లోబల్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ ఎన్‌టీటీ 2020 ఇంటెలిజెంట్ వర్క్‌ప్లేస్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌లో ఉద్యోగులను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు కంపెనీలు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాయని తెలిపింది. 90 శాతం సంస్థలు ఇంటి నుంచి పని చేయడం ఉద్యోగులకు సవాలుగా మారినట్టు పేర్కొన్నాయి. 19 మార్కెట్లలో 1,350 సంస్థలపై సర్వే చేసి ఎన్‌టీటీ ఈ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఒకవేళ ఆఫీసులు సురక్షితం అయితే 89 శాతం సంస్థలు ఉద్యోగులు ఆఫీసు నుంచే పనిచేసుకునే సౌకర్యాన్ని, అనుమతిని ఇస్తామని తెలిపాయి. టీమ్‌వర్క్ లేదా క్లయింట్స్ మీటింగ్ కోసం 92 శాతం సంస్థలు ఫేస్–టూ–ఫేస్ మీటింగ్‌లు ఎంతో అవసరమని చెప్పాయి. కరోనా వైరస్‌తో ప్రపంచమంతా కొత్త కొత్త విధానాలను అందిపుచ్చుకుంటున్నాయి. అన్ని వ్యాపారాల్లో మూడోవంతు వ్యాపారాలు తమ ఉద్యోగులకు సాయం చేసేందుకు ఐటీ పాలసీలను మారుస్తున్నాయి. కొత్త ఆపరేటింగ్ మోడల్‌లో ఉద్యోగులు పని చేసుకునేలా సహకరిస్తున్నాయి. సగానికి పైగా సంస్థలు కొత్త కమ్యూనికేషన్, ప్రొడక్టివిటీ టూల్స్‌ను తెస్తున్నాయి. సెక్యూరిటీ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున చాలా సందర్భాల్లో ఉద్యోగులు తమ వ్యక్తిగత డివైజ్‌లు, అప్లికేషన్లు వాడటం మానేశారు. 64 శాతం సంస్థలు తమ ఐటీ సెక్యూరిటీ సామర్థ్యాలను పెంచాయి. సంస్థలు ఉద్యోగులను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం 59 శాతం వ్యాపారాలు తమ ఆఫీసు డిజైన్లను మారుస్తున్నాయి. ఉద్యోగులకు కొత్తగా కావాల్సిన అవసరాలకు అనుగుణంగా ఆఫీసులను తీర్చిదిద్దుతున్నాయి. భవిష్యత్ వర్క్‌ప్లేస్ డిజైన్ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగానే ఉండనుందని 96 శాతం సంస్థలు నమ్ముతున్నాయి.
ఉద్యోగుల అనుభవంపై ఫోకస్…
‘కరోనా వల్ల ఏర్పడిన సవాళ్లను వ్యాపారాలు ఎలా ఎదుర్కొంటాయి? వర్క్‌ప్లేస్ స్ట్రాటజీని మార్చడం వంటివి భవిష్యత్ పని వాతావరణానికి ముఖ్యమైనవిగా నిలుస్తున్నాయి. ముందు మాదిరిగా ఏడాది లెక్కన కాకుండా నెలలను పరిగణనలోకి తీసుకుని కంపెనీల పనితీరు మారుతోంది. ఉద్యోగుల అనుభవం, డేటా డ్రివెన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోన్న కంపెనీలు ఈ గేమ్‌లో ముందంజలో ఉన్నాయి’ అని ఎన్‌టీటీ ఆసియా పసిఫిక్ ఇంటెలిజెంట్ వర్క్‌ప్లేస్ సీనియర్ డైరెక్టర్ ప్రణయ్ ఆనంద్ అన్నారు. అంతకుముందులా కాకుండా ఉద్యోగుల అనుభవంపై లీడర్లు ఎక్కువగా దృష్టి పెట్టాలని ఎన్‌టీటీ హ్యుమన్ రిసోర్సెస్ అండ్ అలియెన్సెస్ సీనియర్ డైరెక్టర్ కేఎన్ మురళి చెప్పారు. ఉద్యోగులను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచటం, సౌకర్యవంతమైన విధానాలు, లాంగ్ టర్మ్‌లో ఉద్యోగులు పనిచేయగలగడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని వర్క్‌ప్లేస్ స్ట్రాటజీలపై కంపెనీలు మరోమారు ఆలోచించాలని మురళి పేర్కొన్నారు. కరోనాకు ముందు 15 శాతం సంస్థలు మాత్రమే ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్‌కు అనుమతించేవి. కానీ ఇప్పుడు 90 శాతం కంపెనీలు ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అరేంజ్‌మెంట్లు చేస్తున్నాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ప్రోబ్లమ్స్
ఒంటరితనంతో బాధపడుతున్న వర్కర్లు
వైఫై కనెక్టివిటీ, వీడియో కాన్ఫరెన్సింగ్ ప్రోబ్లమ్స్
ఇంటి నుంచి పనిలో ఎక్కువ పని ఒత్తిడి
ఎక్కువ గంటల పాటు వర్కింగ్ అవర్స్
For More News..