ఎలుకల మందు వంటలో కలిసి మహిళ మృతి 

ఎలుకల మందు వంటలో కలిసి మహిళ మృతి 

ముంబై: ఇరవై ఏడేండ్ల మహిళ ఇంట్లో టీవీ చూస్తూ ఇన్ స్టంట్ నూడుల్స్ తయారు చేసుకున్నది. పొరపాటున అందులో ఎలుకల మందు అంటించిన టమాటాను కూడా కట్ చేసి కలిపింది. దీంతో నూడుల్స్ తిన్న ఆమె ఆస్పత్రిపాలై చనిపోయింది. ముంబైలోని మలాద్ ఏరియాలోని పాస్కల్ వాడి కాలనీకి చెందిన రేఖా నిషాద్ అనే మహిళ తన ఇంట్లో ఎలుకలను చంపేందుకని జులై 21న కొన్ని టమాటాలకు ఎలుకల మందు అంటించి పెట్టింది.

ఆ తర్వాత రోజు ఆమె టీవీ చూస్తూ నూడుల్స్ చేసుకున్నది. టీవీ చూస్తూ వంట చేయడంతో ఎలుకల మందు అంటించిన విషయం మరిచిపోయి ఆ టమాటాను కూడా కట్ చేసుకుని, నూడుల్స్ లో వేసుకుంది. టీవీ చూస్తూ హాయిగా నూడుల్స్ తిన్నది. ఆ తర్వాత కొన్ని గంటలకు ఆమెకు వాంతులు మొదలయ్యాయి. వెంటనే ఆమెను భర్త దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ విష ప్రభావం పెరిగిపోవడంతో ఆమె ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతూ చనిపోయిందని పోలీసులు వెల్లడించారు.