హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు తీర్పు

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు తీర్పు
  • విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల తిరస్కరణ

విద్యాసంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషన్లపై జిస్టిస్ రితురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు ఉదయం తీర్పు వెలువరించింది. ఇస్లాం ఆచారం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి అని ఎక్కడా లేదని   పేర్కొంది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. హిజాబ్ వివాదంపై మూడు ప్రశ్నలపై సమాధానాలు తెలుసుకున్నామని న్యాయమూర్తులు అన్నారు. ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరా అనే ప్రశ్నకు.. హిజాబ్ ధరించడం మతపరమైన ఆచరణలో భాగమని.. తప్పనిసరి మాత్రం కాదని తెలుసుకున్నామన్నారు. రెండోది ... హిజాబ్ ధరించడం భావప్రకటన స్వేచ్ఛ, గోప్యత హక్కు కిందకు వస్తుందా అని అడగ్గా.. స్కూల్ యూనిఫాం అనేది రీజనబుల్ రిస్ట్రిక్షన్ అని.. దానికి స్టూడెంట్లు అభ్యంతరం చెప్పకూడదని వివరణ వచ్చిందన్నారు. మూడోది.. ఫిబ్రవరి 5నాటి జీవో ఏకపక్షంగా జారీ చేశారా అని ప్రశ్నించగా.. జీవో జారీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

అప్రమత్తమైన పోలీసులు..

హిజాబ్ తీర్పుతో కలబురగి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చింది. మార్చి 19 ఉదయం 6 గంటల వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. విద్యాసంస్థలను కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. శివమొగ్గలోనూ స్కూళ్లు, కాలేజ్ లను మూసివేసినట్లు అధింకారులు తెలిపారు. మార్చి 15 నుంచి 21 మధ్య బెంగళూరులోని బహిరంగ ప్రదేశాల్లో.. గుమిగూడటం, నిరసనలు, వేడుకలు చేయడానికి వీల్లేదని  కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. బెంగళూరులోని హైకోర్టు సీజే జస్టిస్ రితురాజ్ అవస్థి ఇంటిదగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే మంగుళూరు జిల్లాలోనూ సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు.

ఇదీ వివాదం..

కాగా, హిజాబ్ అభ్యంతరాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై 11 రోజుల పాటు వాదనలు విన్న హైకోర్టు ఫిబ్రవరి 5న తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలవరించింది. ఈ ఏడాది జనవరి 1న ఉడుపి ప్రభుత్వ కాలేజ్ లో.. హిజాబ్  ధరించిన ఆరుగురు స్టూడెంట్లను సిబ్బంది లోనికి అనుమతించలేదు. కాలేజ్ రూల్స్ కు విరుద్ధమని, తప్పనిసరిగా కాలేజ్ యూనిఫామ్ తోనే రావాలని స్టూడెంట్లను అడ్డుకున్నారు. ఇక్కడి నుంచే హిజాబ్ వివాదం స్టార్ట్ అయ్యింది. క్యాంపస్ లోకి స్టూడెంట్లను అనుమతించకపోవడంతో.. ముస్లిం స్టూడెంట్లు కాలేజ్ ల దగ్గర నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని విద్యా సంస్థల్లో యూనిఫామ్ నిబంధన తప్పనిసరిగా పాటించాలని ఫిబ్రవరి 5న ఆదేశాలు ఇవ్వగా.. అవి తమకు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొందరు ముస్లిం విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.

మరిన్ని వార్తల కోసం..

కర్ణాటకకు ఇచ్చి మాకివ్వకపోవడం వివక్ష కాదా?

భారత్ సాయాన్ని మరువబోం

ఐపీఎల్ కొత్త రూల్స్.. సూపర్ ఓవర్ లో మార్పులు