అస్తిపంజరాల సరస్సు 

అస్తిపంజరాల సరస్సు 

కొన్నేండ్ల క్రితం..  హిమాలయాల్లోని ఒక సరస్సులో కొన్ని ఎముకలు కనిపించాయి. దాంతో వాటిపై రీసెర్చ్‌‌ చేశారు. అప్పుడు కొన్ని షాకింగ్‌‌ విషయాలు తెలిశాయి. అవేంటంటే.. ఆ ఎముకలన్నీ మనుషులవే. ఒకటి కాదు.. రెండు కాదు.. కొన్ని వందల మంది ఆ సరస్సులో పడి చనిపోయారు. అంతేకాదు.. వాళ్లు చనిపోయి కూడా కొన్ని వందల ఏండ్లు అయింది. అసలు వాళ్లు ఎలా చనిపోయారు? ఎక్కడివాళ్లు? జన సంచారం పెద్దగా లేని మంచు కొండల్లోకి ఎందుకు వెళ్లారు? అనేది ఇప్పటికీ తెలియలేదు.  

త్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లోని ఒక పెద్ద లోయలో రూప్‌‌కుండ్‌‌ సరస్సు ఉంది. హిమాలయాల్లో ‘త్రిశూల్’ పర్వతం కింద సముద్ర మట్టానికి సుమారు 5,000 మీటర్ల ఎత్తులో ఈ రూప్‌‌కుండ్ సరస్సు ఏర్పడింది. 1942లో ఒక బ్రిటిష్ ఆఫీసర్‌‌‌‌ ఈ ప్రాంతానికి వెళ్లాడు. అప్పుడు ఇక్కడ మంచు కింద ఉన్న అనేక అస్తిపంజరాలను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ అస్తిపంజరాలపై రీసెర్చ్‌‌ చేస్తూనే ఉన్నారు సైంటిస్ట్‌‌లు. పెద్ద మొత్తంలో అస్తిపంజరాలు దొరకడంతో ఈ సరస్సును ‘అస్తిపంజరాల సరస్సు’, లేక్ ఆఫ్ స్కెలిటన్స్’ అని పిలుస్తున్నారు. ఇన్నేండ్లు గడిచినా దీనిపై రీసెర్చ్‌‌ చేస్తున్న ఆంత్రోపాలజిస్టులు, సైంటిస్ట్‌‌లు వాళ్లు చనిపోవడానికి గల సరైన కారణాన్ని చెప్పలేకపోతున్నారు. 

గడ్డకట్టి... 
ఈ సరస్సు ఏడాదిలో ఎక్కువ రోజులు గడ్డ కట్టుకుపోయి ఉంటుంది. కేవలం మే, జూన్ నెలల్లో మాత్రమే ఈ సరస్సులో నీళ్లు కనిపిస్తాయి. మిగతా రోజుల్లో ఈ ప్రాంతాన్ని మంచు కప్పేస్తుంది. ఈ టైంలో మాత్రమే ఆ సరస్సులోని అస్తిపంజరాలు కనిపిస్తాయి. పూర్తిగా మంచు, చల్లని వాతావరణంలో ఉండడం వల్ల ఇక్కడ దొరికిన ఎముకల మీద ఇప్పటికీ అక్కడక్కడ మాంసపు ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఇక్కడ దాదాపు 700 నుంచి 800 మంది అస్తిపంజరాలు కనుగొన్నట్టు సైంటిస్ట్‌‌లు చెప్పారు. వాటిని చూసేందుకు చాలామంది టూరిస్ట్‌‌లు ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తుంటారు. 

రాజు... రాణి
ఈ ప్రాంతంలో ఉండేవాళ్లు చెప్పిన దాని ప్రకారం.. దాదాపు వెయ్యేండ్ల క్రితం ఒక రాజు, రాణి... వాళ్ల పరివారంతో కలిసి మరో రాజ్యానికి ప్రయాణమై ఈ దారి గుండా వెళ్లారు. అయితే.. అదే టైంలో ఇక్కడ మంచు తుపాను వచ్చి పెద్ద ప్రమాదం జరిగింది. దాంతో వాళ్లంతా చనిపోయి, వాళ్ల శవాలు కొట్టుకొచ్చి ఈ సరస్సులో పడ్డాయి. అయితే.. వాళ్లంతా చనిపోవడంతో ప్రమాదం గురించి ఎవరికీ తెలియలేదు. అయితే.. వాళ్లు ఏ రాజ్యానికి చెందినవాళ్లు? ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నారనే సమాచారం మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. 

ఇండియన్ సోల్జర్స్‌‌ 
ఇక్కడి ఎముకల గురించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది.  1841లో జమ్ములోని డోగ్రా టిబెటన్లకు మధ్య ఒక యుద్ధం జరిగింది. అప్పుడు టిబెట్‌‌.. చైనా సాయం కోరింది. దాంతో 1841లో చలికాలంలో చైనా, టిబెట్ రాజ్యాల దళాలు డోగ్రా దళాలను ఓడించాయి. తక్లాకోట్ ప్రాంతానికి దగ్గర్లో ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో జనరల్ జోరావర్ సింగ్ చనిపోవడంతో డోగ్రా దళాలు వెనక్కి తగ్గాయి. అప్పుడు యుద్ధం జరిగిన స్థలం నుంచి తిరిగి ప్రయాణమైన కొంతమంది సైనికులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అదే టైంలో ప్రమాదవశాత్తు వాళ్లంతా చనిపోయారని, వాళ్ల అస్తిపంజరాలే సరస్సులో తేలుతున్నాయంటారు కొందరు. కానీ.. సైంటిస్ట్‌‌లు మాత్రం ఈ ఎముకలు చాలా ఏండ్ల క్రితానివని చెప్తున్నారు. 

నందాదేవి మహిమ
ఈ ప్రాంతానికి దగ్గరలో ‘నందాదేవి’ అని పిలిచే ఒక పెద్ద మంచు పర్వతం ఉంది. ఆ పర్వతాన్ని ఈ ప్రాంతంలో దేవతగా కొలుస్తారు. అయితే.. ఆ దేవతను కొలవడంలో ఏదో లోపం జరిగిందని, దాంతో ఇక్కడ రాళ్ల వాన కురిపించిందని చాలామంది నమ్ముతారు. అయితే.. ఆ వర్షంతోపాటు పడిన పెద్ద పెద్ద రాళ్లు తగిలి చాలామంది  చనిపోయారు. వాళ్ల శవాలే వరదతోపాటు ఈ సరస్సులోకి చేరాయని చాలామంది నమ్ముతున్నారు. 

కోపంతో..
స్థానిక కథల ప్రకారం.. ఈ ప్రాంతాన్ని పాలించే రాజు, రాణి విచ్చలవిడిగా ప్రవర్తించేవాళ్లు. అందర్నీ హింసించేవాళ్లు. విలాసంగా జీవితం గడిపేవాళ్లు. దాంతో పర్వత దేవత నందాదేవి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆ రాజు, రాణితోపాటు వందల మంది పరిచారకులను చంపేసింది. వాళ్ల శవాలే ఈ సరస్సులో అస్తిపంజరాలుగా మారాయి. 

వ్యాపారులు 
ఒకప్పుడు ఈ ప్రాంతం గుండా ఇతర దేశాలతో వ్యాపారం చేసేవాళ్లు. సరుకులు కొనేందుకు కొంతమంది వ్యాపారులు ఈ దారి గుండా వెళ్తున్నప్పుడు పెద్ద తుపాన్‌‌ వచ్చింది. ఆ తుపాన్‌‌లో చిక్కుకున్న వ్యాపారులు, వాళ్ల దగ్గర పనిచేసేవాళ్లంతా చనిపోయారు. వాళ్ల ఎముకలే ఇవి అని ఇంకొందరు చెప్తుంటారు. 

పిల్లలు లేరు
కొన్ని దశాబ్దాలుగా ఈ సరస్సుపై రీసెర్చ్‌‌ చేస్తూనే ఉన్నారు. దాంతో కొత్త కొత్త కథనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే.. సైంటిస్ట్‌‌లు మాత్రం ఈ సరస్సుకు సంబంధించిన కొన్ని విషయాలను ఇలా చెప్పుకొచ్చారు. చనిపోయినవాళ్లంతా ఒకే ప్రాంతానికి చెందినవాళ్లు కాదు. ఎందుకంటే.. వాళ్లలో కొందరు బాగా పొడుగ్గా, ఇంకొందరు పొట్టిగా ఉన్నారు. పొడుగ్గా ఉండేవాళ్లు మన దేశానికి చెందినవాళ్లు కాకపోయి ఉండొచ్చు. వాళ్లలో ఎక్కువమంది మధ్య వయస్కులు. 30 నుంచి 40 ఏండ్లవాళ్లే ఎక్కువ. మరో ఇంట్రెస్టింగ్‌‌ విషయం ఏంటంటే.. వాళ్లలో ఒక్కరు కూడా చిన్నపిల్లలు లేరు. ఎక్కడికైనా యాత్రకు వెళ్తే చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. కాబట్టి వాళ్లు యాత్రకు వెళ్లలేదు. వాళ్లలో కొందరు మహిళలు ఉన్నారు. పైగా ఇక్కడ చనిపోయిన వాళ్లంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. 

తీర్థ యాత్రల్లో... 

హిమాలయాల్లో ఉన్న దేవాలయాలకు తీర్థయాత్రల కోసం వెళ్లిన వాళ్లు ప్రమాదాల్లో చనిపోయి ఉంటారని వాళ్ల ఎముకలే ఈ సరస్సులోకి కొట్టుకొచ్చాయని కొందరు అంటున్నారు. మరి కొందరేమో ఏదో మహమ్మారి వచ్చి అందరూ చనిపోయి ఉండొచ్చని చెప్తుంటారు. అయితే.. 19వ శతాబ్దం చివరి వరకు ఈ ప్రాంతంలో తీర్థయాత్రలు జరిగినట్టు ఆధారాల్లేవు. కానీ..   ఇక్కడున్న పురాతన ఆలయాల్లో ఉన్న శాసనాలు 8వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు వేసినవని ఆర్కియాలజిస్ట్‌‌లు గుర్తించారు. అంటే.. ఆ టైంలో తీర్థయాత్రలు జరిగి ఉండొచ్చనేది ఒక అంచనా. ఈ ఆలయాలకు వచ్చిన వాళ్లు చనిపోయి ఉండొచ్చు. ఇక ప్యాండెమిక్‌‌ విషయానికి వస్తే.. వీళ్లు చనిపోయిన కాలం నాటికి ఇక్కడ ఎలాంటి ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్‌‌ ఉన్న ఆధారాలు దొరకలేదు.

సీసీఎంబీ ప్రకారం..  
హైదరాబాద్‌‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఈ సరస్సులో దొరికిన ఎముకలపై దాదాపు పదేళ్లపాటు రీసెర్చ్‌‌ చేసింది. చివరకు సీసీఎంబీ సైంటిస్ట్‌‌లు కొన్ని విషయాలను కనుక్కున్నారు. ఆ ఎముకలు భారతీయ, మధ్యధరా, ఆగ్నేయాసియాలో ఉండే ప్రజలవి. అంతేకాదు.. వాళ్లంతా ఒకేసారి చనిపోలేదు. కాకపోతే వాళ్లలో ఎక్కువమంది 800 నుంచి వెయ్యి సంవత్సరాల మధ్య చనిపోయారు. వాళ్లలో వెయ్యి సంవత్సరాల తేడాతో చనిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లలో ఎక్కువమంది రెండు ఎపిసోడ్లలో చనిపోయారు. 
 

::: కరుణాకర్​ మానెగాళ్ల