ఎంపీ సంతోష్ పై ఈడీకి బక్క జడ్సన్​ ఫిర్యాదు

ఎంపీ సంతోష్ పై ఈడీకి బక్క జడ్సన్​ ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: హరితహారం పేరుతో ఉపాధి హామీ పథకం నిధుల్ని బీఆర్ఎస్ రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్​ దారి మళ్లించారని ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు  ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్   ఫిర్యాదు చేశారు. సోమవారం ఢిల్లీలోని ఈడీ డైరెక్టర్ ను కలిసి దాదాపు నాలుగు పేజీల కంప్లైంట్ కాపీని అందజేశారు. అనంతరం మీడియాకు ఓ వీడియోతో పాటు, కంప్లైంట్ కాపీని రిలీజ్ చేశారు. హరితహారం పేరుతో బీఆర్ఎస్ సర్కార్ 2014 నుంచి 2018 వరకు  రూ. 401 కోట్లను దారిమళ్లించిందని, దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని ఈడీని కోరినట్లు తెలిపారు. గ్రీన్ చాలెంజ్ పేరుతో సంతోష్  ప్రోగ్రాం చేపట్టారని, నిధులన్నీ ఆయన ఖాతాలోకి వెళ్లాయని జడ్సన్​ ఆరోపించారు. ఉపాధి హామీ స్కీం చట్టమైనందునా ఈ డబ్బులను ఇతర పనులకు వాడరాదన్నారు. హరితహారం స్కీం బీఆర్ఎస్ చేసిన బిగ్ స్కాం అని  కంప్లైంట్ కాపీలో ఆరోపించారు.  

ఒక్కో మొక్కను పదిరెట్లు ఎక్కువకు కొన్నరు

హరితహారం ప్రోగ్రాం కోసం ఒక్కో మొక్కను పది రెట్లు ఎక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని జడ్సన్ ఆరోపించారు. వాస్తవానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లు సిటీ పరిధిలో దాదాపు 600 నర్సరీలు ఏర్పాటు చేశాయని తెలిపారు. అయితే  కొన్ని జోనల్ కమిషనర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో చేతులు కలిపి, అరుదైన మొక్కలు అందుబాటులో లేవని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు.  దీంతో ఆ మొక్కలను బయటి నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. ఫ్లోటింగ్ టెండర్ల ద్వారా మొక్కలు కొనుగోళ్లు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారన్నారు. ఈ లెక్కన అటవీ నిర్ణీత ధరల (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ప్రకారం అసలు ధర రూ. 20 ఉంటే, రూ. 120 నకిలీ బిల్లులు తయారుచేశారని ఆరోపించారు. ఇప్పటివరకు రూ. 5,900 కోట్లు ఖర్చు చేయగా ఇందులో దాదాపు 30 శాతం నిధులు స్వాహా చేసినట్లు తనకు సమాచారం ఉందని బక్క జడ్సన్​ తెలిపారు.