క్రెడిట్ కార్డులపై ఫీజుల మోత.. రికవరీ కోసమేనంటున్న బ్యాంకులు

క్రెడిట్ కార్డులపై ఫీజుల మోత.. రికవరీ కోసమేనంటున్న బ్యాంకులు

ఛార్జీలు, వడ్డీలు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ
ఇతర బ్యాంకులూ ఇదే దారి పట్టే చాన్స్‌
పేమెంట్లు త్వరగా చెల్లిస్తారంటున్న బ్యాంకులు
రికవరీలు మెరుగవుతాయని అంచనా

న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డులపై హెచ్‌డీఎఫ్​సీ బ్యాంక్ ఛార్జీల మోత మోగిస్తోంది. లేట్‌ పేమెంట్ ఫీజులను, వడ్డీ రేట్లను హెచ్‌డీఎఫ్‌సీ   పెంచేసింది. కరోనా మహమ్మారి టైమ్‌లో డిఫాల్ట్స్ పెరుగుతాయనే అంచనాల నడుమ బ్యాంక్‌ ఫీజుల బాదుడు షురూ చేసింది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర బ్యాంక్‌లు కూడా అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. క్రెడిట్ కార్డులపై లేటు పేమెంట్ ఫీజును రూ.150 నుంచి రూ.350 వరకు పెంచింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయని  తెలిపింది. రూ.25 వేలు, ఆపైన ఓవర్‌‌డ్యూ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లకు ఆగస్ట్ 31 వరకు లేట్ పేమెంట్ ఫీజుల కింద బ్యాంక్ రూ.950ను ఛార్జ్ చేసేది. కానీ ఈ నెల ప్రారంభం నుంచి ఈ ఛార్జీలను రివైజ్ చేసింది. రూ.25 వేల నుంచి రూ.50 వేల మధ్య క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లు లేటుగా బిల్‌ కడితే రూ.1,100లు ఫైన్‌ పడుతుంది. రూ.50 వేలపైన ఓవర్‌‌డ్యూ బ్యాలెన్స్ ఉన్న వాళ్లు రూ.1,300 కట్టాలి. 2‌021 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చిన్న మొత్తాల ఓవర్‌‌డ్యూలపై అంటే రూ.10 వేల వరకున్న మొత్తాలపై లేట్ పేమెంట్ ఫీజులను 16–20 శాతం పెంచింది. రూ.25 వేలు, ఆపైన ఓవర్‌‌డ్యూ మొత్తాలపై లేట్ పేమెంట్ ఫీజులను 50–75 శాతం పెంచినట్టు తెలిపింది.

వడ్డీరేట్లు కూడా పెంపు

కొన్ని క్రెడిట్ కార్డుల ‘రివాల్వర్ బ్యాలెన్స్‌’పై(మినిమమ్ డ్యూ కట్టి, మిగిలిన మొత్తాన్ని కట్టకుండా తర్వాత నెలకు వాయిదా వేసుకోవడం) వడ్డీ రేట్లను కూడా పెంచింది. ఇంతకుముందు ఇది నెలకు 3.49 శాతం ఉంటే, ఇప్పుడు 3.6 శాతానికి పెంచింది. లేట్ పేమెంట్ ఫీజులను పెంచడంతో పేమెంట్లలో ఆలస్యాలు తగ్గుతాయని, క్రెడిట్ కార్డులు జారీ చేసే బ్యాంక్‌లకు, నాన్ బ్యాంక్‌లకు రికవరీలు మెరుగవుతాయని ఫైనాన్షియల్‌ సంస్థ మాకరీ రీసెర్చ్ చెబుతోంది. కార్డు కంపెనీల ఫీజుల ఆదాయంలో లేటు పేమెంట్ ఫీజులే 22 శాతం ఉంటున్నాయి.  ఆపరేటింగ్ ప్రాఫిట్‌లో 30 శాతంగా నమోదవుతున్నాయి. యావరేజ్‌గా 15–20 శాతం కస్టమర్లు నెల  వరకు డిఫాల్ట్ అవుతున్నారు. మారటోరియం ముగిసిన తర్వాత నుంచి కార్డు కంపెనీలు లేట్ పేమెంట్ ఫీజులను అమల్లోకి తెస్తాయని మాకరీ చెబుతోంది. జరిమానాలు ఎక్కువగా ఉంటే ఆలస్యం చేయకుండా బిల్స్‌ చెల్లిస్తారని పేర్కొంది.  ఇతర బ్యాంక్‌లు కూడా ఇలాంటి విధానాలనే అమల్లోకి తెస్తాయని చెప్పింది.

ఈఎంఐ కొనుగోళ్లు పెరిగాయ్..

క్రెడిట్ కార్డుల కొనుగోళ్లపై గత ఆరు నెలల నుంచి ఈఎంఐలు కూడా పెరిగాయి. అన్ని సెగ్మెంట్ల కార్డు హోల్డర్లలో ఈ ట్రెండ్ కనిపించిందని  బ్యాంక్  సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ అంగుష్మాన్ ఛటర్జీ చెప్పారు. ఈఎంఐలకు అనుమతి ఇవ్వడం వల్ల  డిఫాల్ట్స్ తగ్గుతాయని అన్నారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి 1.45 కోట్ల  కార్డులు వాడకంలో ఉన్నాయి. క్రెడిట్ కార్డుల మార్కెట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకే లీడర్​. ఆ తర్వాత ఎస్‌బీఐ కార్డ్స్ ఉంది. కేవలం జూన్‌లోనే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల నుంచి 3.6 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. వీటి విలువ రూ.13,471 కోట్లు. కరోనా మహమ్మారితో ఉద్యోగాల కోత, ఇన్‌కమ్ తగ్గిపోవడం ఎక్కువగా ఉన్నందున   డిఫాల్ట్స్ పెరుగుతాయని తెలుస్తోంది. జాబ్​కట్స్​ క్రెడిట్ కార్డు కంపెనీలకు ఆందోళన కలిగిస్తున్నాయని మాకరీ తెలిపింది.

For More News..

ఐపీఎల్‌లో తొలిసారి అమెరికన్‌ ప్లేయర్

జాబ్​ పోయినోళ్లకు కూడా సగం జీతం: లేబర్ మినిస్ట్రీ

ట్యాక్స్​ లెక్కల్లో తేడాలున్నయని​ 5 కోట్లు లంచం అడిగిన్రు

రోడ్డు మధ్యలో మంత్రి ప్రోగ్రాం.. దారి మళ్లిన అంబులెన్స్

రెండున్నరేళ్ల కిందటి ‘రైతుబంధు’ ఇప్పుడిచ్చిన్రు