అక్రమ లావాదేవీలతో 5 వేల కోట్లు సొంతం చేసుకున్నారు

అక్రమ లావాదేవీలతో 5 వేల కోట్లు సొంతం చేసుకున్నారు
  • రాణా కపూర్​, వాధ్వాన్​పై ఈడీ ఆరోపణ

ముంబై: యెస్ బ్యాంక్ కో–ఫౌండర్​ రాణా కపూర్,  దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్​ఎఫ్​ఎల్​) ప్రమోటర్లు కపిల్  ధీరజ్ వాధ్వాన్ అక్రమ లావాదేవీల ద్వారా రూ. 5,050 కోట్లు సొంతం చేసుకున్నారని  ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది.  ఈ మేరకు రిజిస్టర్​ చేసిన  మనీలాండరింగ్ కేసులో రాణా కపూర్, అతని కుటుంబం, వాధ్వాన్​లు,  ఇతరులపై ముంబైలోని ఇక్కడి ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌‌లో ఈడీ ఈ విషయాన్ని పేర్కొంది. 
ఇలా సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగాన్ని రాణా కపూర్ విదేశాలకు తరలించారని, అందువల్ల మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని (పీఎంఎల్​ఏ) రూల్స్​ ప్రకారం నేరుగా ఆస్తుల అటాచ్‌‌మెంట్‌‌  సాధ్యం కావడం లేదని  పేర్కొంది. ఈడీ వివరాల ప్రకారం..  డీహెచ్​ఎఫ్​ఎల్​ నుండి యెస్ బ్యాంక్ ఏప్రిల్ 2018 నుంచి  జూన్ 2018 మధ్య రూ. 3,700 కోట్ల విలువైన డిబెంచర్‌‌లను కొన్నది. డబ్బంతా డీహెచ్​ఎఫ్ఎల్​కి బదిలీ అయింది.  
డీహెచ్​ఎఫ్ఎల్​ ‘డూ ఇట్​ అర్బన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ (రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యుల సంస్థ)కు రూ. 600 కోట్ల లోన్​ ఇచ్చింది. అంతేగాక  డీహెచ్​ఎఫ్ఎల్ డిబెంచర్ల కోసం యెస్ బ్యాంక్ జనం డబ్బును ఉపయోగించినట్లు కూడా విచారణలో వెల్లడైంది. ఈ డిబెంచర్ల రిడంప్షన్​ జరగనే లేదు.  రాణా కపూర్‌‌ కంపెనీ డీయూవీపీఎల్​కి తగిన పూచీకత్తు లేకుండా రూ. 600 కోట్ల అప్పును ఇచ్చింది. ఇది చట్టవ్యతిరేకం. 
రూ.39.68 కోట్ల విలువైన నాసిరకం ఆస్తులపై రూ.600 కోట్ల అప్పు ఇచ్చారు. ఇందుకోసం వ్యవసాయ భూమిని నివాస భూమిగా మార్చారు. దాని విలువను రూ.735 కోట్లకు పెంచి చూపించారు.  ఈ అప్పు ఇవ్వడానికి ముందు యెస్ బ్యాంక్ డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా వెలుగులోకి వచ్చింది.  ఇందుకోసం రాణా కపూర్,  కపిల్  ధీరజ్ వాధ్వాన్​ కుట్రపన్నారు. లోన్​ ప్రపోజల్​ సమయంలో డీయూవీపీఎల్​లో ఎటువంటి  వ్యాపారం జరగలేదు.