మళ్లీ ‘మధ్య’లోకి ట్రంప్

మళ్లీ ‘మధ్య’లోకి ట్రంప్

అగ్రదేశానికి ప్రెసిడెంట్ ఆయన. ప్రపంచానికి నీతులు చెబుతుంటారు. కానీ ఎప్పుడూ మాట మీద నిలబడరు. పూటకోమాట మారుస్తూనే ఉంటారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించే. ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​లతో ఫోన్​లో మాట్లాడి, కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని సుద్దులు చెప్పిన ట్రంప్.. తాజాగా కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. కాశ్మీర్‌‌‌‌ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు సిద్ధమని నెల కిందట కామెంట్ చేశారు. అప్పట్లో ఘాటుగా స్పందించిన ఇండియా.. మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని, కాశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమని స్పష్టంగా తెగేసి చెప్పింది. కానీ ట్రంప్ మాత్రం మధ్యవర్తిత్వానికి రెడీ అని మరోసారి చెప్పారు.

జీ7 సమ్మిట్​లో మోడీతో మాట్లాడుతా

త్వరలో ఫ్రాన్స్​లో జరిగే జీ7 సమ్మిట్​లో ఇండియా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరుపుతామని ట్రంప్ చెప్పారు. వైట్​హౌస్ రిపోర్టర్లతో మంగళవారం (అక్కడి టైం ప్రకారం) ఆయన మాట్లాడారు. కాశ్మీర్​లో పరిస్థితిని చక్కదిద్దేందుకు, సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ‘‘కాశ్మీర్ చాలా సంక్లిష్టమైన ప్రాంతం. చాలా ఏళ్లుగా అక్కడ అలాంటి పరిస్థితి ఉంది. నేను హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. కానీ అక్కడ రెండు దేశాల మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీడియేషన్, లేదా ఇంకేదైనా సరే నేను చేయగలిగినంత చేస్తాను. మోడీ, ఇమ్రాన్​తో నాకు మంచి సంబంధాలున్నాయి. కానీ వాళ్లిద్దరూ ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు. ఇది కఠిన పరిస్థితి” అని చెప్పారు. ‘‘ప్రస్తుతం అక్కడ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇండియా, పాక్ ప్రధానులతో నేను ఫోన్​లో మాట్లాడాను. వారు నాకు స్నేహితులు. ఇద్దరూ గ్రేట్. తమ దేశాలను ప్రేమిస్తున్నారు. కానీ వందల ఏళ్లుగా అక్కడ ‘చర్చలు’ జరుగుతున్నాయి. సమస్య పరిష్కారం కాలేదు” అని పేర్కొన్నారు. కాశ్మీర్​లో హిందువులు, ముస్లింలు ఉన్నారని.. అయితే వారి మధ్య అంతగా సఖ్యత ఉందని నేను అనుకోవడం లేదని కామెంట్ చేశారు.

ఫ్రాన్స్, బ్రిటన్, బంగ్లా మద్దతు

లండన్/ఢాకా/పారిస్: కాశ్మీర్ అంశం ఇండియా, పాక్ మధ్య ద్వైపాక్షిక అంశం మాత్రమేనని ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు స్పష్టం చేశాయి. చర్చల ద్వారానే తమ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సెల్​లో ఫ్రాన్స్ శాశ్వత సభ్యత్వం ఉన్న దేశం కావడం, త్వరలో అక్కడ జీ7 సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ఈ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రధాని మోడీతో ఫోన్​లో మాట్లాడిన ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఈ కామెంట్స్ చేశారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. మంగళవారం పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీతో ఫ్రాన్స్ ఫారిన్ మినిస్టర్ జీన్ డ్రియాన్ భేటీ అయ్యారు. ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయం.. ఆ దేశ అంతర్గత వ్యవహారమని బంగ్లాదేశ్ తేల్చి చెప్పింది. ప్రాంతీయ సుస్థిరత, శాంతిని నెలకొల్పడం అనేవి అన్ని దేశాలకు ప్రాధాన్య అంశాలని ఓ ప్రకటనలో పేర్కొంది. విదేశాంగ మంత్రి జైశంకర్‌‌‌‌.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌‌‌‌ హసీనాకు కాశ్మీర్​ అంశం గురించి వివరించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది.

స్కూళ్లకు ఎవరూ పోతలేరు

శ్రీనగర్: కాశ్మీర్ అంతటా బుధవారం పగటిపూట ఆంక్షలు ఎత్తేశారు. అయితే ఎక్కువ మంది స్టూడెంట్లు మాత్రం స్కూళ్లకు పోలేదు. కాశ్మీర్​లోని చాలా ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేశామని, శ్రీనగర్​సిటీలో కూడా పలు చోట్ల సడలించామని అధికారులు చెప్పారు. చాలాచోట్ల బ్యారికేడ్లను తొలగించామని, అయితే సెక్యూరిటీ ఫోర్సెస్​ను మాత్రం కొనసాగిస్తున్నామని వివరించారు. శ్రీనగర్​లోని దిగువ ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని వివరించారు. ఇక ప్రైవేటు స్కూళ్లలో ఎక్కడా స్టూడెంట్సే కనిపించ లేదు. కొద్దిమంది స్టాఫ్ మాత్రమే అక్కడక్కడ కొన్ని స్కూళ్లలో కనిపించారు. పిల్లలను స్కూళ్లకు పంపేందుకు పేరెంట్స్ భయపడుతున్నారని, ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఆంక్షలు ఎత్తేసిన చోట పబ్లిక్ ట్రాన్స్​పోర్టు వాహనాలు తిరుగుతున్నాయని, అలాగే శ్రీనగర్–జమ్మూ హైవే తెరుచుకుందని, శ్రీనగర్ ఎయిర్​పోర్టు కార్యకలాపాలు మామూలుగానే సాగుతున్నాయని ప్రిన్నిపల్ సెక్రెటరీ రోహిత్ కన్సల్ చెప్పారు. మొత్తం 73 వేల ల్యాండ్​లైన్​ఫోన్లను రీస్టోర్ చేశామని, మిగతావి కూడా త్వరలోనే పని చేస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అటెండెన్స్​కూడా పెరుగుతోందన్నారు. కాశ్మీర్​లోయలోని మార్కెట్స్ ఇంకా మూతబడే ఉన్నాయి. ట్రాన్స్​పోర్టు వాహనాలు రోడ్డెక్కలేదు. ఇక మొబైల్, ఇంటర్నెట్సర్వీసులు.. వరుసగా 17వ రోజూ నిలిపేశారు.