రెండు రోజుల్లో మరో చార్జ్ షీట్

రెండు రోజుల్లో మరో చార్జ్ షీట్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో మనీ ల్యాండరింగ్​పై రెండు రోజుల్లో మరో చార్జ్​షీట్ దాఖలు చేస్తామని సీబీఐ స్పెషల్ కోర్టుకు ఈడీ తెలిపింది. అందులో కీలక అంశాలు ఉండనున్నాయని బెంచ్ దృష్టికి తెచ్చింది.  లిక్కర్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్, బోయిన్​పల్లి అభిషేక్ బెయిల్ పిటిషన్లను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టు బుధవారం విచారించింది. చార్జ్​షీట్​లో విజయ్ నాయర్​పై సీబీఐ నిరాధార ఆరోపణలు చేసిందని ఆయన తరఫు లాయర్​ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో రూ.100 కోట్లు చేతులు మారాయని చెబుతోన్న ఈడీ, అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పడం లేదన్నారు. ఒక వేళ సౌత్ నుంచే వస్తే, ఏ రాష్ట్రం నుంచి వచ్చాయో చెప్పలేదన్నారు. రూ.100 కోట్లు ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు వంటి విషయాలనూ చార్జ్​షీట్​లో పేర్కొనలేదన్నారు. ఫోన్లు మార్చుకోవాలంటే ఈడీ, సీబీఐ అధికారుల పర్మిషన్​ తీసుకోవాలా? అని ప్రశ్నించారు. ఫోన్లు మార్చుకోవద్దని ఎక్కడా రూల్​ లేదన్నారు. వాట్సాప్, ఇతర యాప్స్​లలో మెసేజ్​లను తొలగించారనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈడీ వద్ద సరైన ఆధారాలు లేనందున బెయిల్ ఇవ్వాలని బెంచ్​ను కోరారు. 

మా వద్ద అన్ని ఆధారాలున్నయ్​

ఈడీ తరఫున లాయర్​ నవీన్ కుమార్ మట్ట, జియాబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. దర్యాప్తు పూర్తయ్యాకే విజయ్ నాయర్ పై చార్జ్​షీట్​దాఖలు చేసినట్టు కోర్టుకు తెలిపారు. నిందితుల తరఫు లాయర్లు అడుగుతున్న అంశాలపై క్లారిటీ ఇచ్చేందుకు రెండు రోజుల టైమ్​కావాలని కోరారు. కేవలం రెండు రోజుల్లో విజయ్ నాయర్​కు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో చెబుతామన్నారు. సాక్ష్యాలు తారుమారు చేశారని తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. దర్యాప్తు చాలా కీలక దశలో ఉందని, 6న లిక్కర్ స్కామ్​లో మనీ లాండరింగ్​పై సప్లిమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నామని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న జడ్జి నాగ్ పాల్.. చార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగిస్తామన్నారు. బోయినపల్లి  అభిషేక్ బెయిల్ పిటిషన్​ను జనవరి 12కు, విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్​పై విచారణను జనవరి 13కు వాయిదా వేశారు.