
న్యూఢిల్లీ : ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారంలో బీబీసీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందని ఈడీ ఆరోపించింది. కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలతో పాటు విదేశీ ఫండ్స్, రెమిటెన్సుల వివరాలను సమర్పించాలని బీబీసీని ఆదేశించింది. గోద్రా మారణకాండ వెనక అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ప్రమేయం ఉందంటూ బీబీసీ ఓ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.
ఇది దేశంలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. డాక్యుమెంటరీ రిలీజైన కొద్దిరోజుల తర్వాత ఢిల్లీ, ముంబైలోని బీబీసీ ఇండియా ఆఫీసుల్లో ఐటీ అధికారులు మూడు రోజుల పాటు సర్వే నిర్వహించారు. బీబీసీ చూపించే ఆదాయం దేశంలోని చట్టాలకు, ఫెమా నిబంధనలను అనుగుణంగా లేవని, ట్యాక్సులు కూడా సరిగ్గా చెల్లించలేదని ఐటీ డిపార్ట్‌మెంట్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) గుర్తించింది. వివిధ భారతీయ భాషల్లో (ఇంగ్లీష్ కాకుండా) ఎక్కువ కంటెంట్ వినియోగిస్తున్నప్పటికి సంస్థ చూపిన లాభాల్లో అవకతవకలు ఉన్నట్లు అధికారులు సర్వేలో వివరించారు.