
- జగిత్యాల జిల్లా వీవీపీ ఉద్యోగుల సీపీఎఫ్, జీపీఎఫ్, ఇతర నిధుల గోల్ మాల్
- రూ. 6.90 కోట్ల నిధుల గోల్ మాల్.. రూ. రెండు కోట్ల రికవరీ
- పలు అంశాల పై మెమో జారీ చేసిన స్పందించని ఆఫీసర్లు
- క్రిమినల్ కేసు నమోదు చేసి, రివకరీ చేయాలని కోరుతున్న ఉద్యోగులు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలోని వైద్య విధాన పరిషత్ లో గోల్‌మాల్ అయిన నిధులను రికవరీ చేయడంలో ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. డిపార్ట్మెంట్ కోసం సర్కార్ కేటాయించిన సొమ్మును కోట్లలో సొమ్ము మాయం చేసినప్పటికీ వీవీపీ (వైద్యా విధాన పరిషత్) స్టేట్ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం.. జిల్లా ఆఫీసర్లు సంబంధం లేనట్లు వ్యవహరించడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతేడాది జూన్‌లో అవినీతి విషయం వెలుగులోకి వచ్చినప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హడావిడి చేసి చేతులు దులుపుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేసి, రికవరీ పేరు తో సస్పెన్షన్ ను పొడిగిస్తూ కాలం వెల్లదీస్తున్నారు.
గతేడాది జూన్ లో..
వైద్య విధాన పరిషత్ డిపార్ట్మెంట్‌లో కోరుట్ల ఆస్పత్రికి నిధులు మంజూరు చేశారు. అప్పటి టీవీవీపీ సూపరింటెండెంట్ సుదక్షిణాదేవి బ్యాంక్ ఓచర్లను సీనియర్ అసిస్టెంట్ యాసిన్ కు అందజేసి బ్యాంకు లో వేయాలని సూచించారు. ఈ బ్యాంక్ ఓచర్లను రూ. 28 లక్షలుగా మార్చిన సీనియర్ అసిస్టెంట్ యాసిన్ ఇన్ ఆపరేటివ్ అకౌంట్‌లో జమ చేసి విత్ డ్రా చేశాడు. దీంతో కోట్లలో నిధులను గోల్ మాల్ చేసినట్లుఆఫీసర్లు గుర్తించారు. బైంసా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇద్దరు అకౌంట్స్ ఆఫీసర్లను ఎంక్వైరీ కమిటీగా నియమించారు. ఈ ఎంక్వైరీలో ఎంప్లాయిస్ ఖాతాలో జమ చేయాల్సిన డీఏ, ఎరియల్స్, సీపీఎస్ ఎరియల్స్, రెగ్యులర్ సీపీఎస్, వివిధ డిడక్షన్స్ కు సంబంధించిన దాదాపు రూ. 6. 90 కోట్ల డబ్బులు పక్కదారి పట్టించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
రూ. రెండు కోట్ల రికవరీ
ఎంక్వైరీ ఆఫీసర్లు ఆడిటింగ్ చేపట్టి ఆఫీసు లావాదేవీలు నిర్వహించే డీహెచ్ క్యూహెచ్, డీహెచ్ఏ బ్యాంక్ అకౌంట్లలో లావాదేవీలను గుర్తించారు. మరో ఇన్ ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్‌కు పర్సనల్ అకౌంట్ మాదిరిగా మొబైల్ యూపీఐ వినియోగించారని తేలింది. దీంతో పాటు సామాన్యుల చెక్కుల పై చిన్న తప్పు ఉంటే కొర్రీలు పెట్టి తిప్పుకునే బ్యాంకర్లు ఓ ప్రభుత్వ ఆఫీస్ కు సంబంధించిన చెక్కును దిద్దినట్లు గుర్తించినా చెక్కును పాస్ చేశారు.
సంబంధిత బ్యాంకర్ పై చర్యలు తీసుకోకపోగా, ప్రమోషన్ ఇచ్చినట్లు వినిపిస్తుంది. నిధుల గోల్ మాల్ ఘటనలో సీనియర్ అసిస్టెంట్ యాసిన్ ను బాధ్యుడిని చేస్తూ ఆఫీసర్లు సస్పెండ్ చేశారు. సస్పెండ్ కు గురైన ఉద్యోగి యాసిన్ నుంచి దాదాపు రూ. 2 కోట్లు రికవరీ చేసి, సస్పెండ్ ను రెన్యూవల్ చేస్తూ కాలం
వెల్లదీస్తున్నారు.
ఆవినీతిని కప్పిపుచ్చేలా స్టేట్ఆఫీసర్ల తీరు..
అవినీతిని కప్పి పుచ్చేందుకే రికవరీ పేరు తో కాలం వెల్లదీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్ర వైద్య విదాన పరిషత్ ఆఫీస్ లో ఓ సెక్షన్ లో కీలకంగా పని చేస్తున్న ఆఫీసర్లకు తాయిలాలు అందడంతోనే జాప్యం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంక్వైరీ కమిటీ దాదాపు రూ. 6.90 కోట్లు మాయమైనట్లు గుర్తించినా మొత్తం ఎంత సొమ్ము దుర్వినియోగమైందో ఇంకా తేల్చలేదు. కాగా ఉద్యోగుల సీపీఎఫ్, జీపీఎఫ్ కు రూ. 2 కోట్లు రికవరీ అయ్యాయి. కానీ మిగితా రూ. 4 కోట్ల సొమ్మును రికవరీ చేయకుండానే సంబంధిత ఆఫీసర్లు చేతులు దులుపుకున్నారు.
క్రిమినల్ చర్యలు తీసుకోవడం లేదు
స్టేట్ ఆఫీస్ నుంచి సంబంధిత జగిత్యాల టీవీవీపీ ఇంచార్జ్ సూపరింటెండెంట్, అకౌంట్ ఆఫీసర్, అకౌంట్ క్లర్క్ లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో అసలు ఎంత సొమ్ము దుర్వినియోగం చేశారు..? ఎంత సొమ్ము రికవరీ చేశారు..? పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. విజిలెన్స్ ఎంక్వైరీ చేపడితే పూర్తి స్థాయి నిధులను రికవరీ చేయడంతో పాటు స్టేట్ ఆఫీస్ లోని ఆఫీసర్ల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.