షావోమీ వాళ్లను కొట్టలేదు మాపై వచ్చిన ఆరోపణలు అబద్ధం

షావోమీ వాళ్లను కొట్టలేదు మాపై వచ్చిన ఆరోపణలు అబద్ధం

న్యూఢిల్లీ: షావోమీకి వ్యతిరేకంగా ఇటీవల నమోదైన మనీలాండరింగ్​ కేసు దర్యాప్తు సందర్భంగా తమ కంపెనీ ప్రతినిధులను ఈడీ ఆఫీసర్లు కొట్టారనీ, బెదిరించారని చైనా ఎలక్ట్రానిక్స్​ కంపెనీ షావోమీ ఆరోపించింది. తమ మాజీ ఎండీ మనుకుమార్​ జైన్​, సీఎఫ్​సీ సమీర్​ రావును బెదిరించారని పేర్కొంది. తాము చెప్పినట్టు స్టేట్​మెంట్​ ఇవ్వకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని హెచ్చరించారని ఆరోపించింది. చాలా రోజులపాటు తమ ఎగ్జిక్యూటివ్​లు హింసను భరించారని స్పష్టం చేసింది. దీనిపై ఈడీ తీవ్రంగా రియాక్ట్​ అయింది. షావోమీ చేసిన ఆరోపణలు నిరాధామని, అబద్ధాలని స్పష్టం చేసింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్​లు స్వచ్ఛందంగా తమ స్టేట్​మెంట్లు ఇచ్చారని, తామంతా మర్యాదపూర్వకంగానే మాట్లాడుకున్నామని స్పష్టం చేసింది.     స్టేట్‌‌మెంట్‌‌లను రికార్డ్ చేసే సమయంలో వారు ఏ రకమైన ఫిర్యాదూ చేయలేదని తెలిపింది. పోయిన నెలలో స్టేట్​మెంట్లు ఇచ్చి.. ఇప్పుడు బెదిరించారని ఆరోపించడం సరికాదని విమర్శించింది. 

అసలు కేసు ఏమిటంటే..

షావోమీ ‘ఇండియన్​ ఫారిన్​ ఎక్స్ఛేంజ్​ చట్టం’ లోని రూల్స్​కు వ్యతిరేకంగా లావాదేవీలు చేసిందని పేర్కొంటూ ఈడీ పోయిన నెల రూ.5,551 కోట్ల డబ్బును సీజ్​ చేసింది. ఈ డబ్బంతా షావోమీ ఇండియా బ్యాంకు ఖాతాల్లో ఉందని తెలిపింది.ఫెమా చట్ట ప్రకారం ఈ చర్య తీసుకుంది. ‘‘ఈ కంపెనీ చట్టవిరుద్ధంగా చైనాకు ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున డబ్బు పంపింది.   మూడు విదేశీ  సంస్థలకు రాయల్టీ ముసుగులో రూ. 5,551.27 కోట్లకు సమానమైన విదేశీ కరెన్సీని పంపింది. రాయల్టీల పేరుతో ఇంత భారీ మొత్తాలను వారి చైనీస్ “పేరెంట్ గ్రూప్” సంస్థల సూచనల మేరకే పంపించింది.  మరో రెండు యూఎస్​  సంస్థలకు పంపిన మొత్తం కూడా షావోమీ గ్రూప్ ఎంటిటీల కోసమే!  ఈ   విదేశీ  సంస్థల నుండి ఎటువంటి సేవలను కంపెనీ పొందలేదు.  అయినప్పటికీ రాయల్టీ ముసుగులో విదేశాలకు డబ్బు పంపడం ఫెమాలోని సెక్షన్ 4కు వ్యతిరేకం” అనిపేర్కొంది.