ED ముందు హాజరుకాని పవార్

ED ముందు హాజరుకాని పవార్

మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ED ముందు హాజరుకాలేదు. ఈ మధ్యాహ్నం ఆయన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ ముందు హాజరు కావాల్సి ఉండగా…  తాను ED ఆఫీస్ కు వెళ్లడంలేదని ప్రకటించారు. ఉదయం 11గంటల సమయంలో ముంబయి పోలీస్ కమిషనర్, జాయింట్ పోలీస్ కమిషనర్ లు శరద్ పవార్ ఇంటికి వెళ్లి మాట్లాడారు. శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే… ED ఆఫీస్ కు వెళ్లొద్దని పవార్ ను కోరారు. కమిషనర్ల విజ్ఞప్తి మేరకు ED ఆఫీస్ కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు పవార్ తెలిపారు.

మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లో 25వేల కోట్ల కుంభకోణంలో మనీలాండరింగ్ చేశారని శరద్ పవార్ పై ED కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో విచారణకు రావాలని పవార్ కు సమన్లు ఇవ్వలేదు. కానీ తానే ED ఆఫీస్ కు వెళ్తానని పవార్ ప్రకటించారు. అయితే తమ ఆఫీస్ కు రావాల్సిన అవసరంలేదని… అవసరం అయితే తామే పిలుస్తామని ఈడీ అధికారులు పవార్ కు లెటర్ రాశారు. ED లేఖ, పోలీస్ కమిషనర్ విజ్ఞప్తితో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ ఆఫీస్ కు వెళ్లాలనుకున్న తన నిర్ణయాన్ని విరమించుకున్నారు పవార్.

పవార్ పై ED కేసు రాజకీయ అవకాశవాదమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు జరుగుతున్న ఈ పరిణామాలు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని ట్వీట్ చేశారు. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. గతంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న బీజేపీ… ఇప్పుడు ప్రతిపక్షంలేని భారత్ ను కోరుకుంటోందన్నారు.

శరద్ పవార్ కు మద్దతు పలికింది బీజీపీ మిత్రపక్షం శివసేన. కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణంలో పవార్ పాత్ర లేదన్నారు శివసేన నేత సంజయ్ రౌత్. కేసులో పవార్ లాంటి వ్యక్తి పేరు తీసుకురావడం వల్ల మహారాష్ట్రలో అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. స్కామ్ జరిగిన సమయంలో పవార్ అధికారంలో లేరని చెప్పారు.

పవార్ పై ED కేసుతో ఆయన ఇంటికి NCP కార్యకర్తలు వేలాదిగా చేరుకున్నారు. ED ఆఫీస్ కు దగ్గర్లోనే NCP ఆఫీస్ ఉంది. దీంతో ED ఆఫీస్ చుట్టూ సెక్యూరిటీ టైట్ చేశారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.