ఫెమా రూల్స్​ పాటించలే..రూ. 9 వేల కోట్లు కట్టండి

ఫెమా రూల్స్​ పాటించలే..రూ. 9 వేల కోట్లు కట్టండి

న్యూఢిల్లీ: ఎడ్యుటెక్ స్టార్టప్ బైజుస్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.  ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ (ఫెమా)  నిబంధనలను ఉల్లఘించినందుకు రూ.9 వేల కోట్లు కట్టాలని కోరింది. ఈడీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. బైజుస్ కంపెనీకి 2011 నుంచి 2023 మధ్య ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ (ఎఫ్​డీఐ)ల రూపంలో రూ.28 వేల కోట్ల నిధులు అందాయి.  అయితే, బైజుస్ మాత్రం అదే సమయంలో విదేశీ చట్టాలకు అనుగుణంగా ఓవర్ సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ రూపంలో రూ.9,754  కోట్లను తిరిగి వెనక్కి పంపించింది.

నిబంధనలకు విరుద్ధంగా ఈ లావాదేవీలు జరిగినందున నోటీసులు ఇచ్చామని ఈడీ తెలిపింది. కానీ బైజుస్ మాత్రం ఈడీ నుంచి తమకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పింది.తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఓ ప్రకటన  విడుదల చేసింది. ఫెమా నిబంధనలను తాము ఉల్లంఘించలేదని పేర్కొంది. నోటీసులకు సంబంధించి అధికారుల నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని స్పష్టం చేసింది.