ఎస్ బ్యాంకు కేసులో కపూర్ అరెస్ట్‌‌.. రోజంతా హడావుడే

ఎస్ బ్యాంకు కేసులో కపూర్ అరెస్ట్‌‌.. రోజంతా హడావుడే

న్యూఢిల్లీ: యెస్ బ్యాంక్‌‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ బ్యాంకు కో– ఫౌండర్‌‌, మాజీ సీఈఓ రాణా కపూర్‌‌ను ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టర్‌‌ (ఈడీ) శనివారం అరెస్టు చేసింది. సీబీఐ కూడా రంగంలోకి దిగి కపూర్‌‌తోపాటు డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌పైనా కేసులు పెట్టింది.  యెస్‌‌ బ్యాంకు కుప్పకూలడానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి శుక్ర, శనివారాల్లో రాణాకపూర్‌‌ను, ఆయన కుటుంబ సభ్యులను ముంబైలో 20 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు.. ఆదివారం ఆయనను అరెస్టు చేశారు. ప్రివెన్షన్‌‌ ఆఫ్‌‌ మనీలాండరింగ్‌‌ చట్టంలోని సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. విచారణకు సహకరించకపోవడం వల్లే ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ వంటి కొన్ని కంపెనీల నుంచి లంచాలు తీసుకొని లోన్లు ఇచ్చారని, డిబెంచర్లు కూడా కొన్నారని ఈడీ ఆరోపించింది. అందుకే డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ లోన్లు మొండిబాకీలుగా మారాయని పేర్కొంది. ముంబైలోని స్పెషల్‌‌ హాలిడే కోర్టు కపూర్‌‌కు ఈ నెల 11 వరకు పోలీసు కస్టడీ విధించింది. ‘‘డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ (ఇది తదనంతరం దివాలా తీసింది) నుంచి యెస్‌‌ బ్యాంకు రూ.3,700 కోట్ల విలువైన డిబెంచర్లు కొన్నది. బదులుగా డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌… కపూర్‌‌ కూతుళ్లు డైరెక్టర్లుగా ఉన్న డాయిట్‌‌ అర్బన్‌‌ వెంచర్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌కు కొల్లేటర్​ లేకుండా రూ.600 కోట్ల విలువైన లోన్‌‌ ఇచ్చింది.  డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌, యెస్ బ్యాంక్‌‌ ప్రమోటర్లు వాధ్వాన్‌‌, కపూర్‌‌లు కుట్ర చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. రూ.4,300 కోట్ల విలువైన ప్రజాధనం దుర్వినియోగం అయింది. రూ.రెండు వేల కోట్ల విలువైన ఇన్వెస్ట్‌‌మెంట్లు, 44 ఖరీదైన పెయింటింగ్స్‌‌, 12 షెల్‌‌ కంపెనీలు, కపూర్‌‌ విదేశీ ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోంది’’ అని ఈడీ తెలిపింది. ఇదిలా ఉంటే, అవినీతి నిరోధక చట్టం, ఇండియన్‌‌ పీనల్‌‌ కోడ్‌‌లోని సెక్షన్ల ప్రకారం కపూర్‌‌, వాద్వాన్‌‌, డాయిట్‌‌ అర్బన్‌‌ డైరెక్టర్లపై కేసులు పెట్టామని సీబీఐ  తెలిపింది.

కపూర్‌‌… ఒకప్పుడు బ్యాం‘కింగ్‌‌’

దేశంలోని ప్రముఖ బ్యాంకర్లలో ఒకరిగా ఒకప్పుడు వెలుగు వెలిగిన రాణా కపూర్‌‌కు ఇప్పుడు లాకప్‌‌లో ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. యెస్‌‌ బ్యాంక్‌‌ను 17 ఏళ్లలో అయిదు పెద్ద ప్రైవేటు బ్యాంకులలో ఒకటిగా చేయగలిగిన రాణా  కపూర్‌‌, సొంతంగా ఎదిగిన బిలియనీర్‌‌గానూ మారారు. ఆయన కుటుంబ సభ్యులు డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌కు అక్రమంగా అప్పులు ఇచ్చారని, తద్వారా అందిన ముడుపులతో విదేశాల్లో ఆస్తులు కొన్నారని ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు.  ఇదే కేసులో ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు రావొచ్చని ఎక్స్‌‌పర్టులు అంటున్నారు. విచ్చలవిడిగా అప్పులు ఇవ్వడం వల్లే ఎన్‌‌పీఏలు పెరిగాయని తెలిపారు. ఎంత రిస్క్‌‌ ఉన్నా అప్పు ఇవ్వడానికి వెనుకంజవేయలేదు. ఇతర బ్యాంకులు నో చెప్పిన కార్పొరేట్‌‌ కంపెనీలకు కూడా యెస్ బ్యాంకు అప్పులు ఇచ్చేది. తదనంతరం ఆయన యెస్ బ్యాంక్‌‌లోని తన వాటాలన్నింటినీ అమ్మేశారు.  తన సంస్థను హెచ్‌‌డీఎఫ్‌‌సీ, కోట్‌‌క్‌‌ మహీంద్రా బ్యాంకులకు ధీటుగా తీర్చిదిద్దాలని కోరుకునేవారు.  ఆర్‌‌బీఐ 2015లో నిర్వహించిన అసెస్‌‌మెంట్‌‌..  దీని ఎన్‌‌పీఏలు రూ.8,373 కోట్లకు చేరాయని తేల్చింది. తమ ఎన్‌‌పీఏలు రూ.2,018 కోట్లు మాత్రమేనని యెస్ బ్యాంక్‌‌ చెప్పిందని ఆర్‌‌బీఐ విమర్శించింది. ఐఎల్‌‌ఎఫ్‌‌స్‌‌, డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ వంటి కంపెనీలకు ఇచ్చిన అప్పులు తిరిగి వసూలు కాక  ఎన్‌‌పీఏలు పేరుకుపోయాయి.

రోజంతా హడావుడే..

  • రాణా కపూర్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్లు, ఖరీదైన పెయింటింగ్స్‌‌, డొల్ల కంపెనీలపై దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ ప్రకటించింది. లండన్‌‌లోని కపూర్‌‌ కుటుంబ సభ్యుల ఆస్తుల డాక్యుమెంట్లనూ జప్తు చేసినట్టు వెల్లడించింది. లంచాలుగా అందిన డబ్బుతో లావాదేవీలు చేయడానికి డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఖరీదైన పెయింటింగ్స్‌‌లో కొన్నింటిని రాజకీయ నాయకుల నుంచి కొన్నట్టు గుర్తించారు. వీటిలో ఒక పెయింటింగ్​ను ప్రియాంకా గాంధీ నుంచి కొన్నట్టు సమాచారం.
  • విచారణలో భాగంగా కపూర్‌‌తోపాటు ఆయన భార్య బిందు, ముగ్గురు కూతుళ్ల నుంచి స్టేట్‌‌మెంట్లను రికార్డు చేశారు. బిందును కూడా ఈడీ ఆఫీసులో ప్రశ్నించారు. కపూర్‌‌ కూతుళ్ల కంపెనీపైనా సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఒక కూతురు ముంబై ఎయిర్​పోర్టు నుంచి లండన్​ వెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు.
  • తమ ఏటీఎంలన్నీ పనిచేస్తున్నాయని, వాటి నుంచి యథావిధిగా డబ్బు తీసుకోవచ్చని యెస్ బ్యాంక్‌‌ యాజమాన్యం ప్రకటించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలోనూ యెస్ బ్యాంక్‌‌ కార్డులను వాడొచ్చని తెలిపింది.
  • బాండ్ల రూపంలో యెస్ బ్యాంక్‌‌ తమకు రూ.662 కోట్లు బాకీ ఉందని ఇండియాబుల్స్ హౌజింగ్‌‌ ఫైనాన్స్‌‌ ప్రకటించింది. ఈ బ్యాంకు నుంచి టర్మ్‌‌లోన్లు తీసుకోలేదని తెలిపింది. బ్యాంకు కో–ఫౌండర్‌‌, మాజీ సీఈఓ రాణా కపూర్ అరెస్టు నేపథ్యంలో ఇండియా బుల్స్ ఈ వివరణ ఇచ్చింది.
  • యెస్ బ్యాంక్‌‌పై పరిమితుల వల్ల నిలిచిపోయిన సేవలను పూర్తిగా పునరుద్ధరించామని ఆన్‌‌లైన్‌‌ పేమెంట్స్‌‌ కంపెనీ ఫోన్‌ పే తెలిపింది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకును పేమెంట్‌‌ సర్వీస్‌‌ ప్రొవైడర్‌‌గా నియమించుకున్నామని ప్రకటించింది. యూపీఐ, క్రెడిట్‌‌, డెబిట్‌‌కార్డులన్నింటితో లావాదేవీలు చేసుకోవచ్చని తెలిపింది.
  • యెస్ బ్యాంకులో తాము వాటా మాత్రమే కొంటామని, దీనిని విలీనం చేసుకోబోమని ఎస్‌‌బీఐ చైర్మన్‌‌ రజనీశ్‌‌ కుమార్‌‌ ప్రకటించారు. ఆర్‌‌బీఐ తయారు చేసిన డ్రాఫ్ట్‌‌స్కీమ్‌‌పై సోమవారం స్పందిస్తామని చెప్పారు.