సిరిసిల్ల నేతన్నకు ఎన్నికల గిరాకీ.. పది లక్షల ఆర్డర్లు

సిరిసిల్ల నేతన్నకు ఎన్నికల గిరాకీ.. పది లక్షల ఆర్డర్లు

రాజన్న సిరిసిల్ల,వెలుగు: ఎలక్షన్స్​ దగ్గరపడుతుండడంతో సిరిసిల్ల నేతన్నలకు గిరాకీ పెరుగుతున్నది. జెండాలు, కండువాల తయారీకి వివిధ పొలిటికల్ పార్టీల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో ఇక్కడి నేత కార్మికులకు చేతినిండా పని దొరుకుతున్నది. తెల్లని వస్త్రాన్ని ఉత్పత్తి చేసి దానిపై వివిధ పార్టీల, నాయకుల గుర్తులు, ఫొటోలతో పూర్తి స్థాయి జెండాలు, కండువాలు సిరిసిల్లలో తయారవుతున్నాయి. ఎలక్షన్ సందడితో నేత కార్మికులకు ఉపాధి లభిస్తున్నది.

బీఆర్ఎస్, వైసీపీ ఆర్డర్లు

తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటికే అందాయి. రెండు రోజుల కింద అందిన ఆర్డర్లతో సిరిసిల్ల నేత కార్మికులు ఉత్పత్తి పనులు ప్రారంభించారు. పార్టీ జెండా తయారీకి మీటరున్నర వస్త్రం, కండువా తయారీకి మీటర్ వస్త్రాన్ని వాడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ 5 లక్షల మీటర్ల ఆర్డర్లను ఇచ్చింది. వైసీపీ కూడా 5 లక్షల మీటర్ల ఆర్డర్లను ఇచ్చింది. ప్రస్తుతానికి రెండు పార్టీలకు సంబంధించిన జెండాలు, కండువాలను తయారు చేస్తున్నారు. జెండాలు తయారు చేసే నేతన్నలు రూ.9 చొప్పున మీటరు వస్త్రాన్ని కొనుగోలు చేస్తారు. దీనికి ప్రింటింగ్ కోసం రూ.8 ఖర్చవుతుంది. ఒక జెండా తయారీకి 17 రూపాయలు ఖర్చవుతుంది. ఉత్పత్తిదారులు ఈ జెండాలను రూ.18నుంచి రూ.19కు విక్రయిస్తున్నారు.

నేత కార్మికులకు ఉపాధి

ప్రస్తుతం జెండాల తయారీతో సిరిసిల్లలో దాదాపు 500 మంది నేత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జెండా కట్ చేస్తే ఒక్కో జెండాకు 25పైసలు, స్టిచింగ్ చేస్తే 40 పైసలు చొప్పున ఇస్తారు. జెండాల తయారీ కార్ఖానాలో జెండాలను కట్ చేస్తూ రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదిస్తున్నారు. జెండాలను స్టిచింగ్ చేసే కార్మికులు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున సంపాదిస్తున్నారు. ఇంకా ఆర్డర్లు పెరిగితే ఈ ఉపాధి పెరగనుంది.

త్వరలో ఇతర పార్టీల ఆర్డర్లు

ఎలక్షన్ టైమ్ లో సిరిసిల్లలో వివిధ పార్టీలు జెండాల తయారీ కోసం సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్ లు ఇస్తారు. అయితే ఈ సారి ముందుగా అధికార పార్టీ 115 మందిని ఎమ్యెల్యే అభ్యర్థులుగా ప్రకటించింది. అధికార పార్టీకి సంబంధించిన ఆర్డర్లు సిరిసిల్లకు అందాయి. కాంగ్రెస్, బీజేపీ, , బీఎస్పీ తదితర పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ఆర్డర్లు వస్తాయని తయారీదారులు చెబుతున్నారు. 

అన్ని జిల్లాలకు సప్లై

సిరిసిల్లలో తయారైన రాజకీయ పార్టీల జెండాలను అన్ని జిల్లాలకు సప్లై చేస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన ప్రింటింగ్ వ్యాపారస్తులు ఎమ్యెల్యే అభ్యర్థుల ఆర్డర్లు తీసుకుని సిరిసిల్లలో ఇస్తుంటారు. సిరిసిల్లలో జెండాలను తయారు చేయించుకుని ఎమ్యెల్యే అభ్యర్థులకు సప్లై చేస్తారు. నేరుగా ఎమ్యెల్యే అభ్యర్థులతోకాక ఇలా మద్యవర్తులతో కూడా కొన్ని ఆర్డర్లు వస్తుంటాయి. ఎలక్షన్ తమకు ఉపాధి చూపుతున్నదని నేతన్నలు, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పది లక్షల ఆర్డర్లు వచ్చాయి

ప్రస్తుతానికి రెండు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల నుంచి పది లక్షల ఆర్డర్లు అందాయి. బీఆర్ఎస్, వైసీపీ పార్టీలకు చెందిన జెండాలను, కండువాలను తయారు చేస్తున్నాం. ఇంకా ప్రధాన పార్టీల ఆర్డర్లు అందలేదు. వివిధ జిల్లాల నుంచి ఎమ్యెల్యే అభ్యర్థులు ఆర్డర్లు ఇస్తుంటారు. నా వద్ద దాదాపు 200 మంది కార్మికులు జెండాల తయారీ ద్వారా ఉపాధి పొందుతున్నారు.

ద్యాపనపల్లి మురళి, జెండాల వ్యాపారి

రోజుకు రూ.500 పడుతున్నయ్​

జెండాల తయారీ వర్క్ చేస్తున్నా. రోజుకు రూ.500 వరకు పడు తున్నయి. ఆగస్టు లో జాతీయ జెండాల తయారీ లో కూడా ఉపాధి దొరికింది. జెండాలను, కుండువాలను కట్ చేస్తాం. కట్ చేసిన వాటిని వేరువేరుగా ప్యాక్ చేస్తాం. ఎలక్షన్ల వల్ల మాకు ఉపాధి దొరుకుతుంది.

కోట అనిత, సిరిసిల్ల