
నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో సారి సోనియాను ఈడీ ప్రశ్నించింది. ఇవాళ దాదాపు 6 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. రేపు మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు ఉన్న 90 కోట్ల రూపాయల అప్పును యంగ్ ఇండియాకు బదలాయించడంపై ఈడీ ప్రశ్నలు సంధించింది. యంగ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్న సోనియాకు 38 శాతం వాటా ఎలా వచ్చిందన్న దానిపై కూపీ లాగారు. సోనియా స్టేట్ మెంట్ ను మొత్తం రికార్డు చేశారు. సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. సోనియా హెల్త్ కండీషన్ దృష్ట్యా ఈసారి కూడా ప్రియాంకను ఈడీ అధికారులు అనుమతించారు. రెండు రోజుల విచారణలో భాగంగా సోనియా గాంధీని 55 ప్రశ్నలు అడిగినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
సోనియా గాంధీపై ఈడీ విచారణను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తప్పుపట్టారు. దేశంలో ప్రజాస్వామ్య హక్కులు హరించపడ్డాయన్నారు. కక్ష పూరితంగా సోనియా గాంధీని విచారిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు బలవంతంగా రాహుల్ తోపాటు..75 మంది నేతలను అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. వీలైనంత త్వరగా ద్రవ్యోల్బణం, జీఎస్టీపై చర్చించాలన్నారు. సోనియా గాంధీ ఈడీ విచారణను నిరసిస్తే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేసింది. కేరళ కన్నూరులో యూత్ కాంగ్రెస్ నేతలు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. కక్షపూరితంగానే సోనియాను కేంద్రం విచారిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆందోళన చేశారు. నాగ్ పూర్ లో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడ్డారు. రోడ్డుపై వాహనానికి నిప్పు పెట్టారు.