నిర్దోషిగా తేలేదాకా వస్తూనేఉంటా : రాబర్ట్​వాద్రా

నిర్దోషిగా తేలేదాకా వస్తూనేఉంటా : రాబర్ట్​వాద్రా

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి రాబర్ట్​ వాద్రా గురువారం మరోసారి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ప్రియాంక గాంధీ స్వయంగా వాద్రాను ఈడీ ఆఫీసులో డ్రాప్‌‌ చేసివెళ్లారు. విచారణకు హాజరయ్యే ముందు వాద్రా సోషల్​ మీడియాలో చేసిన పోస్ట్​ చర్చనీయాంశమైంది. ‘‘ఇప్పటిదాకా 11 సార్లు పిలిచారు. 70 గంటలపాటు ప్రశ్నించారు. నాపై మోపిన తప్పుడు ఆరోపణలు కొట్టుకుపోయి, నిర్దోషిగా తేలేదాకా ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఈడీ విచారణకు వస్తూనేఉంటా’’అని వాద్రా పేర్కొన్నారు. ఇదిలాఉంటే, ఎయిర్‌‌‌‌సెల్‌‌ మ్యాక్సిస్‌‌ కేసులో నిదితులైన కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత పి. చిదంబరం, ఆయన కొడుకు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వాళ్లిద్దరినీ ఆగస్టు 1వరకు అరెస్టు చేయొద్దని కోర్టు సీబీఐని ఆదేశించింది.

నీరవ్‌‌ మోడీ రిమాండ్‌‌ పొడగింపు

లండన్‌‌: పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంక్‌‌ (పీఎన్‌‌బీ) స్కామ్‌‌లో అరెస్టు అయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌‌ మోడీ రిమాండ్‌‌ను లండన్‌‌ కోర్టు జూన్‌‌ 27 వరకు పొడిగించింది. నీరవ్​ బెయిల్​ పిటిషన్​ను గురువారం విచారించిన వెస్ట్‌‌ మినిస్టర్‌‌‌‌ కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నీరవ్‌‌ను ఏ జైల్లో ఉంచాలనే విషయంపై 14 రోజుల్లో నిర్ణయం చెప్పాలని ఇండియా అధికారుల్ని ఆదేశించింది. పీఎన్‌‌బీ స్కామ్‌‌లో ప్రధాని నిందితుడైన మోడీని స్కాట్‌‌ ల్యాండ్‌‌ యార్డ్‌‌  పోలీసులు లండన్‌‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.