చైనా,పాక్ గుట్టు రట్టయింది: ముంబై పోర్ట్లో పాక్ అణ్వాయుధాల సామాగ్రి పట్టివేత

చైనా,పాక్ గుట్టు రట్టయింది: ముంబై పోర్ట్లో పాక్ అణ్వాయుధాల సామాగ్రి పట్టివేత

ముంబై: చైనా నుంచి పాకిస్థాన్ లోని కరాచీకి వెళ్తున్న అనుమానాస్పద ఓడను భారత భద్రతా సంస్థలు నిలిపివేసినట్లు అధికారులు శనివారం(మార్చి2) తెలిపారు. పాకిస్థాన్ అణు, బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమానికి వినియోగించే ద్వంద్వ వినియోగ సరుకు ఉందన్న అనుమానంతో ఓడను ముంబైలోని నవా షెవా పోర్ట్ లో నిలిపి వేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల తెలిపిన దాని ప్రకారం.. కస్టమ్స్ అధికారులు కరాచీకి వెళ్లే మల్టా ఫ్లాగ్ ఉన్న వాణిజ్య నౌక MA CGM అట్టిలాను నిలిపివేశారు. 
ఓడలో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ (సీఎన్సీ) ఉందని.. ఇటలీ దీన్ని తయారు చేసిందని అధికారులు తెలిపారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) బృందం కూడా సరుకును పరిశీలించి పొరుగు దేశం తన అణు కార్యక్రమానికి ఉపయోగించవచ్చన ధృవీకరించింది. ఈ పరికరాలు పాకిస్తాన్ క్షిపణ కార్యక్రమానికి సంబంధించిన కీలకమైన భాగాలను తయారు చేయడంలో సహాయపడుతుందని నిర్ధారించారు. 

లోడింగ్ బిల్లులు, సరుకుకు సంబంధించిన ఇతర వివరాలు వంటి పత్రాలు.. సరుకుదారుని షాంఘై JXE గ్లోబల్ లాజిస్టిక్స్ కో లిమిటెడ్ గా పేర్కొన్నాయి. సియాల్ కోట్ కు చెందిన పాకిస్తాన్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సరుకుదారునిగా పేర్కొన్నారు. భద్రతా సంస్థల లోతైన దర్యాప్తులో 22,180 కిలోల బరువున్న ఈ సరుకును తైవాన్ మైనింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ కో లిమిటెడ్ రవాణా చేసిందన, పాకిస్తాన్ లోని కాస్మోస్  ఇంజనీరింగ్ కోసం పంపిస్తున్నారని అధికారులు వెల్లడించారు. 

2020లో క్షిపణి ఉత్పత్తికి కీలకమైన ఇండస్ట్రియల్ ఆటోక్లేవ్ ను చైనా ఓడలో పారిశ్రామిక సామాగ్రిగా దాచిపెట్టి ఇస్లామాబాద్ కు చైనా అందిస్తున్నదని, పాకిస్తాన్ అణు కార్యక్రమానికి  చైనా సాయం చేస్తోందననే ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఆ ఓడ Dai Cui Yun  హాంకాంగ్ జెండాతో చైనాలోని జియింగ్సు ప్రావిన్స్ లోని యాంగ్జీ నదిపై జియాంగ్విన్ నౌకాశ్రయం నుంచి పాకిస్తాన్ లోని ఖాసిమ్ పోర్ట్ కు వెళ్లింది. ఆటోక్లేవ్ ను స్వాధీనం చేసుకోవడంతో పాకిస్తాన్ నిస్సంకోచంగా క్షిపణుల అక్రమ వ్యాపారానికి పాల్పడుతోందని, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ ని ఉల్లంఘిస్తోందన్న భయాలను బలపరుస్తోంది.