
డిగ్రీ కోర్సుల్లో టాప్ బీఏనే.. దేశంలో ఆర్ట్స్ హవా
బీఎస్సీ, బీకాంల వెనుకంజ.. బీఎస్సీలో 50.43 లక్షలే
పీజీ కోర్సుల్లోనూ ఆర్ట్స్‌కే డిమాండ్ ఎక్కువ
ఆర్ట్స్‌తో గవర్నమెంట్ జాబ్ ఈజీగా వస్తుందన్న భావన
హైదరాబాద్, వెలుగు: బీఏకి క్రేజ్ పెరిగిపోతోంది. సైన్స్, కామర్స్‌తో పోలిస్తే ఆర్ట్స్ గ్రూపుకు డబుల్ డిమాండ్ ఉంది. కొన్నేండ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 2018–19 విద్యాసంవత్సరంలో మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో 1,78,13,373 అడ్మిషన్లు జరిగితే, ఒక్క బీఏలోనే 91,98, 205 మంది చేరారు. సగానికిపైగా స్టూడెంట్లు బీఏనే చదువుతున్నారు. బీఎస్సీలో 50,43,732, బీకాంలో 35,71,436 మంది చేరారు. ప్రస్తుతం దేశంలో 993 యూనివర్సిటీల పరిధిలో 39,931 డిగ్రీ కాలేజీలున్నాయి.
ఏటేటా తగ్గుతున్నయ్
బీఏదే హవా అయినా, ఏటేటా అందులో చేరుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది. 2014–15లో 98.60 లక్షల మంది స్టూడెంట్లు బీఏలో చేరితే, 2018–19లో 91.98 లక్షలకు స్టూడెంట్ల సంఖ్య తగ్గింది. బీఎస్సీలో కూడా ఇటీవలి కాలంలో తగ్గుతున్న ట్రెండే కనిపిస్తోంది. 2017–18కి ముందు వరకు ఏటా బీఎస్సీ అడ్మిషన్లు పెరిగినా 2018–19లో మాత్రం స్టూడెంట్లు తగ్గారు. 2017–18లో 51.38 లక్షల మంది బీఎస్సీలో చేరితే, 2018–19లో 50.43 లక్షల మందే ఆ గ్రూపులో చేరారు. అయితే, బీకాంలో మాత్రం అడ్మిషన్లు నిలకడగా పెరుగుతున్నాయి. 2014–15లో 33.38 లక్షల మంది స్టూడెంట్లుంటే, 2018–19లో 35.71 లక్షల మంది బీకాంలో చేరారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ)లోనూ ఆర్ట్స్ హవానే కొనసాగుతోంది. 2018–19లో ఎంఏలో 8,99,653 మంది చేరితే, ఎంకాంలో 3,21,458 మంది, ఎంఎస్సీలో 6,23,114 మంది చేరారు. మూడు కోర్సుల్లోనూ ఏటా అడ్మిషన్లు
పెరుగుతున్నాయి.
బీఏనే ఎందుకు..?
పోటీ పరీక్షల్లో ఆర్ట్స్ విద్యార్థులే టాప్‌లో నిలుస్తుండడంతో, చాలా మంది బీఏనే ఎంచుకుంటున్నారని విద్యావేత్తలు చెబుతున్నారు. సివిల్స్, గ్రూప్స్‌తో పాటు వివిధ ఉద్యోగాలకు అవసరమయ్యే పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్, పాలిటిక్స్, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, తెలుగు సాహిత్యం, సోషియాలజీ తదితర సబ్జెక్టులు బీఏలో ఉంటాయి. దీంతో సివిల్స్ ఆలోచనలున్న స్టూడెంట్స్‌ను వారి పేరెంట్స్ ఆర్ట్స్ కోర్సుల్లో చేర్పిస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీలో భారీగా కాంబినేషన్ కోర్సులు వచ్చాయి. తెలంగాణలో బీఏలోనే 68 రకాల కోర్సులున్నాయి. బీఎస్సీలో 73 ఉండగా, బీకాంలో 13 కోర్సులున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం బీఎస్సీకే ఫుల్ డిమాండ్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో బీకాం ఉండగా, బీఏ చివరిస్థానంలో ఉంది. అయితే, ఇప్పుడిప్పుడే బీఏలోనూ అడ్మిషన్లు పెరుగుతున్నాయి. 2017–18లో 25,537 అడ్మిషన్లుంటే, 2019–20 నాటికి ఆ సంఖ్య 32,722కు పెరిగింది. ఈ విద్యాసంవత్సరం బీఎస్సీలో 90,746 మంది, బీకాంలో 88,871 మంది చేరారు.
For More News..