
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆప్ కు చాలా కీలంగా మారాయి. ఈ 2 రాష్ట్రాల్లో విజయం సంగతి పక్కన పెడితే.. రెండింటిలో ఏ ఒక్క రాష్ట్రంలో 6 శాతం ఓట్లు వస్తే ఆప్ కు జాతీయ హోదా దక్కనుండడంతో అందరి దృష్టి ఆప్ పైనే పడింది. దీంతో ఈ ఎన్నికలతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించనుంది.
సాధారణంగా ఏదైనా పార్టీ 4 రాష్ట్రాల్లో 6శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కుతుంది. అయితే ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్.. ఈ మధ్యే గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు గుజరాత్ లో లేదా హిమాచల్ లో గానీ ఏదో ఒక చోట 6 శాతం ఓట్లు దాటితే ఆప్ జాతీయ పార్టీకి అర్హత సాధిస్తుంది. అంటే గుజరాత్ లో కనీసం రెండు సీట్లు గెలిచినా ఆప్ కల నెరవేరినట్టే. అదే గనక జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ తొమ్మిదో జాతీయ పార్టీగా నిలవడంతో పాటు ఈవీఎం మెషీన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ, సింబల్ మొదటి స్థానంలో ఉండనుంది.
2021లో సూరత్ మున్సిపల్ ఎన్నికలలో 28% ఓట్ల వాటాను సాధించి కాంగ్రెస్ స్థానంలో రెండవ అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించింది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా గుజరాత్, హిమాచల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శనను చూపిస్తామని ఆప్ ఇప్పటికే విశ్వాసం వ్యక్తం చేసింది. దీంతో 2024 ఎన్నికలకు జాతీయ పార్టీ హోదాతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న ఆప్‌కి ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఇప్పటివరకు బీజేపీ లీడింగ్ లో ఉండగా, ఆప్ 7 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. హిమాచల్ లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉండగా, ఆప్ ఒక్క స్థానంలోనూ లీడింగ్ లో లేకపోవడం గమనార్హం.