లిక్కర్ స్కాం నిందితులకు మరో 7 రోజుల రిమాండ్​

లిక్కర్ స్కాం నిందితులకు మరో 7 రోజుల రిమాండ్​

లిక్కర్ స్కాం నిందితులకు మరో 7 రోజుల రిమాండ్​
పొడిగించిన సీబీఐ స్పెషల్ కోర్టు
దర్యాప్తు కీలక దశలో ఉన్నందున రిలీజ్ చేయొద్దన్న ఈడీ
జనవరి 5న సప్లిమెంటరీ చార్జ్ షీట్
పొడిగించిన సీబీఐ స్పెషల్ కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు : లిక్కర్ స్కామ్​లో అరెస్టయిన బోయినపల్లి అభిషేక్, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్ కు ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు మరో ఏడు రోజుల జ్యూడీషియల్ రిమాండ్ పొడిగించింది. ఈ స్కామ్​లో ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన ఈ నలుగురు నిందితులు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. గతంలో కోర్టు ఈ నలుగురికి విధించిన జ్యుడిషియల్ రిమాండ్ సోమవారంతో ముగిసింది. దీంతో అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌‌‌‌బాబు, విజయ్ నాయర్ లను ఈడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్ ముందు హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశకు చేరుకుందని ఈడీ తరఫు సీనియర్ అడ్వకేట్ నవీన్ కుమార్ మట్ట సీబీఐ స్పెషల్ కోర్టుకు తెలిపారు. దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని బెంచ్ కు నివేదించారు. నిందితులు కస్టడీలో అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు కీలకంగా సాగుతున్నందున నిందితుల కస్టడీ పొడగించాలని ఈడీ కోర్టును కోరింది. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. నలుగురు నిందితులకు మరో 7 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి విచారణ 7 కు వాయిదా వేసారు.

మరికొంత మంది కీలక నేతల పేర్లు!

మనీ ల్యాండరింగ్ కేసులో జనవరి 5 వ తేదీన సప్లిమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు ఈడీ తరఫు న్యాయవాది బెంచ్ కు తెలిపారు. ఈ కేసు వ్యవహారంలో విచారణ సందర్భంగా ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే నిందితులపై విడివిడిగా కాకుండా అందరిపై ఒకే చార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఈసారి ఈడీ వేయబోయే సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో పలువురు కీలక నేతల పేర్లు ఉంటాయని విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ, సౌత్ లాబీకి చెందిన నేతలకు లిక్కర్ స్కామ్ తో లింక్ లపై మరింత స్పష్టత వస్తుందని ఈడీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో తొలుత అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు పై నిరుడు నవంబర్ 26న  ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ –2002 ప్రకారం సెక్షన్ 44, 45 ప్రకారం ఈడీ తొలి చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్ షీట్ ను డిసెంబర్ 20 న సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దాదాపు 3వేల పేజీలతో చార్జ్ షీట్ ను ఈడీ అధికారులు దాఖలు చేశారు. ఇందులో కవితకు స్కామ్ తో ఉన్న సంబంధాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.