యూత్ ఫిట్ గా ఉండాలంటే.. ఇలా చేయండి

యూత్ ఫిట్ గా ఉండాలంటే.. ఇలా చేయండి

ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ యువతపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే  యువత ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే వారు తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. మరి యువత ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి. యువత ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

శారీరక శ్రమ

 

యువకులు రోజుకు 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ శారీరక శ్రమను ఖచ్చితంగా చేయాలి. రోజుకో గంట  ఇంటెన్సివ్ గా ఉండాలి. దీనివల్ల మీ శ్వాస వేగం పెరుగుతుంది. అలాగే గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. మీరు వారానికి కనీసం 3 రోజులైనా శారీరక శ్రమ చేయాలి. యువకులు వారానికి కనీసం 2 రోజులు  మెట్లు ఎక్కడం లేదా పుష్-అప్స్ వంటి వ్యాయామాలు చేసి  కండరాలను బలోపేతం చేసే కార్యకలాపాల్లో పాల్గొనాలి. వారానికి కనీసం 3 రోజులు జంపింగ్ లేదా రన్నింగ్  చేస్తే ఎముకలు  బలోపేతం అవుతాయి.

ఆరోగ్యకరమైన ఆహారం

 జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారం ఒక ముఖ్యమైన భాగం. ఆరోగ్యకరమైన అల్పాహారంతో పాటుగా రోజుకు 3   సార్లు భోజనం చేయండి. మీ ఆహారంలో ఫైబర్ ను పెంచి ఉప్పు వాడకాన్ని తగ్గించండి. నీళ్లను ఎక్కువగా తాగండి. చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలను నివారించడానికి ప్రయత్నించండి. పండ్ల జ్యూస్ లకు బదులుగా పండ్లనే తినండి. అలాగే వేయించిన ఆహారాలకు బదులుగా కాల్చిన లేదా ఉడకబెట్టిన వాటిని తినండి. వెన్న, స్పైసీ గ్రేవీలను తినకూడదు.  గోధుమలు, బియ్యం, ఓట్స్, మొక్కజొన్న వంటి తృణధాన్యాలను  తీసుకోండి. ముదురు ఆకుపచ్చ, ఎరుపు, నారింజ రంగు కూరగాయలు, బీన్స్ తో సహా వివిధ రకాల కూరగాయలను మీ రోజువారి ఆహారంలో చేర్చండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం డ్రై ఫ్రూట్స్ ను తినండి.  ప్రాసెస్ చేసిన ఆహారం, సోడియం, చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలను తీసుకోకండి.  

తగినంత నిద్ర

నిద్ర మనకు చాలా చాలా అవసరం. నిద్రలో ముఖ్యమైన శరీర విధులు, మెదడు కార్యకలాపాలు జరుగుతాయి. నిద్రపోకపోతే అనేక  అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది  ప్రాణాంతకం కూడా. శ్వాస తీసుకోవడం, నీరు తాగడం, తినడం ఎంత ముఖ్యమో నిద్ర కూడా ఆరోగ్యానికి అంతే ముఖ్యం. ప్రతి రోజూ 8 నుండి 9 గంటలు నిద్రపోవాలి. వారమంతా క్రమం తప్పకుండా నిద్ర విధానాలను అనుసరించండి. వారాంతాల్లో ఆలస్యంగా నిద్రపోవడానికి బదులుగా ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. అలాగే నిర్ణీత సమయంలో మేల్కోవాలి.

ఒత్తిడి నిర్వహణ

ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీ భావోద్వేగ అవగాహనను మెరుగుపరుచుకోండి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం నేర్చుకోండి. లోతైన శ్వాస, యోగా, ధ్యానం, వ్యాయామం, వంటి విశ్రాంతి పద్ధతులను అభ్యసించండి.

మద్యపానం, ధూమపానం

ఒత్తిడికి గురైనప్పుడు మందు, మాదకద్రవ్యాలను ఎప్పుడూ తీసుకోకూడదు. ఎందుకంటే వీటివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు, లైంగిక, మానసిక రుగ్మతలు, హైబీపీ, క్యాన్సర్ వంటి సమస్యలు పెరుగుతాయి. ఎక్కువ ఆల్కహాల్ తాగే వ్యక్తులకు నైపుణ్యాలు, సమన్వయం, అప్రమత్తత లోపిస్తుంది.

స్క్రీన్ సమయాన్ని తగ్గించండి 

స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, గేమింగ్ కన్సోల్స్, టీవీలు, కంప్యూటర్లతో సహా స్క్రీన్లను చూడటంలోనే యువత ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. కానీ ఈ అలవాటు మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎక్కువ స్క్రీన్ టైమ్ నిద్ర సమస్యలు, లక్ష్యాలకు దూరం కావడం, తక్కువ పుస్తకాలు చదవడం, కుటుంబం, స్నేహితులతో తక్కువ సమయం గడపడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం, మూడ్ స్వింగ్స్, ఆత్మగౌరవం వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి 1-2 గంటలకు మించి స్క్రీన్ ను చూడకూడదు. నిద్రకు 1 గంట ముందే స్క్రీన్ ను చూడటం మానేయండి.