
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్‌కు ఈడీ కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది. మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ కోసం ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతకు ముందు సీబీఐ కేసులో మాత్రం ఇద్దరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్‌లో నిందితులుగా ఉన్న అభిషేక్, విజయ్ నాయర్‌ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు సోమవారం రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జడ్జి నాగ్ పాల్ విచారించారు.
అభిషేక్, విజయ్ నాయర్ వీడియో కాన్ఫరెన్స్ లో కోర్టు కు హాజరు కాగా.. టెక్నికల్ సమస్య తలెత్తింది. తొలుత ఈడీ తరఫు సీనియర్ అడ్వకేట్ నవీన్ కుమార్ మట్ట వాదనలు వినిపిస్తూ... అభిషేక్, విజయ్ నాయర్‌ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు. నవంబర్ 8, 13 తేదీల్లో తీహార్ జైల్లో వీరిద్దరిని విచారించినట్లు కోర్టుకు తెలిపారు. సెప్టెంబర్ 6 న విజయ్ నాయర్ నివాసంలో సోదాల సందర్భంగా పీఎంఎల్ఏ సెక్షన్ 17 కింద ఆయన వాంగ్మూలం రికార్డ్ చేసినట్లు వివరించారు. అలాగే, సెక్షన్ 50 కింద అభిషేక్‌ను పిలిపించి సెప్టెంబర్ 17న వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిపారు. జైలులో రెండు సార్లు అభిషేక్ వాంగ్మూలాన్ని నమోదు చేశామని, మొదటి నుంచి అతని సమాధానాలు తప్పించుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు.
అతిపెద్ద కంపెనీలో అభిషేక్ కీలకంగా ఉన్నారని, ఈ విషయాలు రాబట్టేందుకు కస్టడీకి అప్పగించాలని కోరారు. లిక్కర్ స్కాంలో సమీర్ మహంద్రును అదుపులోకి తీసుకున్న మరునాడే ( సెప్టెంబర్ 29) విజయ్ నాయర్ ను సీబీఐ అరెస్ట్ చేసిందని ఆయన తరపు అడ్వకేట్ రెబెక్కా జాన్ వాదనలు వినిపించారు. దాదాపు 35 రోజులుగా నాయర్ కేంద్ర దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉన్నట్లు బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ఇది నిందితుడి హక్కుకు భంగం కలిగించడమేనని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఈడీ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ... 169 లొకేషన్లలో సెర్చ్ చేసిన తర్వాత భారీ రికార్డులు సేకరించామని, ఆ రికార్డులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అభిషేక్ తరపు అడ్వకేట్ శ్రీ సింగ్ వాదనలు వినిపించారు. కాగా.. సీబీఐ కేసులో అభిషేక్, విజయ్ నాయర్‌కు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పూచీకత్తుపై సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. మనీలాండరింగ్‌కు సంబంధించిన ఈడీ కేసులో మాత్రం ఈ నెల 19 వరకు కస్టడీకి అనుమతిచ్చింది. అభిషేక్, విజయ్ నాయర్‌ను కుటుంబ సభ్యులు కలిసేందుకు ఓకే చెప్పింది.