మొన్న టీఎస్​పీఎస్సీ.. ఇప్పుడు టెన్త్ క్వశ్చన్ పేపర్లు.. పేపర్ల లీక్​పై స్పందించని సీఎం కేసీఆర్   

మొన్న టీఎస్​పీఎస్సీ.. ఇప్పుడు టెన్త్ క్వశ్చన్ పేపర్లు.. పేపర్ల లీక్​పై స్పందించని సీఎం కేసీఆర్   
  • పరీక్షల నిర్వహణపై డీఈఓలు, కలెక్టర్ల నియంత్రణ కరువు  
  • వీడియో కాన్ఫరెన్స్​లకే పరిమితమైన మంత్రి, అధికారులు
  • పరీక్షల విభాగాల్లో సరిపడా సిబ్బంది లేరు
  • 15 నెలలుగా ఎస్ఎస్​సీ బోర్డు డైరెక్టర్ పోస్ట్ ఖాళీ   
  • పేపర్ లీక్​తో ఆదరాబాదరగా సెలవులో ఉన్న ఆఫీసర్​కు బాధ్యతలు    
  • ఆరు నెలలుగా ఇన్​చార్జ్​తోనే ఇంటర్ బోర్డు నిర్వహణ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ కంట్రోల్ తప్పింది. మొన్న టీఎస్​పీఎస్సీ ఎగ్జామ్ పేపర్లు లీక్ కాగా.. తాజాగా టెన్త్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల అలసత్వం.. వెరసి విద్యార్థులు, నిరుద్యోగులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా సర్కారు నామమాత్రంగా రివ్యూలు చేసి చేతులు దులుపుకుంటోంది. లీకేజీల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు.

మరోవైపు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ కనీసం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 11,456 స్కూళ్లకు చెందిన 4,94,620 మంది స్టూడెంట్లు అటెండ్ అవుతుండగా, 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన పలుమార్లు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఎగ్జాం సెంటర్లలో వాటర్, ఫర్నిచర్, ఇతర సమస్యల్లేకుండా చూడాలని ఆదేశించారు. కానీ, పరీక్షల నిర్వహణలో తప్పులు చేస్తే, చర్యలు ఉంటాయనేది మాత్రం పెద్దగా ప్రచారం చేయలేకపోయారు. ఉన్నతాధికారులంతా కలెక్టర్లు, డీఈఓలతో మాట్లాడారే గానీ,  కింది స్థాయిలో పనిచేసే ఇన్విజిలేటర్లతో ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. దీంతో సోమవారం తాండూరులో తెలుగు పేపర్ వాట్సప్​లో బయటిరాగా, మంగళవారం వరంగల్​లో హిందీ పేపర్ బయటకు వచ్చింది. ఈ నిర్లక్ష్యం ఎవరిదనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.   

ఇంటర్ బోర్డుకూ ఇన్​చార్జ్ సెక్రటరీనే 

రాష్ట్రంలో 9.47 లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ మెయిన్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తికాగా, మైనర్ పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, గతేడాది సెప్టెంబర్​లో ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమర్ జలీల్ రిటైర్ కాగా, అక్టోబర్ 1 నుంచి అప్పట్లో కాలేజేట్ కమిషనర్​గా ఉన్న నవీన్ మిట్టల్ కు బోర్డు ఎఫ్ఏసీ బాధ్యతలు ఇచ్చారు. అయితే, ఆయన్ను జనవరి31న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చి ప్రభుత్వం బదిలీ చేసింది. కీలకమైన రెవెన్యూ శాఖ, సీసీఎల్ఏ బాధ్యతలున్నా.. సర్కారు మాత్రం ఆయన్నే ఇంకా ఇంటర్ బోర్డుకు ఇంచార్జీగా కొనసాగిస్తోంది. అయితే, పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో ఇంటర్ బోర్డు అధికారులు, పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.

టీఎస్ పీఎస్సీలోనూ అరకొర సిబ్బంది  

టీఎస్ పీఎస్సీ ఇటీవల నిర్వహించిన పలు రిక్రూట్మెంట్ టెస్టులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి. దీంతో నాలుగు పరీక్షలు రద్దు చేయగా, రెండు పరీక్షలు వాయిదా వేశారు. మరో ఎగ్జామ్ రీషెడ్యూల్ చేశారు. క్వశ్చన్ పేపర్ల లీకేజీపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సిట్ విచారణ జరుగుతుండగా, తాజాగా ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈ పరీక్ష లీకేజీలో టీఎస్ పీఎస్సీసెక్రటరీ అనితా రాంచంద్రన్ పీఏ ప్రవీణ్​ కుమార్ కీలక సూత్రధారి. అతనికి గ్రూప్1 ప్రిలిమ్స్​లో ఏకంగా103 మార్కులు వచ్చినా, బబ్లింగ్​తప్పుతో క్వాలిఫై కాలేదు. పేపర్ లీకేజీపై కమిషన్​లోని చాలామందికి సంబంధం ఉందని సిట్ విచారణలో తేలింది.

కమిషన్ లో జాబ్ చేస్తున్న సిబ్బంది, పోటీ పరీక్షకు హాజరవుతున్నా.. వారిపై కనీసం నజర్ పెట్టకపోవడం, వంద మార్కులకు పైగా వచ్చినా అనుమానం రాకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క కమిషన్​లోనూ కేవలం165 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో సగం మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారు. వాస్తవానికి 400 వరకూ ఉద్యోగులు అవసరమని, ఆయా పోస్టులకు అనుమతి ఇవ్వాలని కమిషన్ అధికారులు సర్కారును కొంతకాలంగా కోరుతున్నా పట్టించుకోవడం లేదు.

పదిరోజుల్లో ముగ్గురు డైరెక్టర్లు

గతేడాది జనవరిలో సత్యనారాయణ రెడ్డి  చనిపోగా, కృష్ణారావుకు ఇన్​చార్జీ బాధ్యతలు ఇచ్చారు. ఆయన పేరెంట్స్ చనిపోవడంతో మార్చి 23న సమగ్ర శిక్షా అభియాన్​ఏఎస్పీడీ రమేశ్ కు ఎఫ్ఏసీ చార్జీ అందించారు. అయితే, రమేశ్ ఫాదర్ గుండెపోటుతో ఇటీవల మృతిచెందారు. దీంతో మార్చి 30న స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ కె.లింగయ్య​కు ఎస్ఎస్ సీ బోర్డు ఎఫ్ఏసీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఎఫ్ఏసీ బాధ్యతల్లో కొనసాగుతుండగానే, సెలవులో ఉన్న కృష్ణారావుకు సోమవారం పూర్తిస్థాయిలో ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బాధ్యతలు అప్పగిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, కృష్ణారావు మరోవారం, పది రోజుల తర్వాతే విధుల్లో చేరే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

పట్టింపులేని విద్యాశాఖ మంత్రి 

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పరీక్షల నిర్వహణపై పెద్దగా పట్టింపు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా15 నెలలుగా ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పోస్టు ఇంచార్జీ చేతిలో ఉంది. కనీసం రెగ్యులర్ అధికారిని నియమించాలనే ఆలోచన కూడా ఆమె చేయకపోవడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క ఇంటర్ బోర్డు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఖలీక్ గుండెపోటుతో చనిపోతే, కీలకమైన పరీక్షల టైమ్​లో ఎవ్వర్నీ నియమించలేదు. బోర్డు ఉద్యోగుల ఒత్తిడితో రెండున్నర నెలల తర్వాత ఆర్జేడీ జయప్రదబాయికి ఎఫ్ఏసీ బాధ్యతలు ఇచ్చారు.

బోర్డు చైర్మన్​గా ఉన్న ఆమె కనీసం ఓ కీలకమైన అధికారిని రిక్రూట్ చేసుకోకపోవడంపైనా అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇంటర్ బోర్డు ఇంచార్జీ సెక్రటరీ నవీన్ మిట్టల్ అక్టోబర్/నవంబర్ నెలల్లో నెలరోజుల పాటు గుజరాత్ ఎన్నికల డ్యూటీకి పోయినా.. ఎవ్వరికీ ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వలేదు. దీనిపైనా ఆమె నోరు మెదపలేదు. జనవరి నెలాఖరులోనే బోర్డు సెక్రటరీ కీలకమైన బాధ్యతల్లోకి బదిలీపై వెళ్లినా, కొత్త వారిని నియమించకపోవడంపై సైతం విమర్శలు వస్తున్నాయి. ఇంటర్ ఆన్​లైన్​వాల్యువేషన్​పైనే గందరగోళం ఏర్పడ్డా.. కనీసం క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు.

ఎస్ఎస్ సీ బోర్డుపై సర్కారు నిర్లక్ష్యం 

టెన్త్ పరీక్షల నిర్వహణలో కీలకంగా ఉండే ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్ఎస్ సీ బోర్డు)పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏకంగా 15 నెలలుగా ఆ విభాగానికి పూర్తిస్థాయి డైరెక్టర్​ను నియమించలేదు. గతేడాది జనవరిలో పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. అప్పట్లో సైట్(స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ) డైరెక్టర్ కృష్ణారావుకు ఇన్​చార్జ్​తో బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఎఫ్ఏసీ(ఫుల్ అడిషనల్ చార్జ్)తోనే నడిపించారు.

తాజాగా తెలుగు పేపర్ వాట్సప్​లో రావడంతో సోమవారం సెలవులో ఉన్న కృష్ణారావును సైట్ బాధ్యతల నుంచి తప్పించి, ఆయనకే పూర్తిస్థాయి బాధ్యతలు ఇచ్చారు. అయితే, ఎస్ఎస్​సీ బోర్డులో 160 శాంక్షన్డ్ పోస్టులుంటే, ప్రస్తుతం130 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వాస్తవానికి దాంట్లో 300 మంది వరకూ సిబ్బంది అవసరమని అధికారులు చెప్తున్నారు.