ఈడీ ఆఫీసులోకి డాక్టర్లు.. హై టెన్షన్

ఈడీ ఆఫీసులోకి డాక్టర్లు.. హై టెన్షన్

ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ ఎదుట హై టెన్షన్ నెలకొంది. ఉదయం నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్సీ కవిత. సాయంత్రం సమయానికి కవిత తరపున ముగ్గురు లాయర్లతోపాటు.. ఇద్దరు డాక్టర్లు ఆఫీసులోకి వెళ్లటంతో ఉత్కంఠ నెలకొంది. అర గంట గ్యాప్ లోనే.. ఆరు గంటల సమయంలో ఇద్దరు డాక్టర్ల బృందం ఈడీ ఆఫీసులోకి వెళ్లింది. 30 నిమిషాల తర్వాత డాక్టర్ల బృందం బయటకు వెళ్లిపోయింది. ఇందులో ఒకరు మహిళా డాక్టర్ ఉన్నారు. ప్రస్తుతం ఈడీ ఆఫీసు వద్ద నాలుగు వాహనాలతో ఢిల్లీ పోలీసుల ఎస్కార్ వాహనం సిద్ధంగా ఉంది.  ఏం జరుగుతుందనే ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది.

మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి ఈడీ విచారణలోనే ఉన్నారు కవిత. సాయంత్రం ఆరు గంటల తర్వాత.. లాయర్లు, డాక్టర్లను ఈడీ అధికారులు పిలిపించటం.. ఆ వెంటనే బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ లేఖ విడుదల చేయటం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.

ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు మంత్రి కేటీఆర్. ఆయనతోపాటు మరికొంత మంది బీఆర్ఎస్ మంత్రులు వెంట ఉన్నారు. ఈడీ ఆఫీసుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. బారికేడ్లతో కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. ఆఫీసు పరిసరాల్లో ఎవరూ ఉండొద్దని.. అందరూ దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు.