మజ్లిస్​ ఏరియాలపై బీజేపీ గురి

మజ్లిస్​ ఏరియాలపై బీజేపీ గురి
  • మలక్ పేట్, కార్వాన్​ అసెంబ్లీ స్థానాలపై కమలదళం కన్ను
  • ఎంపీ అసదుద్దీన్​పై బలమైన అభ్యర్థిని నిలిపేందుకు కసరత్తు
  • స్ట్రీట్ కార్నర్ మీటింగ్​లతో జనాల్లోకి
  • పేద ముస్లింలు, మహిళల మద్దతే లక్ష్యంగా ప్లాన్​

హైదరాబాద్, వెలుగు: ‘‘ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తం. 15 మందితో అసెంబ్లీలోకి అడుగుపెడ్తం” అని  మజ్లిస్​ ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఒవైసీ చేసిన ప్రకటనను బీజేపీ చాలెంజ్​గా తీసుకుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేల బలాన్ని పెంచుకునే లక్ష్యంతో ఉన్నామని బాహాటంగా చెబుతున్న ఎంఐఎంను ఎక్కడికక్కడ నిలువరించేందుకు కమలదళం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మజ్లిస్​ పార్టీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్​పార్లమెంటు స్థానం పరిధిలోని పాతబస్తీపై స్పెషల్​ఫోకస్​ పెట్టింది. అక్కడ ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చి..   సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవడమే కష్టమనుకునేలా సెల్ఫ్​ డిఫెన్స్​లో పడేసేందుకు పథక రచన చేస్తోంది. ఓల్డ్​ సిటీ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో ప్రస్తుతానికి గోషామహల్ ఒక్కటే బీజేపీ చేతిలో ఉంది. మిగతా 6 మజ్లిస్​ అకౌంట్​లోనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో మలక్ పేట్, కార్వాన్​ అసెంబ్లీ స్థానాలను ఎలాగైనా గెల్చుకొని తమ పార్టీ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో కాషాయ నేతలు ఉన్నారు. కార్వాన్​ గతంలో బీజేపీ సిట్టింగ్​ స్థానం. ఈ అంశం తమకు  కలిసొస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇక మలక్​పేట్​ సీటు లక్ష్యంగా అక్కడ  కార్యక్రమాలను  బీజేపీ విస్తృతం చేసింది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానంలో మజ్లిస్​ నేత అసదుద్దీన్​ ఒవైసీపై గట్టి అభ్యర్థిని బరిలోకి దింపాలని కమల దళం భావిస్తోంది.  

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాలిచ్చిన విశ్వాసంతో..

గత గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (జీహెచ్​ఎంసీ) ఎన్నికల్లో పాతబస్తీ ఏరియాలో 10 కార్పొరేటర్​ స్థానాలను బీజేపీ గెల్చుకుంది.  ఈ నేపథ్యంలో అక్కడ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు.. బేగంబజార్ కార్పొరేటర్​ శంకర్ యాదవ్​ను  జీహెచ్​ఎంసీలో బీజేపీ  ఫ్లోర్ లీడర్​గా నియమించారు. దేశవ్యాప్తంగా పేద ముస్లింల సంక్షేమం కోసం ప్రధాని మోడీ అమలు చేస్తున్న పథకాలను పాతబస్తీలోని ఇంటింటికి వెళ్లి వివరించే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఈవిధంగా పేద ముస్లింలను, ప్రత్యేకించి ముస్లిం మహిళలను పార్టీ వైపు ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ట్రిపుల్​ తలాక్​పై  నిషేధం వంటి అంశాలను కూడా బాగా ప్రచారం చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ఓల్డ్​ సిటీలో నిర్వహించనున్న  స్ట్రీట్ కార్నర్ మీటింగ్​లను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓల్డ్​ సిటీలోని కాలాపత్తర్ ఏరియాలో బీజేపీ నిర్వహించిన ఒక ప్రోగ్రామ్​ను మజ్లిస్​ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా, బీజేపీ క్యాడర్ ప్రతిఘటించి పార్టీ పట్టును చాటిచెప్పారు. 

భాగ్యలక్ష్మి టెంపుల్ వేదికగా.. 

గత మూడేళ్లలో పార్టీకి సంబంధించిన చాలా కార్యక్రమాలను  ఓల్డ్​ సిటీ లోని భాగ్యలక్ష్మి  టెంపుల్  నుంచే బీజేపీ ప్రారంభించింది. దీంతో అక్కడి క్యాడర్ లో నూతనోత్సాహం వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​తో పాటు ఇతర జాతీయ నేతలు, పలువురు కేంద్ర మంత్రులు హైదరాబాద్ కు వచ్చినప్పుడల్లా పాతబస్తీకి వెళ్లి భాగ్యలక్ష్మి టెంపుల్ ను సందర్శించడం లోకల్​ క్యాడర్ నైతిక స్థైర్యాన్ని పెంచింది. ‘పార్లమెంట్ ప్రవాసీ యోజన’లో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో రెండు  రోజుల పాటు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పర్యటించడం  బీజేపీ క్యాడర్ లో జోష్ నింపింది. పాత బస్తీకి మెట్రో ట్రైన్​వేయాలని..  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే  గచ్చిబౌలి,  హైటెక్ సిటీ మాదిరిగా పాతబస్తీని కూడా అభివృద్ధి చేస్తామని బీజేపీ నేతలు పదే పదే  చెబుతుండటం ఓల్డ్ సిటీ జనాన్ని ఆలోచనలో పడేసింది.  ఇలా పాతబస్తీలో పార్టీని విస్తరించేందుకు ఉన్న  ఏ చిన్న అవకాశాన్ని కూడా బీజేపీ వదులుకోవడంలేదు.