
ఢిల్లీ : ‘నేషనల్ హెరాల్డ్’ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఐదో రోజు (మంగళవారం) కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) విచారించింది. దాదాపు 10 గంటలపాటు ఏకధాటిగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రధానంగా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)లో సోనియా, రాహుల్ వాటా ఎంత? సంస్థలో ఇంకా ఎవరెవరికి షేర్లు ఉన్నాయి? ఏజేఎల్ సంస్థకు కాంగ్రెస్ ఇచ్చిన నిధులెంత? అప్పులు, ఆస్తుల వివరాలేంటి? వంటి అంశాలపై రాహుల్ ను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మొత్తం 50 గంటలపాటు ఈడీ విచారణను రాహుల్ ఎదుర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో జూన్ 23న విచారణకు హాజరుకావాలంటూ సోనియాగాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది.