తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత.. సెక్రటేరియట్ ముందు బైఠాయించిన హరీష్ రావు

తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత.. సెక్రటేరియట్ ముందు బైఠాయించిన హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ముందు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు సెక్రటేరియట్ గేట్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. 

అంతకుముందు అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ నుంచి నేరుగా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం దగ్గరకు వచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, యూరియా సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ కమిషనర్‎కు వినతి పత్రం అందజేశారు. 

►ALSO READ | యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా.. అగ్రికల్చర్ కమిషనరేట్ దగ్గర ఉద్రిక్తత..

ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ యూరియూ కొరత లేదన్నారు. మా హయాంలో 35 శాతం బఫర్ స్టాక్ ఉంచేవాళ్లమని పేర్కొన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చ పెట్టండని డిమాండ్ చేసిన హరీష్ రావు.. యూరియా కొరతకు కారణం కేంద్రమో, రాష్ట్రమో తేల్చుదాం అన్నారు. రైతుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వానికి భయమెందుకని నిలదీశారు. రైతాంగం ఇబ్బంది పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం సమీక్ష కూడా చేయడం లేదని విమర్శించారు. యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారని.. అసెంబ్లీలో మొదట చర్చ జరగాల్సింది యూరియా కొరత, వరద నష్టంపై అన్నారు.