- మద్యం మత్తులో టోల్ ప్లాజా సిబ్బందిపై ఆగ్రహం
- నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద ఘటన
కేతేపల్లి(నకిరేకల్), వెలుగు: నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద ముగ్గురు యువకులు మద్యం మత్తులో శనివారం సాయంత్రం పోలీసులమంటూ హల్ చల్ చేశారు. టోల్ ఫీజు కట్టకుండా ఫేక్ పోలీస్ ఐడీ కార్డులను చూపించి బెదిరించారు. టోల్ ప్లాజా సిబ్బందిని బూతులు తిడుతూ ఆఫీసులోకి చొరబడ్డారు. చివరకు ఐడీ కార్డులను నకిలీవని తేల్చడంతో దొరికిపోయారు. పోలీసుల రాకతో అక్కడినుంచి పరార్ అయ్యారు. యువకుల వీరంగంతో టోల్ ప్లాజా వద్ద కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
హల్ చల్ చేసిన యువకులు సూర్యాపేట నుంచి నకిరేకల్ వైపు కారులో వెళ్తూ టోల్ ఫీజు చెల్లించకుండా కార్డులు చూపించి తప్పించుకునేందుకు యత్నించారు. మద్యం మత్తులోని యువకులు నకిరేకల్ మండలం చందుపట్లకు చెందినవారని తెలిసిందని కేతేపల్లి ఎస్ఐ సతీష్ చెప్పారు.
నకిలీ ఐడీ కార్డులతో హైవేలపై టోల్ ప్లాజాల వద్ద హల్ చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. టోల్ ఫీజు కట్టకుండా తప్పించుకునేందుకు సైరన్లు కొడుతూ హంగామా చేస్తున్నారు. ఎమ్మెల్యే బావమరిదిని అని, మంత్రి బంధువులమని ఫేక్ ఐడీ కార్డులు చూపించి హల్ చల్ చేస్తున్నారు. గత సోమవారం ఇలాంటి ఘటనే కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద జరిగింది.
