134 సీట్లతో ఆప్ ఘన విజయం

134 సీట్లతో ఆప్ ఘన విజయం
  • బీజేపీకి 104, కాంగ్రెస్ కు 9 
  • 15 ఏండ్ల బీజేపీ పాలనకు బ్రేక్ 

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 134 సీట్లలో గెలిచింది. బీజేపీ 104 సీట్లలో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ కేవలం 9 సీట్లలోనే గెలిచి, మూడో స్థానానికి పరిమితమైంది. మరో మూడు సీట్లలో ఇండిపెండెంట్లు గెలిచారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 250 వార్డులు ఉండగా, మెజారిటీకి కావాల్సిన సీట్లు 126. మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 4న జరగ్గా, బుధవారం రిజల్ట్ వెల్లడించారు. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 42 సెంట్లర్లలో ఓట్ల కౌంటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ మొదట్లో బీజేపీనే లీడ్ లో ఉంది. ఒకానొక టైమ్​లో 107 సీట్లలో బీజేపీ లీడ్​లో ఉండగా, 95 సీట్లలో ఆప్ లీడ్​లో ఉంది. కౌంటింగ్ జరిగేకొద్దీ పరిస్థితి మారింది. ఆప్ లీడ్​లోకి దూసుకెళ్లింది. చివరికి134 స్థానాల్లో గెలిచి ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

ఆప్ అప్.. కాంగ్రెస్ డౌన్ 

ఇప్పటి వరకు ఢిల్లీలో మూడు కార్పొరేషన్లు ఉండగా, వాటిని ఈ ఏడాది విలీనం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)గా మార్చి ఎన్నికలు నిర్వహించారు. 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 181 సీట్లు సాధించి బీజేపీ అధికారం దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో ఆప్ కేవలం 48 సీట్లలోనే గెలిచింది. కాంగ్రెస్ 30 సీట్లకు పరిమితమైంది. ఐదేండ్లు తిరిగేసరికి ఆప్ ఆధిక్యం సంపాదించింది. ఈసారి ఏకంగా 86 సీట్లు ఎక్కువ సాధించింది. ఇక కాంగ్రెస్ పోయినసారి కంటే 21 సీట్లు తక్కువ గెల్చుకుంది. కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​ను 15 ఏండ్ల నుంచి బీజేపీ ఏలుతోంది. ఇప్పుడు ఆప్ విజయంతో బీజేపీ జైత్రయాత్రకు బ్రేక్ పడింది.

ఆప్ నేతల సంబురాలు..  

పార్టీ విజయంతో ఆప్ నేతలు, కార్యకర్తలు సంబురా లు చేసుకున్నారు. పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్​కు తరలివచ్చారు. లౌడ్ స్పీకర్లు పెట్టి డ్యాన్సులు చేశారు. స్వీట్లు పంచి పెట్టారు. ‘‘ఢిల్లీ మున్సిపాలిటీలోనూ కేజ్రీవాల్ వచ్చారు. వచ్చే ఐదేండ్లు బాగుంటుంది’’ అని హోర్డింగులు పెట్టారు. ‘‘ఆప్ నిజాయతీ గల పార్టీ అని ఈ రిజల్ట్ మరోసారి నిరూపించింది. 17 మంది కేంద్ర మంత్రులు సహా వందలాది మంది టాప్ లీడర్లను ప్రచారంలో దించినప్పటికీ బీజేపీ ఓడిపోయింది” అని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.

ప్రధాని ఆశీర్వాదం కావాలి 

పార్టీని గెలిపించిన ఓటర్లందరికీ ధన్యవాదాలు. ఢిల్లీలో ప్రజలకు అవసరమైన అన్ని సౌలతులు కల్పిస్తం. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ సహా అందరి సహకారం కావాలి. ముఖ్యంగా కేంద్ర సాయం, ప్రధాని ఆశీర్వాదం కావాలి. మున్సిపాలిటీలో అవినీతి లేకుండా చేస్తం. 

- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం 

మాపై ప్రజలకు కోపం లేదు 

పదిహేనేండ్లు ఢిల్లీ ప్రజల కోసం పని చేశాం. మా పనితీరుపై ప్రజల్లో కొంతమందికి అసంతృప్తి కలిగి ఉండొచ్చు. కానీ ప్రజలకు మాపై కోపం లేదు. ఈ ఎన్నికల్లో మా పార్టీ నేతల పెర్ఫామెన్స్ బాగానే ఉంది. 

- ఆదేశ్ గుప్తా, బీజేపీ ఢిల్లీ ప్రెసిడెంట్