
- ఆదాయంలో 50 శాతం వరకు లోన్లపై వడ్డీకే
- ఫారిన్ రిజర్వ్‌లు 15 బిలియన్ డాలర్లే
- 2023 మేలో దివాలా అంచులకు
- యుద్ధంతో ఇండియాపై తక్కువ ప్రభావం.. మన ఎగుమతుల్లో పాక్‌కు 0.5 శాతమే
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైతే పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఫైనాన్షియల్ కంపెనీ మూడీస్ రేటింగ్స్ అభిప్రాయపడింది. పాకిస్తాన్ ఎకానమీ గ్రోత్‌పై భారం పడుతుందని, ఆర్థిక సంస్కరణలు ఆగిపోతాయని, దీంతో ఆర్థిక స్థిరత్వం సాధించడంలో పాకిస్తాన్ మరింత వెనక్కి వెళ్తుందని ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. దీని ప్రకారం, ఇరు దేశాల మధ్య టెన్షన్స్ పెరిగితే, పాకిస్తాన్‌కు బయటి నుంచి డబ్బు సమీకరించడం కష్టమవుతుంది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్‌లపై ఒత్తిడి పెరుగుతుంది. సమీప భవిష్యత్‌లో విదేశీ రుణాలను పాకిస్తాన్ తీర్చాల్సి ఉంటుంది.
ఇందుకు సరిపడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్‌లు లేవు. ఈ దేశం వద్ద కేవలం 15 బిలియన్ డాలర్ల ఫారిన్ నిల్వలు ఉండగా, భారత్ వద్ద 688 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. ‘‘దివాలా స్థాయికి పడిపోయిన పాక్ ఆర్థిక వ్యవస్థ ఈమధ్య కాలంలో కోలుకుంటోంది. ఎకానమీ వృద్ధి చెందుతుండగా, ఇన్‌ఫ్లేషన్ తగ్గుతోంది. ఫారిన్ రిజర్వ్‌లు పెరుగుతున్నాయి. మరోవైపు, భారత్‌లో ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్నాయి.
ప్రభుత్వం భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. వినియోగం ఊపందుకుంటోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగితే భారత్ ఆర్థిక కార్యకలాపాల్లో పెద్ద ఇబ్బందులు ఉండవు. పాకిస్తాన్‌తో ఇండియా వ్యాపారం చాలా తక్కువగా (2024లో భారత్ ఎగుమతుల్లో 0.5 శాతం కంటే తక్కువ) ఉంది. కానీ, డిఫెన్స్ ఖర్చు పెరిగితే భారత్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పడొచ్చు. ఆర్థిక సంస్కరణలు నెమ్మదిస్తాయి”అని మూడీస్ వెల్లడించింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో టెర్రరిస్టులు 26 మంది టూరిస్టులను చంపిన విషయం తెలిసిందే.
దీనికి ప్రతీకారంగా భారత్ సైనిక దాడి ప్లాన్ చేస్తోందని పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఏప్రిల్ 30న పేర్కొన్నారు. ఈ దాడి తర్వాత రెండు దేశాల దౌత్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. భారత్ 1960 ఇండస్ వాటర్స్ ట్రీటీని రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్‌కు నీటి సరఫరా తీవ్రంగా తగ్గొచ్చు. దీనికి బదులుగా, పాకిస్తాన్ 1972 సిమ్లా శాంతి ఒప్పందాన్ని రద్దు చేసి, ట్రేడ్‌ను నిలిపివేసింది. భారత ఎయిర్‌లైన్స్‌కు తన ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది.
దివాలా తీసి..
కొవిడ్ తర్వాత పాకిస్తాన్ ఎకానమీ పూర్తిగా కుదేలైంది. 50 ఏళ్ల క్రితం దక్షిణాసియాలో అత్యంత సంపన్న దేశంగా ఉన్న పాకిస్తాన్, పాలన బాగోలేకపోవడం, సైనిక నియంతృత్వాలు, టెర్రరిజాన్ని స్టేట్ పాలసీగా ప్రోత్సహించడం వల్ల అత్యంత పేద దేశంగా మారింది. ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపడం, బలూచిస్తాన్‌లో తీవ్రమైన తిరుగుబాటు, దివాలా భయంతో రాజకీయ గందరగోళం ఎదుర్కొంది. టీ ఇంపోర్ట్ చేయడానికి లోన్స్ తీసుకోవాల్సి వస్తోందని, అందుకే తాగడం తగ్గించాలని ఈ దేశ ప్లానింగ్ మినిస్టర్ ఎహసాన్ ఇక్బాల్ చెప్పడం గమనార్హం. ఈ స్టేట్‌మెంట్ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
2023 మేలో పాకిస్తాన్ జీడీపీ 350 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇన్‌ఫ్లేషన్ 38.50 శాతానికి పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంది. గ్రోత్ నెగెటివ్‌గా మారడం, రిజర్వ్‌లు కేవలం రెండు వారాల ఇంపోర్ట్‌లకు సరిపడా తగ్గడం, వడ్డీ రేట్లు 22 శాతానికి పెరగడంతో కుదేలైంది. అప్పుడు కేవలం 3.7 బిలియన్ డాలర్ల రిజర్వ్‌లు మాత్రమే మిగిలాయి. దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో ఉండటం వల్ల లోన్స్ పొందడం కష్టమైంది.
ఈ దెబ్బకు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ 2023 వేసవిలో దివాలా అంచుకు చేరింది. డెట్-టు -జీడీపీ రేషియో 70 శాతం డేంజర్ జోన్‌లో ఉండగా, 2023లో రెవెన్యూలలో 40-–50 శాతం వడ్డీ చెల్లింపులకు వెళ్లాయి, శ్రీలంక, ఘనా, నైజీరియా మాత్రమే ఇంతకంటే దారుణంగా ఉన్నాయి. ఐఎంఎఫ్ నుంచి 3 బిలియన్ డాలర్ల షార్ట్-టర్మ్ బెయిలవుట్ , సౌదీ అరేబియా, యూఏఈ, చైనా నుంచి బిలియన్ల డాలర్ల లోన్స్ తీసుకోవడం వలన డిఫాల్ట్ నుంచి బయటపడింది.
పాకిస్తాన్ ఎకానమీ గడ్డుకాలంలో
పాకిస్తాన్‌కు భారత్‌తో యుద్ధం చేసే సత్తా లేదు. ఈ దేశ ఎకానమీ దివాలా అంచులకు జారుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా తర్వాత దాని ఎకానమీ కుప్పకూలింది. ఇప్పటికీ లోన్స్‌పై ఆధారపడి నడుస్తోంది. భారత్‌తో సైనిక సంఘర్షణ, చిన్నదైనా, నియంత్రించే స్థాయిలో ఉన్నా, పాకిస్తాన్ ఎకానమీ మరింత కుప్పుకూలుతుందనడంలో సందేహం లేదు.
క్లైమేట్ రెసిలియన్స్ లోన్ ప్రోగ్రామ్ కింద 1.3 బిలియన్ డాలర్లు (రూ.11 వేల కోట్లు) , బెయిలవుట్ కింద 7 బిలియన్ డాలర్ల (రూ.60 వేల కోట్ల) ను పాకిస్తాన్‌కు అప్పుగా ఇవ్వాలని ఐఎంఎఫ్ నిర్ణయించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.