
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) మూడో సారి సమన్లు జారీ చేసింది. బెంగాల్ బొగ్గు స్కామ్ లో ఆయనకు సమన్లు పంపించింది. సెప్టెంబర్ 21న విచారణకు హాజరు కావాలని సమన్లలో ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి నిన్ననే ఢల్లీలోని ఈడీ కార్యాలయంలో అభిషేక్ బెనర్జీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు హాజరుకావాలంటూ తనకు అతి తక్కువ సమయాన్ని ఇచ్చారని... అందువల్ల విచారణకు హాజరు కాలేనని ఈడీకి ఆయన తెలిపారు. దీంతో సెప్టెంబర్ 21న విచారణకు రావాలని తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది.త్వరలో అభిషేక్ బెనర్జీ భార్య రుజిరాను ప్రశ్నించడానికి కూడా ఈడీ సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ నెల 6న ఈడీ విచారణకు ఆయన హాజరయ్యారు. ఆ సందర్భంగా ఈడీ అధికారులు ఆయనను ఎనిమిది గంటలకు పైగా విచారించారు. మరోవైపు మీడియాతో అభిషేక్ మాట్లాడుతూ, విచారణకు తాను అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. కేసు కోల్ కతాకు చెందినదని... అయినప్పటికీ తనకు ఢిల్లీ సమన్లు జారీ చేస్తున్నారని విమర్శించారు. గత నవంబర్ లో తాను చేసిన సవాల్ కు కట్టుబడి ఉన్నానని... తాను తప్పు చేసినట్టు కేంద్ర విచారణ ఏజెన్సీ నిరూపిస్తే పోడియంలో ఉరి వేసుకుని చనిపోతానని చెప్పారు.